చిరంజీవి జీవితానికి పునాదిరాళ్లు పడిందే ఈనాడే!
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా పోస్ట్ మరోసారి ఆయన భావోద్వేగాలను, కృతజ్ఞతా భావాన్ని ప్రతిబింబించింది.
By: Sravani Lakshmi Srungarapu | 11 Feb 2026 10:50 PM ISTమెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా పోస్ట్ మరోసారి ఆయన భావోద్వేగాలను, కృతజ్ఞతా భావాన్ని ప్రతిబింబించింది. పునాదిరాళ్లు మూవీ కోసం జీవితంలో తొలిసారి కెమెరా ముందు నిలిచిన రోజును గుర్తు చేసుకుంటూ చేసిన ఈ ప్రత్యేక పోస్టు సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా విజయాల గురించి మాట్లాడే స్టార్ హీరోలు అరుదుగా తమ ఆరంభ దశను ఈ స్థాయిలో మనసుకు హత్తుకునేలా ప్రస్తావిస్తారు. అయితే చిరంజీవి మాత్రం తన తొలి అడుగును మరువలేదని మరోసారి చాటి చెప్పారు.
నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుంది
ఆ రోజున తనలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో చెప్పలేనివని ఆయన పేర్కొన్నారు. “ఆ క్షణం ఇప్పటికీ నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుంది” అన్న ఆయన మాటల్లో ఆ అనుభూతి ఎంత గాఢమైందో స్పష్టమవుతోంది. ఒక అందమైన చందమామ కథలా ఆ అనుభవాన్ని ఆయన వర్ణించడం, తన నటనా ప్రయాణానికి అది నిజమైన పునాది అయిందని చెప్పడం విశేషం. పునాదిరాళ్లు అనే శీర్షికకు తగ్గట్టుగానే ఆ సినిమా ఆయన సినీ జీవితం కోసం పునాది రాయి అయిందనే సంకేతం ఆయన చేసిన పోస్ట లో స్పష్టంగా కనిపిస్తోంది.
దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు
ఇక తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా చిరంజీవి తన వినయాన్ని మరోసారి చాటుకున్నారు. ఎంత స్టార్‌డమ్ ఉన్నా, ఆరంభంలో నమ్మకం ఉంచిన వారిని గుర్తుంచుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమనే చెప్పాలి. వారి ప్రోత్సాహమే తన నటనా ప్రయాణానికి మెరుగైన దారిని చూపిందని మెగాస్టార్ చెప్పడం, యువ నటులకు కూడా ఒక స్పూర్తిగా నిలుస్తోంది. అవకాశాలు ఇచ్చిన వారిని మరవకపోవడం, ప్రతి దశలో కృతజ్ఞతాభావం కలిగి ఉండడం ఎంత ముఖ్యమనేది ఈ తరం హీరోలు చిరంజీవిని చూసి నేర్చుకోవాలి.
అదే సమయంలో, తనను ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలపడం ద్వారా అభిమానులతో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి మరింత బలపరిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన సినీ ప్రయాణంలో ప్రేక్షకుల ప్రేమే తనకు అతిపెద్ద బలం అనే రీతిలో చిరంజీవి తన పోస్టులో రాసుకొచ్చారు. ఒక స్టార్ హీరోగా ఉన్న స్థాయిని దాటి, సాధారణ నటుడిగా తన తొలి అడుగును గుర్తు చేసుకోవడం ద్వారా చిరంజీవి తన ప్రయాణాన్ని మరోసారి ఆవిష్కరించారు.
