చిరంజీవి అయితేనే 50 లక్షలు రిస్క్ చేస్తామన్నారు
దశాబ్ధాల టాలీవుడ్ హిస్టరీలో ఎదురే లేని హీరోగా చెలామణి అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 150 పైగా సినిమాల్లో నటించిన మేటి కథానాయకుడు
By: Tupaki Desk | 13 April 2025 3:00 PM ISTదశాబ్ధాల టాలీవుడ్ హిస్టరీలో ఎదురే లేని హీరోగా చెలామణి అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 150 పైగా సినిమాల్లో నటించిన మేటి కథానాయకుడు. మద్రాసులో ఐసిడబ్ల్యూఐ చదువుతానని వెళ్లి, నటుడయ్యారు ఆయన. నటనపై తనకు ఉన్న ఫ్యాషన్ ని గుర్తించి తన కలను నిజం చేసుకునేందుకు చాలా శ్రమించారు. పగలంతా ఫిలింఇనిస్టిట్యూట్, రాత్రయితే ఐసిడబ్ల్యూఐ చదివానని ఇటీవల ఓ సమావేశంలో మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఎంటర్ ప్రెన్యూర్ అంటే ఏమిటో గూగుల్ లో వెతికాను. అప్పట్లో నేను ఎన్సీసీ క్యాడెట్ అయ్యాను.. ఆ తర్వాత ఏం చేయాలి? అని ఆలోచించాను. యాక్టింగ్ అంటే ఆసక్తి ఉంది. కానీ నాన్న సందేహించారు. యాక్టింగ్ అంటే ఇండస్ట్రీలో నువ్వు ఎవరో తెలీదు కదరా అని సందేహించారు. అయితే యాక్టింగ్ లో రాణించలేకపోతే ఐసిడబ్ల్యూఐ అనే కోర్సు సైమల్టేనియస్ గా పూర్తి చేస్తానని అన్నాను. అలా పగలంతా నటశిక్షణ, రాత్రి అయితే ఐసిడబ్లయూఐ ప్రిపరేషన్ సాగించానని మెగాస్టార్ తెలిపారు.
ఇక నటనలోకి వచ్చి ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నా కానీ, మద్రాసీలకు తన విలువేంటో తెలియలేదని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లక్ష్మి ఫిలింస్ వాళ్లు 25-30లక్షల్లో (అప్పట్లో బడ్జెట్లు అంతే) ఎవరో హీరోతో సినిమా తీయాలనుకుంటున్నారు. కానీ బడ్జెట్ 50లక్షలు అవుతుందని అడిగారు దర్శకుడు. కానీ ఆ బడ్జెట్ ఆ హీరో మీద రిస్క్.. చిరంజీవి అని వస్తున్నాడు కదా.. అతడి మీద అయితే ఇస్తాం అని అన్నారు. దానికి మద్రాసీలు సంశయించారు. ఎందుకండీ ఎందుకిస్తారు? కొత్తగా వస్తున్నాడు! ఎందుకు అతడికి అంత!! అన్నారు. ఎందుకేంటి? అతడు ఖైదీలో చేసాడు.. అతడి డ్యాన్సులు ఫైట్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. డ్యాన్సులు ఫైట్స్ తో మెప్పించాడు. మేం జనంలోంచి చూస్తున్నాం.. విజయవాడలో థియేటర్లలో చూసామని అన్నారు. మద్రాస్ వాళ్లు సంశయిస్తుంటే, వేరే హీరో అయితే చేయలేమని నిర్మాతలు అన్నారు. కానీ ఇతడైతే(చిరు అయితే)నే 50లక్షలు ఇస్తాం.. వేరే హీరో అయితే ఇవ్వమని తేల్చి చెప్పారు.
ఆ సమయంలో నన్ను నమ్మిన ఆ వ్యక్తి ఒక మాట అన్నారు. పాటలు ఫైట్స్ అంటే మినీ ఇంటర్వల్స్ ఆ రోజుల్లో. సాంగ్స్ ఫైట్స్ అనగానే జనం సినిమా మధ్యలోనే అసహనంగా బయటికి వెళ్లిపోయేవారు. ఫైట్స్ అంటే డూప్ చేస్తారు.. పాటలు అయితే అవేంటి రా అనుకునేవారు. ఈ అబ్బాయి అయితే ప్రొజెక్టర్ ఆపి రిపీటెడ్ గా మళ్లీ వెయ్యండి ఈ పాట అని అడుగుతున్నారు జనం. ఇదీ మాకు కావాల్సింది.. ఇదీ మాకు డబ్బులు తెచ్చేది. కాబట్టి ఈ అబ్బాయి అయితేనే ఇంత బడ్జెట్ ఇస్తాము అని అన్నారు. ప్రజలు కోరుకుంటున్నారు. పంపిణీదారులు కావాలనుకున్నారు.. అందుకే ఇస్తామని పట్టుబట్టారు.. అంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు చిరు.
ఆ ఘటన తర్వాత రామారావు గారి నిర్మాతలు దేవీ ప్రసాద్, చలసాని గోపి, త్రివిక్రమ్, ఏడిద నాగేశ్వరరావు వంటి నిష్ణాతులైన నిర్మాతలు అంతా నా ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతున్నా నా దగ్గగరకు వచ్చి ఈవెనింగ్ కలిసి స్నాక్స్ తినేవారు. అప్పుడు అనుకున్నా.. ఇది కదా నా బలం.. ఇది కదా నేను సాధించుకున్నాను. రామారావు గారి నిర్మాతలు నా దగ్గరకు వచ్చారు. నంబర్ వన్ అవ్వాలన్న కల నెరవేరింది. కానీ నంబర్ వన్ అయ్యానని కాలర్ ఎగరేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అందుకే నేను కాలర్ ఎగరేయలేదు. కష్టపడి పని చేయడమే నా విధి. పని చేస్తే ఆటోమెటిగ్గా ఆ నంబర్ అక్కడే ఉంటుంది. నేను నంబర్ వన్ అని చెప్పుకుంటే అది నిలవదు. కష్టపడి పని చేస్తుంటే అదే నిలబడుతుందని దానిని అనుసరించాను. నా అంతరాత్మ చెప్పిందే చేసాను... అని నాటి విషయాలను చిరు గుర్తు చేసుకున్న తీరు ఆకట్టుకుంది.
