పోలీస్ డ్రెస్ వేయనున్న సీనియర్ హీరోలు?
చిరంజీవి కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అనిల్ తన గత సినిమాల కంటే వేగంగా ఈ సినిమాను పూర్తి చేస్తున్నారు.
By: Tupaki Desk | 9 July 2025 5:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అనిల్ తన గత సినిమాల కంటే వేగంగా ఈ సినిమాను పూర్తి చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
అనిల్ రావిపూడికి కామెడీ ఎంటర్టైనర్లను బాగా హ్యాండిల్ చేస్తారనే పేరుంది. అలాంటి అనిల్ రావిపూడికి ఇప్పుడు మంచి కామెడీ టైమింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి దొరికారు. వీరిద్దరూ కలిసి ఎలాంటి ఎంటర్టైనర్ ను ఆడియన్స్ కు అందిస్తారోనని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ క్యామియో చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని రీసెంట్ గా అమెరికాలో జరిగిన నాట్స్ లో విక్టరీ వెంకటేష్ కూడా కన్ఫర్మ్ చేశారు. చిరంజీవితో వెంకీకి ఉన్న అనుబంధంతో పాటూ, అనిల్ రావిపూడితో కలిసి మూడు సినిమాలు చేయడం వల్ల ఏర్పడిన బాండింగ్ తో వెంకీ ఈ సినిమా చేస్తున్నారు. అయితే మెగా157లో వెంకీ క్యారెక్టర్ కు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
మెగా157లో వెంకటేష్ చేస్తుంది క్యామియో కాదని, సినిమాలో ఆయన పాత్ర దాదాపు గంట పాటూ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, సినిమాలో చిరూ- వెంకీ అండర్ కవర్ పోలీసులుగా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో పాల్గొననున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వీరిద్దరి మధ్య మంచి కామెడీ ట్రాక్ ను అనిల్ ప్లాన్ చేశారట. అంటే ఆడియన్స్ ను నవ్వించడానికి సీనియర్ హీరోలిద్దరూ పోలీస్ డ్రెస్ వేసుకోనున్నారన్న మాట. ఇదే నిజమైతే టాలీవుడ్ ఆడియన్స్ కు పండగనే చెప్పాలి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, 2026 సంక్రాంతికి మెగా157 ప్రేక్షకుల ముందుకు రానుంది.
