Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అయ్యే విధంగా రీ రిలీజ్‌

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   6 May 2025 11:16 AM
మెగా ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అయ్యే విధంగా రీ రిలీజ్‌
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటించిన పలు సినిమాలు రీ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. అలాగే చిరంజీవి నటించిన సినిమాలు కూడా రీ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన సినిమాల్లో 150 సినిమాలు కూడా రీ రిలీజ్‌కి అర్హత ఉన్న సినిమాలు అంటూ మెగా ఫ్యాన్స్‌ అంటూ ఉంటారు. చిరు కెరీర్‌ బెస్ట్‌ సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటి. ఆ సినిమా విడుదల అయ్యి 35 ఏళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో మేకర్స్‌ రీ రిలీజ్‌కి ఏర్పాట్లు చేసిన విషయం తెల్సిందే.

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను రీ రిలీజ్ చేయడం కోసం నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ చాలానే కష్టపడ్డట్లు తెలుస్తోంది. సినిమా విడుదల అయ్యి మూడు దశాబ్దాలు దాటింది. దాంతో నిర్మాణ సంస్థ సినిమా ఫిల్మ్‌ను భద్రపర్చడంలో అజాగ్రత్త వహించింది. అందుకే సినిమా రీ రిలీజ్‌ అనుకోగానే ఫిల్మ్‌ ను వెతకడం ప్రారంభించింది. రీ మాస్టర్‌ చేయడం కోసం లభించిన రీల్‌ను ఎన్నో ల్యాబ్స్‌కి తిప్పారు. హైదరాబాద్‌లో లభించిన ఫిల్మ్‌ పూర్తిగా ద్వంసం కావడంతో నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు ఆశ కొట్టేసుకోకుండా విజయవాడలో ఉన్న ఆఫీస్‌లో ఆ సినిమా రీల్‌ను కనిపెట్టారు. దాన్ని తీసుకుని జాగ్రత్తగా 4కే ఔట్‌ పుట్‌కి మార్చి సినిమా సౌండ్‌ సిస్టంను అద్భుతంగా తీర్చిదిద్దారు.

వైజయంతి మూవీస్ బ్యానర్‌లో వచ్చిన పలు సినిమాలకు సంబంధించిన రీల్‌ దెబ్బ తినడంతో పాటు, కొన్ని సూపర్‌ హిట్‌ సినిమాలకు సంబంధించి మాస్టర్ ప్రింట్‌ కూడా లేదట. అయితే మెగా అభిమానుల అదృష్టం కొద్ది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీల్‌ లభించింది. మే 9న సినిమాను రీ రిలీజ్‌ చేయడం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. మెగా స్టార్‌ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్‌ సినీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా శ్రీదేవి నటించిన విషయం తెల్సిందే. ఆమె అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచి పోయే సోషియో ఫాంటసీ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా అప్పట్లో తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఉన్న మార్కెట్‌ ప్రకారం అప్పట్లో సినిమా వసూళ్లు చేసిన దాన్ని పరిగణలోకి తీసుకుంటే దాదాపు రూ.1000 కోట్ల వసూళ్లు సాధించి ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు సినిమా రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో కచ్చితంగా రూ.10 కోట్ల వసూళ్లు నమోదు అవుతాయనే ధీమాను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా రీ రిలీజ్‌ హడావిడి మొదలు అయింది. మెగా ఫ్యాన్స్ సినిమా విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీ రిలీజ్‌లో సేమ్‌ మ్యాజిక్‌ రిపీట్‌ అయ్యేనా చూడాలి.