Begin typing your search above and press return to search.

మెగా 'విశ్వంభర' లో నాగిని ఏం చేయబోతుంది?

కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న విశ్వంభర నుంచి మెల్ల మెల్లగా పాటలను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   1 July 2025 10:45 AM IST
మెగా విశ్వంభర లో నాగిని ఏం చేయబోతుంది?
X

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' సినిమా ముందుగా అనుకున్న ప్రకారం 2025 సంక్రాంతికి రావాల్సింది. ఆ సంక్రాంతి పోయి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు విశ్వంభర వచ్చేది ఎప్పుడు అనే క్లారిటీ లేదు. ఒకానొక సమయంలో విశ్వంభర సినిమా గురించి మాట్లాడుకోవడం కూడా మానేశారు. సినిమా ఔట్‌ పుట్‌ విషయంలో అసంతృప్తిగా ఉన్న కారణంగా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ విషయంలో ఎక్కువ సమయం తీసుకోవాలని నిర్ణయించారు. అందుకే నెలల తరబడి విశ్వంభర వాయిదా వేస్తూ వస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫైనల్‌ షెడ్యూల్‌ సైతం పూర్తి చేయాల్సి ఉందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్‌ చివరి షెడ్యూల్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు.

వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఒక వైపు జరుగుతూ ఉంటే మరో వైపు షూటింగ్‌ ఫినిష్‌ చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌ను ఈ చివరి షెడ్యూల్‌లో షూట్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌కి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఊర్వశి రౌతేలా కాకుండా బాలీవుడ్‌ మరో బ్యూటీ మౌని రాయ్‌ను ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌కి తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. మౌని రాయ్‌ టాలీవుడ్‌లో ఈ ఐటెం సాంగ్‌తో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు ఆమె తెలుగులో నటించకున్నా బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు.

హిందీలో సూపర్ హిట్‌ అయిన పలు సీరియల్స్‌లో మౌని రాయ్ నటించింది. ప్రధానంగా నాగినిగా మౌని రాయ్‌ ఉత్తర భారతంతో పాటు దక్షిణ భారతంలోనూ ఫేమస్ అయింది. ఆ మధ్య బ్రహ్మాస్త్ర సినిమాలో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. ఇలా మౌని రాయ్‌ సినిమాలు, సీరియల్స్‌తో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ పాపులారిటీ కచ్చితంగా విశ్వంభర సినిమాకు హెల్ప్‌ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ మధ్య కాలంలో విశ్వంభర ఐటెం సాంగ్‌ గురించి ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒక ప్రత్యేక ట్యూన్‌ను రెడీ చేయించారని, ఇతర పాటలతో పోల్చితే ఈ ఐటెం సాంగ్‌ చాలా స్పెషల్‌గా ఉంటుందని అంటున్నారు.

కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న విశ్వంభర నుంచి మెల్ల మెల్లగా పాటలను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటించగా, హీరో సిస్టర్స్‌ పాత్రలో ఐదు.. ఆరు మంది హీరోయిన్స్‌ నటించారని తెలుస్తోంది. సినిమాలో భారీ తారాగణం ఉండబోతుంది. అంతే కాకుండా ఈ సినిమా భారీ సోషియో ఫాంటసీ సినిమాగా ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత చేసిన సోషియో ఫాంటసీ సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. విశ్వంభర కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2026 సంక్రాంతికి చిరు-అనిల్ రావిపూడి సినిమా విడుదల కాబోతుంది. కనుక ఈ లోపు విశ్వంభర విడుదల చేయాలి, అది సాధ్యం కాకుంటే 2026 సమ్మర్‌ వరకు విశ్వంభర వెయిట్‌ చేయాల్సిందే.