ట్రెండింగ్: బుల్లితెర TRP లో మెగా-విక్టరీ ప్రభంజనం
మెగాస్టార్ చిరంజీవి- విక్టరీ వెంకటేష్ కలయికలో వచ్చిన `మనశంకరవరప్రసాద్ గారు` చిత్రం అన్ని వేదికలపై అసాధారణమైన విజయాన్ని అందుకుంది.
By: Sivaji Kontham | 12 March 2026 9:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి- విక్టరీ వెంకటేష్ కలయికలో వచ్చిన `మనశంకరవరప్రసాద్ గారు` చిత్రం అన్ని వేదికలపై అసాధారణమైన విజయాన్ని అందుకుంది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఆ తర్వాత ఓటీటీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అదే జోరును కొనసాగించి `ఒరిజినల్ హిట్` అనిపించుకుంది. అటు వెండితెరపై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా.. ఇటు డిజిటల్ మాధ్యమాల్లోనూ అత్యధిక వ్యూస్‌తో రికార్డులు సృష్టించడం ఈ సినిమా ప్రత్యేకత.
ముఖ్యంగా బుల్లితెరపై ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అమోఘం. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారమైన ఈ చిత్రం 14.2 టీఆర్పీ (TRP) సాధించడం ద్వారా మెగాస్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపితమైంది. థియేటర్లు, ఓటీటీ, టీవీ.. ఇలా ప్రతిచోటా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ, చిరంజీవి-వెంకటేష్‌ల క్రేజీ కాంబినేషన్ ఈ స్థాయి సక్సెస్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
మెగాస్టార్ చిరంజీవి -విక్టరీ వెంకటేష్ వంటి ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలేర్పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండించింది. ముఖ్యంగా వినోదానికి పెద్దపీట వేసే అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి మేనరిజమ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. కేవలం కమర్షియల్ అంశాలే కాకుండా కుటుంబ విలువలు, హాస్యం, ఇతర కోణాల్లో వినోదం కలగలిసిన కథ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు.
ఈ సినిమా విజయానికి ప్రధాన బలం మహిళా ప్రేక్షకులు, యూత్. అనిల్ రావిపూడి సినిమాల్లో ఉండే వినోదాన్ని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. దానికి తోడు చిరంజీవి-వెంకటేష్‌ల స్క్రీన్ ప్రెజెన్స్ యువతను థియేటర్లకు రప్పించింది. ఇక మాస్ ప్రేక్షకుల విషయానికొస్తే చిరంజీవి మార్క్ డైలాగులు, డ్యాన్స్‌లు పూనకాలు తెప్పించాయి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ అలరించడం వల్లే ఇది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది.
ప్రస్తుతం బుల్లితెరపై ఈ చిత్రం 14.2 టీఆర్పీతో దుమ్ములేపడానికి ప్రధాన కారణం దీనిలోని `రిపీట్ వాల్యూ`. థియేటర్లలో చూసిన వారే కాకుండా కుటుంబం అంతా కలిసి ఇంట్లో కూర్చుని సరదాగా చూసేలా ఉండటంతో టీవీలో ఈ రేంజ్ రేటింగ్ సాధ్యమైంది. నేటి కాలంలో ఓటీటీలో అందుబాటులో ఉన్నా కూడా ఒక సినిమా టీవీలో ఇంతటి ఆదరణ పొందుతుందంటే అది కేవలం మెగాస్టార్ -విక్టరీ వెంకటేష్‌ల మాస్ అప్పీల్ వల్లే అని చెప్పక తప్పదు.
తెలుగు బుల్లితెర చరిత్రలో టాప్ టీఆర్పీ సాధించిన సినిమాల్లో ఇప్పటికీ `అల వైకుంఠపురములో`, `బాహుబలి 2`, `శ్రీమంతుడు` వంటి చిత్రాలు మొదటి వరుసలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన `సైరా నరసింహారెడ్డి`, `వాల్తేరు వీరయ్య`.. ఇప్పుడు తాజా చిత్రం `మనశంకరవరప్రసాద్ గారు` కూడా టాప్ 10 టీఆర్పీ రేటింగ్స్ జాబితాలో సత్తా చాటాయి. మెగాస్టార్ సినిమా అంటే బుల్లితెర కూడా పండగ చేసుకుంటుందని మరోసారి నిరూపితమైంది.
