అక్కడా మెగాస్టార్ రెండు పూటలా కసరత్తులే!
పాత్రకు తగ్గట్టు హీరోలు మేకోవర్ అవుతుంటారు. అందుకు తగ్గట్టు తినే తిండి నుంచి చేసే జిమ్ వరకూ ఎన్నో ప్రణాళికలు అనుసరిస్తుంటారు.
By: Srikanth Kontham | 7 Jan 2026 5:00 PM ISTపాత్రకు తగ్గట్టు హీరోలు మేకోవర్ అవుతుంటారు. అందుకు తగ్గట్టు తినే తిండి నుంచి చేసే జిమ్ వరకూ ఎన్నో ప్రణాళికలు అనుసరిస్తుంటారు. ఎవరెలా అనుసరించినా? చివరిగా దర్శకుడికి కావాల్సిన లుక్ మాత్రం తప్పనిసరి. హీరో పోర్షన్ షూటింగ్ మొదలయ్యే లోపు అతడు అన్ని రకాలుగా సిద్దంగా ఉండాల్సి ఉంటుంది. ఈ విషయంలో హీరోలంతా దర్శకులకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. గంటల తరబడి జిమ్ చేస్తారు. మితంగానే భోజనం చేస్తారు. ఇంకా అవసరం అనుకుంటే? సందర్భాన్ని బట్టి ఉపవాసం కూడా ఉండాల్సి ఉంటుంది.
హీరోలకు ఇలాంటివి కొత్తేం కాదు. కాకపోతే అన్నీ రకాల సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా? అంతే కమిట్ మెంట్ తో ఉండటం అన్నది చిన్న విషయం కాదు. సిటీ పరిధిలో షూటింగ్ జరుతుందంటే హీరోలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. ఇంటి భోజనం తీసుకుంటారు. ఇంట్లోనే ఉదయం జిమ్...సాయంత్రం చేయాల్సిన పనులకు సమయం సరిపోతుంది. కానీ ఔట్ డోర్ లో షూటింగ్ చాలా రకాల వెసులు బాటులు ఉండవు. అనుకూలంగా జిమ్ములుండవ్.. కావాల్సిన ఆహారం దొరకదు.
ఉన్నదాంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వేళలో కూడా మెగాస్టార్ చిరంజీవి తన సంకల్పాన్ని ఎంత మాత్రం అశ్రద్ద చేయలేదు. 'మనశంకర వరప్రసాద్ గారు' సినిమా కోసం చిరంజీవి స్లిమ్ లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. అన్నయ్య వింటేజ్ లుక్ మెగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకోసం చిరంజీవి చాలా కష్ట పడ్డారు. ఆయన జిమ్ వీడియోలు పెద్దగా బయటకు రాలేదు గానీ కరమార్తె సుష్మిత మాటల్లో చిరు కష్టం కనిపిస్తోంది. ఔట్ డోర్ షూటింగ్ అయినా సరే చిరంజీవి మాత్రం రెండు పూటలా జిమ్ మాత్రం మిస్ అయ్యేవారు కాదుట.
అక్కడి ఉన్న వాతావరణంలో దొరికిన వాటితో వ్యాయామాలు చేసేవారుట. సాధారణంగా ఔట్ డోర్ లో షూటింగ్ అంటే హీరోలు కసరత్తులు చేయరు. షూటింగ్ వీలైనంత త్వరగా ముగించుకుని వచ్చేద్దామని ఎదురు చూస్తారు. కానీ చిరంజీవి 70 ఏళ్ల వయసులోనే సెట్స్ లో సైతం ఎక్కడా తగ్గలేదని తెలుస్తోంది. మనసు ఉంటే మార్గం ఉండదా? అని చిరంజీ మరోసారి రుజువు చేసారు. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మహావృక్షంలా ఎదిగారు. ఇప్పుడా వృక్షం కింద ఎంతో మంది సేద తీరుతోన్న వైనం తెలిసిందే.
