Begin typing your search above and press return to search.

అల్లెప్పి లైట్‌ హౌస్‌ వద్ద చిరు-నయన్‌ ముద్దు ముచ్చట

తాజాగా కేరళలోని ఆలప్పుళ జిల్లా కేంద్రంలో షూటింగ్‌ చేస్తున్నాడు. అల్లెప్పి అని పిలవబడే ఈ ప్రాంతంలో చిరంజీవి, నయనతారలపై రొమాంటిక్ సాంగ్‌ చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 July 2025 9:00 PM IST
అల్లెప్పి లైట్‌ హౌస్‌ వద్ద చిరు-నయన్‌ ముద్దు ముచ్చట
X

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం వంటి బిగ్గెస్ట్‌ ఇండస్ట్రీ బ్లాక్‌ బస్టర్‌ విజయం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పాన్‌ ఇండియా మూవీ కాకుండా వందల కోట్ల వసూళ్లు సాధించగల సత్తా ఉన్న సినిమాలను రూపొందించడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. ప్రస్తుతం చిరంజీవితోనూ మరో బ్లాక్‌ బస్టర్‌ మూవీని రూపొందించేందుకు గాను సిద్ధం అయ్యాడు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభించిన అనిల్‌ రావిపూడి రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసిన విషయం తెల్సిందే.

తాజాగా కేరళలోని ఆలప్పుళ జిల్లా కేంద్రంలో షూటింగ్‌ చేస్తున్నాడు. అల్లెప్పి అని పిలవబడే ఈ ప్రాంతంలో చిరంజీవి, నయనతారలపై రొమాంటిక్ సాంగ్‌ చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేరళలోని అతి చిన్న ప్రాంతం అయిన ఈ లొకేషన్‌ను అనిల్‌ రావిపూడి ఏరి కోరి మరీ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తన కథకు తగ్గట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతంను అనిల్ రావిపూడి ఎంపిక చేసుకుని ఉంటాడు. అక్కడ లైట్‌ హౌస్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ లైట్‌ హౌస్‌ను చూసేందుకు ప్రతి రోజు వేలాది మంది వస్తూ ఉంటారు. అలాంటి లైట్‌ హౌస్‌ వద్ద చిరంజీవి-నయనతార కాంబోలో రొమాంటిక్ నెంబర్‌ షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.

కేరళలో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతున్న పాట షూటింగ్‌ వారం రోజుల్లో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఇదే నెల చివరి వారం నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా సగానికి పైగా పూర్తి అవుతుందని సమాచారం అందుతోంది. చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్‌ చివరి వారం వరకు సినిమా షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టాలని దర్శకుడు అనిల్‌ రావిపూడి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో చిరంజీవి విశ్వంభర సినిమా విడుదల ఉండే అవకాశం ఉంది. అందుకే చిరంజీవితో అంతకు ముందే షూటింగ్‌ పూర్తి చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడు.

ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి 2026 సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్‌ విజయాన్ని ఈ సినిమాతో దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం పలు టైటిల్స్‌ను దర్శకుడు పరిశీలిస్తున్నాడు. వచ్చే నెలలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేసి టీజర్‌ను సైతం విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడట. ప్రస్తుతం కేరళలో చిత్రీకరిస్తున్న పాటకు సంబంధించిన ప్రోమోను సైతం వచ్చే నెలలో విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ ముఖ్యమైన గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.