విశ్వంభర వేరే లెవెల్ అట..!
భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 July 2025 4:00 PM ISTభోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార తర్వాత వశిష్ట చేస్తున్న సినిమా కావడం, దానికి తోడు చిరంజీవి ఎంతో కాలం తర్వాత చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా కావడంతో విశ్వంభర మూవీపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వశిష్ట ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి అయితే విశ్వంభర ఎప్పుడో రిలీజవాల్సింది కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది రిలీజైన విశ్వంభర టీజర్ లోని వీఎఫ్ఎక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయని అందరూ తీవ్రంగా విమర్శలు చేయడంతో మేకర్స్ దాన్ని సీరియస్ గా తీసుకుని వీఎఫ్ఎక్స్ బాధ్యతల్ని మరో కంపెనీకి అప్పగించి మళ్లీ అంతా మొదటినుంచి చేసుకుంటూ వస్తున్నారు.
అందుకే విశ్వంభర అనుకున్న దాని కంటే లేటవుతూ వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తవగా, ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉందంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ను ఎంపిక చేశారని కూడా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది.
విశ్వంభరలోని ఫుటేజ్ ను కొంతమేర చూసిన డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా వేరే లెవెల్ అని, విశ్వంభర కోసం డైరెక్టర్ వశిష్ఠ సృష్టించిన ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉందని చెప్తున్నారు. వాస్తవానికి విశ్వంభర సినిమా మొదలైనప్పుడు సినిమాపై అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి మధ్యలో టీజర్ లోని వీఎఫ్ఎక్స్, ఆ తర్వాత జరుగుతున్న ఆలస్యంతో సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టి సాలిడ్ కంటెంట్ ను పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ల రూపంలో రిలీజ్ చేస్తే విశ్వంభరకు హైప్ పెరగడం చాలా ఈజీ. కాబట్టి మేకర్స్ ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి పెడితే చాలా బెటర్. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.