Begin typing your search above and press return to search.

చిరంజీవి 157 ఈ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్?

బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు స‌న్నీడియోల్ ద‌శాబ్ధ కాలంగా పూర్తి స్త‌బ్ధుగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Sep 2023 10:30 AM GMT
చిరంజీవి 157 ఈ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్?
X

బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు స‌న్నీడియోల్ ద‌శాబ్ధ కాలంగా పూర్తి స్త‌బ్ధుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు ఖాన్ ల త్ర‌యానికి ధీటుగా ఓ వెలుగు వెలిగిన ఈ సీనియ‌ర్ న‌టుడి కెరీర్ చాలా సంవ‌త్స‌రాలుగా డైల‌మాలో ఉంది. హిట్టు న‌డిపించే ప‌రిశ్ర‌మ‌లో అది ద‌క్క‌క‌పోతే ఎలా ఉంటుందో స‌న్నీడియోల్ ఒక ఉదాహ‌ర‌ణ‌. ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టుతో ఇదే ప‌రిశ్ర‌మ‌లో ఎంత జోష్ వ‌స్తుందో కూడా అర్థం చేసుకోవ‌డానికి స‌న్నీడియోల్ ఎగ్జాంపుల్‌. ఆయ‌న‌కు వెల్లువెత్తుతున్న ఆఫ‌ర్ల‌ను చూస్తే అస‌లు విష‌యం తెలిసిపోతుంది.

గ‌ద‌ర్ 2తో డియోల్ బంప‌ర్ హిట్ కొట్టాడు. బాలీవుడ్ మొత్తం ఇప్పుడు స‌న్నీడియోల్ ని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతోంది. ప్ర‌ముఖ హీరోలంతా ఇప్పుడు స‌న్నీడియోల్ ని క‌లిసి అభినందిస్తున్నారు. త‌న‌కు శ‌త్రువులుగా ఉన్న చాలామంది హీరోలు గ‌ద‌ర్ 2 విజ‌యం సాధించాక స‌న్నీడియోల్ ని కలిసి మ‌రీ అభినందించారు. ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ తో వీళ్లంతా తిరిగి స్నేహితుల‌య్యారు. ఇది వింతైన రంగ‌ల ప్ర‌పంచం అనడానికి ఇది చాలు.

ఇప్పుడు అలాంటి ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ టాలీవుడ్ సీనియ‌ర్ క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవికి అవ‌స‌రం. పాన్ ఇండియా ట్రెండ్ లో స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డాల్సిన సంద‌ర్భం ఇదే. అంతేకాదు.. నేటిత‌రం పాన్ ఇండియా స్టార్ల‌తో పోటీప‌డుతూ మెగాస్టార్ 500కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టాల‌ని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే చిరు అలాంటి ఒక అద్భుత‌మైన కంటెంట్ ఉన్న సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నారా? అంటే అవున‌నే టాక్ కూడా వినిపిస్తోంది.

మెగాస్టార్ న‌టించిన క్లాసిక్ హిట్ చిత్రం `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్ గురించి చాలా కాలంగా చ‌ర్చ సాగుతూనే ఉంది. కానీ దీనికి సీక్వెల్ తీసేందుకు వైజ‌యంతి మూవీస్ సంస్థ ఎన్ని ప్ర‌యత్నాలు చేసినా కానీ కుద‌ర‌లేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ భోళా శంక‌ర్ లాంటి ఫ్లాప్ త‌ర్వాత కెరీర్ ని రీవ్యాంప్ చేసేందుకు ఇలాంటి ఒక క్లాసిక్ సీక్వెల్ తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన `మెగా157` బ‌హుశా ఒక సీక్వెల్ సినిమా అంటూ ప్ర‌చారం సాగుతోంది. ఈ చిత్రం ఒక ఫాంటసీ ఎంటర్‌టైనర్ అని చెబుతున్నారు. ఆకట్టుకునే కథ-కథనం ఊహాత్మక అంశాలతో నిండిన క‌థ‌తో చిరంజీవి తిరిగి కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న గుస‌గుస వినిపిస్తోంది. కొంద‌రు దీనిని 1990లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి సీక్వెల్ అని కూడా ప్ర‌చారం చేస్తున్నారు.

ఫాంట‌సీ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో క‌థాంశాన్ని ఎంపిక చేసుకుని ఐశ్వ‌ర్యారాయ్ లాంటి అంద‌గ‌త్తెను ఎంపిక చేయాల‌ని యువి క్రియేషన్స్ బ్యాన‌ర్ ప్ర‌య‌త్నించ‌డం వంటి అంశాలు నిజంగానే ఇది జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్ అయి ఉంటుంద‌న్న సందేహాల్ని రేకెత్తించాయి. అయితే దీనిపై మెగా కాంపౌండ్ ఎలాంటి లీకులు ఇవ్వ‌లేదు. ఇది నిజంగానే నాటి మేటి క్లాసిక్ హిట్ కి సీక్వెల్ అయితే ఎంత బావుంటుందో అంటూ అభిమానులు ఆశ‌గా ఉన్నారు. కానీ దీని గురించి అధికారికంగా చిరు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. ఈ సినిమా కథాంశం పటిష్టంగా ఉందని, దర్శకుడు వశిష్ట విజయవంతంగా స్క్రిప్ట్‌ను రూపొందించారని సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ ప‌నులు సాగుతున్నాయి. ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనుంద‌ని తెలుస్తోంది.

ఇటీవలి వార్తల ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించేందుకు ఐశ్వర్యరాయ్‌ని సంప్రదించారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని, వారిలో ఐశ్వర్యరాయ్ ఒకరు అని కూడా ప్రచారం జరుగుతోంది. అనుష్క శెట్టి - మృణాల్ ఠాకూర్ ఎంపిక‌య్యార‌ని కూడా టాక్ ఉంది. తారాగణానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీతం ఎం. ఎం. కీరవాణి స్వరాలు సమకుర్చనున్నారు.

మెహర్ రమేష్ దర్శకత్వం వ‌హించిన `భోలా శంకర్` తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. అందుకే ఇప్పుడు ఘ‌న‌మైన కంబ్యాక్ కోసం చిరు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇది క‌చ్ఛితంగా జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్ అయితే బావుంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. కానీ దీనిపై వైజ‌యంతి మూవీస్ ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. ఈ క్లాసిక్ సీక్వెల్ తీయాలంటే క‌చ్ఛితంగా ఈ ప్రాజెక్ట్ వైజ‌యంతి బ్యాన‌ర్ లో మాత్ర‌మే చేయాల్సి ఉంటుంది. ఇక‌ యువి క్రియేష‌న్స్ సంస్థ‌ ఎంపిక చేసిన ఫాంట‌సీ స్క్రిప్టు యూనిక్ గా ఉంటుందా? లేదా చిరు న‌టించిన క్లాసిక్ జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమాకి ప్యార‌ల‌ల్ గా ఉంటుందా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై మ‌రింత స్ప‌ష్ఠ‌త అవ‌స‌రం.