బ్రాండ్ పబ్లిసిటీలో ఆ నలుగురు దూకుడు
క్రేజ్ ఉన్న హీరోలతో బ్రాండ్స్ ప్రచారం రెగ్యులర్ గా చూసేదే. టాలీవుడ్ లో కార్పొరెట్ ఉత్పత్తుల ప్రచారంతో భారీగా ఆర్జించే హీరోగా సూపర్ స్టార్ మహేష్ కి గుర్తింపు ఉంది
By: Tupaki Desk | 9 April 2025 9:56 PM ISTక్రేజ్ ఉన్న హీరోలతో బ్రాండ్స్ ప్రచారం రెగ్యులర్ గా చూసేదే. టాలీవుడ్ లో కార్పొరెట్ ఉత్పత్తుల ప్రచారంతో భారీగా ఆర్జించే హీరోగా సూపర్ స్టార్ మహేష్ కి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు బ్రాండ్స్ ప్రచారానికి ఎప్పుడూ ముందుంటారు. కానీ ప్రభాస్ అందుకు విరుద్ధంగా ఉన్నాడు. అతడిని ఒక బ్రాండ్ ప్రచారంలో చూడటం ఆల్మోస్ట్ జీరో.
అయితే వీళ్లందరి కంటే మన సీనియర్ స్టార్లు 60 ప్లస్ ఏజ్‌లోను బ్రాండ్స్ ప్రచారంలో దూకుడు ప్రదర్శించడం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికీ నవయువకుల్లా ప్రకటనల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి థమ్సప్ కి చాలా కాలం క్రితం బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. బాస్ ప్రకటనలో కనిపిస్తే మోతెక్కిపోయేది. ఆ తర్వాత చిరు వాణిజ్య ప్రకటనల కంటే, సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసారు. ఇటీవల వీటికి అంతగా ప్రాధాన్యతనివ్వడం లేదు. చాలా కాలంగా కంట్రీ డిలైట్ మిల్క్ కి ఆయన ప్రచారం చేస్తున్నారు.
ఇక బ్రాండ్స్ ప్రచారంలో ఇతర స్టార్ల కంటే నాగార్జునకు దూకుడెక్కువ. ఆయన వెండితెరతో పాటు బుల్లితెర హోస్ట్ గాను రాణించినందున కార్పొరెట్ అతడికి రెడ్ కార్పెట్ వేస్తుంది. నాగ్ బ్రాండ్స్ లో ప్రముఖంగా మెస్వాక్ టూత్ పేస్ట్.. కళ్యాణ్ జువెలర్స్..ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ ఇంతకుముందు రామ్ రాజ్ కాటన్స్ కి ప్రచారం చేసినా కానీ, ఇటీవల బ్రాండ్స్ ప్రచారంలో ఆయన కనిపించడం లేదు.
బాలకృష్ణ లేట్ ఏజ్ లో బ్రాండ్ వ్యాల్యూ పెంచుకోవడం ఆశ్చర్యపరిచేదే. రిటైల్ చైన్ లు, రియల్ వెంచర్లకు ప్రచారం కల్పిస్తున్నారు. ప్రగ్యతో కలిసి ఆయన ప్రచారం చేస్తున్న ప్రకటనకు మంచి గిరాకీ ఉంది. ఎన్బీకే రెండు రోజుల షూట్ కి 3 కోట్లు అందుకున్నారని కథనాలొచ్చాయి. మరోవైపు అటు బాలీవుడ్ లో 70 ప్లస్ ఏజ్ లోను అమితాబ్ వెల్ నెస్ బ్రాండ్స్ కి ప్రచారం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అమితాబ్ నిరంతరం ప్రకటనల్లో నటిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు.
అయితే ఈ ప్రముఖ తారలంతా వయసు పరంగా 60 ప్లస్ లో ఉన్నారు. అందువల్ల వారి హుందాతనం చెడకుండా ఫ్యామిలీస్ మెచ్చే ప్రకటనలకు మాత్రమే ఓకే చెబుతున్నారు. అగ్ర తారలు ప్రచారం చేస్తాము అని అంటే, చాలా అవకాశాలు ఉంటాయి. కానీ ధనార్జనే ధ్యేయంగా బాధ్యత లేకుండా ప్రజలకు హాని కలిగించే ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేసేందుకు మన హీరోలు సిద్ధంగా లేరు.
