విశ్వంభర: ఈ కన్ఫ్యూజన్ తీరేదెప్పుడు?
తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రం 2026 వేసవికి విడుదలయ్యే అవకాశం ఉందని మరో కొత్త రూమర్ వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 1 July 2025 12:30 PMటాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత విభిన్నమైన కథా నేపథ్యంతో రూపొందుతోన్న సినిమా విశ్వంభర. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తొలి ప్రీ లుక్ పోస్టర్‌నే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కానీ అప్పటి నుంచి మేకర్స్ నుంచి ఎలాంటి స్పష్టమైన అప్డేట్ రాకపోవడం, టీజర్‌కు వచ్చిన నెగిటివ్ రియాక్షన్స్ సినిమాపై ఉన్న హైప్‌ను తగ్గించేస్తోంది. ఇక అభిమానులైతే ఈ కన్‌ఫ్యూజన్ ఎప్పుడు ముగుస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రం 2026 వేసవికి విడుదలయ్యే అవకాశం ఉందని మరో కొత్త రూమర్ వైరల్ అవుతోంది. ముందుగా సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ, వీఎఫ్ఎక్స్ పనుల జాప్యం, చిరంజీవి మరో సినిమాతో బిజీగా ఉండడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు. వీఎఫ్ఎక్స్ పనులు ప్రస్తుతం పూర్తయిన దశలో ఉన్నా, చిరంజీవి ఫైనల్ కట్ చూసే సమయం దొరకకపోవడం వల్ల చిత్రబృందం మెగాస్టార్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది.
మెగాస్టార్ చూసినా మళ్ళీ ఏమైనా చేంజేస్ చెబితే దానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఇక దర్శకుడు వశిష్ఠ మాత్రం పూర్తి డెడికేషన్‌తో ప్రాజెక్టుపై పని చేస్తున్నారని సమాచారం. 'బింబిసార' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వశిష్ఠ.. ఆ క్రేజ్‌ను నిలబెట్టుకోవడానికి ‘విశ్వంభర’ను తన కెరీర్‌ను నిర్ణయించే సినిమాగా భావిస్తున్నాడు. ఈ సినిమాలో ఏ చిన్న లోపం వచ్చినా ప్రభావం అతని ప్రొఫెషనల్ ఇమేజ్‌పై పడే అవకాశం ఉండటంతో, విజువల్స్, వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకుండా రాత్రి పగలు ఒకటిగా చేసి పని చేస్తున్నాడట.
సినిమాపై ఆరంభంలో క్రియేట్ అయిన బజ్ ఇప్పుడు తగ్గిపోతున్న విషయం పరిశ్రమ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి వివిధ ఈవెంట్లలో కనిపించినా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉన్నా, ఎక్కడా విశ్వంభర గురించి మాట కూడా ప్రస్తావించకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. ఇలా చిరంజీవి మౌనం వలననే సినిమాపై అనుకున్నంత ట్రెండ్ రావడంలేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే మెగా ఫ్యాన్స్ చాలా మంది దృష్టి మెగా 157 సినిమా మీదే ఉంది. వచ్చిన ఫోటోలు, ఇంటర్వ్యూలు, బజ్ అన్నింటిలోనూ దాని హవా స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ‘విశ్వంభర అంటే మాకు తెలియదు’ అన్నట్టుగా ఫ్యాన్స్ సెల్ఫ్ ట్రోల్స్ మొదలుపెట్టారు. అంటే అభిమానులే అలా అనిపించుకునే స్థితి రావడమే నిజానికి డేంజర్ బెల్. ఇకనైనా మేకర్స్ స్పష్టత ఇవ్వకపోతే ఈ సినిమా బిజినెస్ పై ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరి మేకర్స్ సినిమాపై ఉన్న కన్ఫ్యూజన్ కు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.