పత్రికలో చిరు తన ఫొటో తీయించిన వేళ..
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన సేవా దృక్పథం గురించి.. పాటించే విలువల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు
By: Tupaki Desk | 18 Jun 2025 8:30 AM ISTఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన సేవా దృక్పథం గురించి.. పాటించే విలువల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అభిమానులు తన నుంచి స్ఫూర్తి పొందాలని కోరుకుంటారు తప్ప.. తన వల్ల వాళ్లు దారి తప్పకూడదని కోరుకుంటారు. చిరు నుంచి స్ఫూర్తి పొంది ఎంతో సాధించిన వాళ్లు, సేవా కార్యక్రమాలు చేసిన వాళ్లు చాలామందే ఉన్నారు. సొసైటీ మీద తన ప్రభావం ఎంత ఉంటుందో తెలుసు కాబట్టే.. ఆయన ఎంతో జాగ్రత్తగా ఉంటారని చెబుతారు సన్నిహితులు. ఈ జాగ్రత్తతోనే ఒక మ్యాగజైన్లో తన ఫొటోను తీయించేసిన ఉదంతం గురించి సీనియర్ రైటర్ తోట ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
90వ దశకంలో సినీ వార పత్రికలకు మాంచి డిమాండ్ ఉండేది. అప్పట్లో బాగా పాపులర్ అయిన వార పత్రికల్లో జ్యోతిచిత్ర ఒకటి. అందులో ప్రతి వారం ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ ఫొటోను కవర్ ఫొటోగా వేసేవారు. ఏడాదిలో అత్యధికంగా చిరు ఫొటోనే కవర్ పేజీగా వేసేవాళ్లట జ్యోతిచిత్రవాళ్లు. ఐతే ఒక సందర్భంలో జ్యోతిచిత్ర ఆర్థికంగా కొంత ఇబ్బంది పడితే.. ఒక లిక్కర్ బ్రాండుతో ఏడాది ఒప్పందం జరిగిందట. కవర్ పేజీతో పాటు మూడు చోట్ల ఆ లిక్కర్ బ్రాండ్ యాడ్ రావాలని.. ఏడాదికి కలిపి రూ.25 లక్షలకు ఒప్పందం జరిగిందని తోట ప్రసాద్ వెల్లడించారు.
ఐతే ఆ ఒప్పందం అయ్యాక చిరు ఫొటోను కవర్ పేజీలో వేశామని.. అది చిరు వద్దకు చేరిందని.. కానీ ఆయన కింద లిక్కర్ బ్రాండు యాడ్ ఉండగా పైన తన ఫొటో వేయడానికి ఎంతమాత్రం అంగీకరించలేదని తోట ప్రసాద్ చెప్పారు. తన ఫొటో కింద యాడ్ ఉంటే.. తాను లిక్కర్ తాగమని అభిమానులను ప్రోత్సహిస్తున్నట్లు అవుతుందని.. అలా జరగడానికి వీల్లేదని చిరు స్పష్టం చేశారట. ఈ బ్రాండుతో ఒప్పందం గురించి చెబితే.. మీకు నా ఫొటో కావాలా, యాడ్ కావాలా తేల్చుకోమని చిరు తేల్చి చెప్పారని ప్రసాద్ వెల్లడించారు. ఐతే ఆ ఒప్పందం పత్రికకు చాలా అవసరం కావడంతో ఏడాది పాటు తాము చిరు ఫొటోను కవర్ పేజీగా వేయనే లేదని, ఇలాంటి విషయాల్లో చిరు అంత కచ్చితంగా ఉంటారని ాయన చెప్పారు. మరో సందర్భంలో ఒక జర్నలిస్టు రూపొందించిన క్యాలెండర్లో పైన ఒక బాబా ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న ఫొటో వేసి, కింద చిరు, వేరే హీరోల ఫొటోలు వేశారని.. అది చూసిన చిరు ఇది జనాలను తప్పుదోవ పట్టించేలా ఉందని, ఆ క్యాలెండర్ మార్కెట్లోకి వెళ్లకుండా ఆపించేశారని ప్రసాద్ వెల్లడించారు.
