రంగంలోకి దిగారు: ఇక్కడ చిరంజీవి - అక్కడ సల్మాన్ భాయ్!
టాలీవుడ్ విషయానికి వస్తే... గత కొంతకాలంగా థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య థియేటర్లకు అద్దెలు, పర్సంటేజీల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది.
By: Sivaji Kontham | 30 May 2026 12:12 AM ISTప్రస్తుతం భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన చిత్ర పరిశ్రమలలోనూ అంతర్గత వివాదాలు, సంక్షోభాలు చుట్టుముట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలాంటి క్లిష్ట సమయాల్లో పరిశ్రమను నడిపించడానికి.. సమస్యలను సామరస్యపూర్వకంగా ముగించడానికి అగ్ర తారలు పెద్దరికం వహించడం భారతీయ సినిమా సంస్కృతిలో ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతల మధ్య నడుస్తున్న తీవ్రమైన థియేటర్ రెంటల్స్, ఆదాయ పంపిణీ సమస్యకు టాలీవుడ్ `అన్నయ్య` మెగాస్టార్ చిరంజీవి తన చొరవతో పరిష్కారం అందిస్తుండగా.. అటు బాలీవుడ్‌లో రణ్‌వీర్- ఫర్హాన్ వివాదాగ్నిని చల్లార్చేందుకు సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు సల్మాన్ బరిలో దిగడం విశేషం. రెండు పరిశ్రమలలోనూ ఈ ఇద్దరు అగ్ర నటులు వివాదాల పరిష్కారకర్తలుగా మారడంపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
టాలీవుడ్ విషయానికి వస్తే... గత కొంతకాలంగా థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య థియేటర్లకు అద్దెలు, పర్సంటేజీల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ సమస్యను దాదాపుగా పరిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి, ఇండస్ట్రీ సంక్షేమం కోసం ఇరు వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి పెద్ద దిక్కుగా నిలిచారు. ప్రస్తుతం పెద్ది రిలీజ్ కి లైన్ క్లియర్ కాగా జూన్ 30 నాటికి కమిటీ రిపోర్ట్ అందేప్పటికి పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుంది.
అదే తీరుగా బాలీవుడ్‌లో `డాన్ 3` ప్రాజెక్ట్ విషయంలో రణ్‌వీర్ సింగ్, ఫర్హాన్ అఖ్తర్ మధ్య నెలకొన్న మనస్పర్థలను తొలగించడానికి సల్మాన్ ఖాన్ స్వయంగా మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఈ వ్యవహారంలో సల్మాన్‌కు ఉన్న కనెక్షన్ ఏమిటనే కోణంలో పరిశీలిస్తే.... దీని వెనుక ఒక అద్భుతమైన ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ కనిపిస్తుంది. ఫర్హాన్ అఖ్తర్ తండ్రి జావేద్ అఖ్తర్.. గతంలో సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్‌తో కలిసి `సలీమ్-జావేద్` పేరుతో రైటింగ్ పార్ట్‌నర్‌షిప్‌ను నడిపారు. 1980లలో వీరిద్దరూ విడిపోయిన తర్వాత చాలా కాలం పాటు మాటల్లేకుండా ఉన్నా 2024లో వచ్చిన `ది యాంగ్రీ యంగ్ మెన్` ఓటీటీ డాక్యుమెంటరీ ఉమ్మడి నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్.. ఫర్హాన్ అఖ్తర్‌కు ఎంతో దగ్గరయ్యారు.
మరోవైపు రణ్‌వీర్ సింగ్ విషయంలోను సల్మాన్ ఖాన్‌కు ఎంతో ప్రత్యేకమైన సన్నిహిత భావన ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌ను శాసిస్తున్న ఒక ప్రముఖ దాత, అగ్రశ్రేణి వ్యాపారవేత్తకు సల్మాన్ -రణ్‌వీర్ ఇద్దరూ రెండు కళ్ల లాంటి వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కెరీర్ పరంగా కొంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్న రణ్‌వీర్ సింగ్‌కు పూర్తి మద్దతుగా నిలిచిన సదరు బిజినెస్ మేగ్నెట్.. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో హాట్‌లైన్‌లో మాట్లాడి రణ్‌వీర్, ఫర్హాన్‌ల మధ్య ఉన్న విభేదాలను తొలగించాల్సిందిగా కోరడంతో సల్మాన్ ఖాన్ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫర్హాన్, రణ్‌వీర్ ఇద్దరినీ సల్మాన్ తన సొంత తమ్ముళ్లుగా భావిస్తారని.. అందుకే ఇండస్ట్రీ లోపల ఉండే వ్యక్తుల మధ్య ఇటువంటి అంతర్గత పోరాటాలు సాగడం ఆయనకు అస్సలు ఇష్టం లేదని భాయ్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
చిత్ర పరిశ్రమలో ఎవరికైనా ఏవైనా విభేదాలు ఉంటే వాటిని పరిశ్రమకు చెందిన పెద్దలే కూర్చుని పరిష్కరించుకోవాలి తప్ప.. అనవసరంగా కోర్టులు, లాయర్లు, అసోసియేషన్లను లాగి రచ్చ చేయకూడదనేది సల్మాన్ ఖాన్ ప్రధాన సూత్రం. చదువుకున్న వ్యక్తులు ఒక టేబుల్ చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆయన నమ్ముతున్నారు. ఇండస్ట్రీకి చెందిన పెద్దల గొడవలను రోడ్డున పడేసి పరువు తీసుకోవద్దనే భావనతోనే సల్మాన్ ఖాన్ ఈ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సల్మాన్ ఖాన్ గనుక మధ్యవర్తిగా కూర్చుంటే.. అటు ఫర్హాన్ కానీ.. ఇటు రణ్‌వీర్ కానీ ఆయన మాటను కాదనలేరనేది బాలీవుడ్ వర్గాల గట్టి నమ్మకం.
ఈ విధంగా సౌత్‌లో మెగాస్టార్ చిరంజీవి.. నార్త్‌లో సల్మాన్ ఖాన్ వంటి ఇండస్ట్రీ పెద్దలు తమ బాధ్యతను గుర్తించి వివాదాలను సమూలంగా తుడిచేయడానికి ముందుకు రావడం చిత్ర పరిశ్రమల మనుగడకు ఎంతో అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌లో చిరంజీవి చొరవతో ఇష్యూ ఆల్మోస్ట్ సద్దుమణిగినట్లే.. మరి అక్కడ బాలీవుడ్‌లో సల్మాన్ భాయ్ ప్రమేయంతో రణ్‌వీర్- ఫర్హాన్‌ల సమస్య పరిష్కృతమై `డాన్ 3` సెట్స్ పైకి వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.
