అభిమాని కోసం మెగా భరోసా
హీరోలపై ఒక్కొక్కరు ఒక్కోలా అభిమానం చాటుకుంటారు. కొందరు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు అంటూ కిలోమీటర్లు మేర ప్రయాణిస్తున్నారు.
By: M Prashanth | 29 Aug 2025 1:15 PM ISTహీరోలపై ఒక్కొక్కరు ఒక్కోలా అభిమానం చాటుకుంటారు. కొందరు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు అంటూ కిలోమీటర్లు మేర ప్రయాణిస్తున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కోసం కర్నూలు జిల్లా ఆదోని నుంచి అమరావతికి సైకిల్ యాత్ర చేపట్టిన మెగా మహిళా అభిమాని రాజేశ్వరి.. పవర్ స్టార్ ను కలిసి మాట్లాడి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇప్పుడు ఆమె కర్నూలు నుంచి హైదరాబాద్ కు సైకిల్ యాత్ర చేపట్టారు. అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు కొన్ని వందల కిలోమీటర్లు సైకిల్ ను తొక్కుతూ ప్రయాణించారు. ఆ సమయంలో సంఘీభావం తెలుపుతూ మెగా ఫ్యాన్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో రాజేశ్వరి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆమె హైదరాబాద్ చేరుకున్నారు.
అయితే చిరంజీవి పట్ల ఆమెకున్న అచంచలమైన సంకల్పం, నిజమైన అభిమానం ఆమె కష్టతరమైన ప్రయాణానికి ఆజ్యం పోశాయి. తాజాగా ఆమె, తన పిల్లలతో కలిసి చిరంజీవిని కలిశారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరు.. ఆమె అభిమానం పట్ల హృదయపూర్వకంగా స్పందించారు.
చిరంజీవికి రాఖీ కట్టిన రాజేశ్వరి, దేవుడు ఇచ్చిన సోదరుడిగా భావించారు. అనంతరం తమ అభిమాన హీరోను కలిసిన క్షణంలో భావోద్వేగానికి కూడా గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకోగా.. మెగాస్టార్ ఆమెను ఓదార్చారు. అయితే చిరు కూడా తన మంచి మనసు చాటుకున్నారు. సంప్రదాయంగా చీరను ఆశీర్వదిస్తూ ఆమెకు అందించారు.
అంతేకాదు.. ఆమె పిల్లల చదువుకు సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చారు. పిల్లలను చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేయాలని చెప్పారు. తల్లిని మంచిగా చూసుకోవాలని కూడా తెలిపారు. తద్వారా.. రాజేశ్వరి కుటుంబానికి ప్రకాశవంతమైన, మరింత సురక్షితమైన భవిష్యత్తును అందిస్తానని తెలిపారు. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చిరంజీవి హామీ.. చర్యకు మించి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అది ఆయన వ్యక్తిత్వానికి, తన సొంత కుటుంబంలా చూసుకునే అభిమానులతో లోతైన బంధానికి నిదర్శనమని కొనియాడుతున్నారు. చిరంజీవి అంటే ఏంటో అది ఒక ఉదాహరణగా చెబుతున్నారు. కేవలం రీల్ హీరోగా మాత్రమే కాకుండా.. రియల్ హీరో అని చెబుతున్నారు. నిజ జీవితంలో ఎంతో మంది ఆదర్శంగా నిలిచారని అంటున్నారు.
