చిరు కోసం ఒక్క పాటకు అంత ఖర్చు చేశారా?
చిరుపై `రామ..రామ` అంటూ సాగే గీతాన్నిభారీగా చిత్రీకరించారు. ఈ పాటని ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా దీనికి సంబంధించిన లిరికల్ వీడియోని విడుదల చేయడం తెలిసిందే.
By: Tupaki Desk | 15 April 2025 11:21 AM ISTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామా `విశ్వంభర`. భారీ ఫ్లాపుల తరువాత చిరు చాలా కేర్ తీసుకుని చేస్తున్న మైథలాజికల్ డ్రామా కావడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పడింది. అంతే కాకుండా `బింబిసార`తో దర్శకుడిగా తొలి హిట్‌ని దక్కించుకున్న యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట చేస్తున్న సినిమా కావడం, చాలా రోజుల తరువాత చిరు యంగ్ డైరెక్టర్‌తో చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ మూవీలో అవే ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయట.
ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ తరవాత ఈ మూవీ గ్రాఫిక్స్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో టీమ్ అలర్ట్ అయి వాటిని చక్కదిద్దే పనిలో పడింది. ఇదిలా ఉంటే ఈ మూవీలోని ఓ పాట కోసం టీమ్ ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిరుపై `రామ..రామ` అంటూ సాగే గీతాన్నిభారీగా చిత్రీకరించారు. ఈ పాటని ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా దీనికి సంబంధించిన లిరికల్ వీడియోని విడుదల చేయడం తెలిసిందే. రామజోగయ్య శాస్త్రి రచించగా, కీరవాణి సంగీతం అందించారు.
భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాటలో 400 మంది డ్యాన్సర్లు, 400 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు, 15 మంది నటీనటులు పాల్గొన్నారు. 4 భారీ సెట్స్‌లో దాదాపు 12 రోజుల పాటు ఈ పాటని చిత్రీకరించారట. సినిమాకు ఈ పాట మెయిన్ హైలైట్‌గా నిలవనుందని ఇన్ సైడ్ టాక్. ఈ పాట కోసం వేసిన భారీ సెట్స్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తాయట. ఇప్పటికే మేకింగ్ పరంగా ఆలస్యం అవుతూ వస్తున్న ఈ మూవీని జూన్ 24న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మే నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్న మేకర్స్ ఒక్కో లిరికల్ సాంగ్‌ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కోసం ఓ మాస్ సాంగ్‌ని చిరుపై తీయబోతున్నారట. అయితే ఈ పాట కోసం కీరవాణి చేసిన ట్యూన్ చిరుకు నచ్చకపోవడంతో దాన్ని పక్కన పెట్టి మరో మాస్ బీట్‌ని కీరవాణి రెడీ చేస్తున్నారని, అది పూర్తి కాగానే చిరుపై మాస్ స్టెప్పులతో ఈ పాటని షూట్ చేస్తారని తెలిసింది. ఇది ఓ మాస్ ఐటమ్ నంబర్. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ మెరవనుందని ఇన్‌సైడ్‌టాక్.