జూన్ 30లోగా తేలుద్దాం.. థియేటర్ల సంక్షోభంపై చిరంజీవి మధ్యవర్తిత్వం!
అయితే ఈసారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నిర్దేశిత గడువులోగా అంటే జూన్ 30వ తేదీ లోపు అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని చిరంజీవి నమ్మకం వ్యక్తం చేశారు.
By: Sivaji Kontham | 25 May 2026 6:48 PM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య ప్రస్తుతం నెలకొన్న `పర్సెంటేజ్ మోడల్` వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పరిశ్రమ పెద్దలు ఈ రోజు (25 మే 2026) మధ్యాహ్నం మెగాస్టార్ శ్రీ చిరంజీవిని కలిసి సమస్య తీవ్రతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలను, సింగిల్ స్క్రీన్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పూర్తిగా విన్న చిరంజీవి.. పరిశ్రమలోని భాగస్వాములందరికీ పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఏదో ఒక సినిమా కోసమో లేదా ఒక నిర్దిష్ట సెక్టార్ ప్రయోజనాల కోసమో కాకుండా.. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకే ఇండస్ట్రీ కొన్ని పద్ధతులను ఏర్పాటు చేసుకుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు సుప్రీం బాడీ `తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్` (టిఎఫ్‌సిసి) మాత్రమేనని స్పష్టం చేసిన చిరంజీవి ఛాంబర్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పర్సెంటేజ్ మోడల్‌పై అందరినీ సంప్రదించి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత.. దానికి వ్యతిరేకంగా ఎవరూ మీడియా ముందుకు వెళ్లి వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తపరచడం తగదని హితవు పలికారు. ఇలాంటి అంతర్గత వివాదాల వల్ల పరిశ్రమలో ఐక్యత లేదనే తప్పుడు సందేశం ప్రజల్లోకి వెళ్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వేసిన కొన్ని కమిటీల పనితీరు వాటి ఫలితాలపై సింగిల్ స్క్రీన్ సభ్యులలో కొంత అసంతృప్తి, అపనమ్మకం ఉన్న విషయాన్ని తాను అర్థం చేసుకున్నానని భరోసా ఇచ్చారు.
అయితే ఈసారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నిర్దేశిత గడువులోగా అంటే జూన్ 30వ తేదీ లోపు అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని చిరంజీవి నమ్మకం వ్యక్తం చేశారు. నిర్మాతలు-పంపిణీదారులు- ఎగ్జిబిటర్లు అందరికీ సమన్యాయం జరిగేలా ఈ కమిటీ ఒక పటిష్టమైన పర్సెంటేజ్ ప్రతిపాదనను సిద్ధం చేస్తుందని.. ఆ కమిటీ సకాలంలో రిపోర్టు సమర్పించేలా తన వంతు పూర్తి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమ పెద్దగా చిరంజీవి తమ సమస్యలను, భయాలను అర్థం చేసుకుని థియేటర్ల మనుగడకు భరోసా ఇవ్వడంపై సమావేశానికి హాజరైన సింగిల్ స్క్రీన్ ప్రతినిధులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. తమ అసోసియేషన్లలోని మిగతా సభ్యులందరికీ ఈ వివరాలు తెలియజేసి 24 గంటల్లో అధికారిక ఆమోదాన్ని తెలియజేస్తామని వారు పేర్కొన్నారు.
ఈ కీలకమైన సర్వసభ్య సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్.సిసి) ప్రెసిడెంట్ సురేష్ బాబు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, టి.ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు, కె.ఎల్. నారాయణ, సునీల్ నారంగ్, భరత్ , నారంగ్ పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్, ప్రముఖ థియేటర్ల ప్రతినిధులు అనుపమ్, శ్రీధర్, సదానంద్ గౌడ్, సుదర్శన్ థియేటర్ ప్రొప్రైటర్ రాజ్ తదితరులు పాల్గొని సంక్షోభ నివారణ ప్రయత్నాలకు తమ మద్దతును ప్రకటించారు. ఈ వివాద సమయంలోనే చిరు మధ్యవర్తిత్వంతో పెరిగిన భరోసాతో జూన్ 4న వస్తున్న రామ్ చరణ్ `పెద్ది` రిలీజ్ కి ఇప్పుడు ఇబ్బంది లేదని అభిమానులు భావిస్తున్నారు.
