Begin typing your search above and press return to search.

చిరు-అనిల్ మూవీ ఏం జరుగుతుందంటే..!

అనిల్ రావిపూడి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   5 Jun 2025 9:30 AM
చిరు-అనిల్ మూవీ ఏం జరుగుతుందంటే..!
X

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ గత నెలలో ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసిన మేకర్స్‌ రెండో షెడ్యూల్‌కి కాస్త సమయం తీసుకుంటారని అంతా భావించారు. చిరంజీవి వయసు రీత్యా, ఇతర కారణాలతో బిజీగా ఉండటం వల్ల షెడ్యూల్‌కి షెడ్యూల్‌కి ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటారు అనే అభిప్రాయం ఉంది. కానీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలో చిరంజీవి అవిశ్రాంతంగా సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌ పూర్తి అయిందో లేదో అప్పుడే తదుపరి షెడ్యూల్‌కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్‌ 7 నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్‌ ప్రారంభం కాబోతుంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన మేకర్స్ ఈసారి డెహ్రాడూన్‌.. ముస్సోరిలో ప్లాన్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. అక్కడ దాదాపుగా 10 నుంచి 12 రోజుల షూటింగ్‌ జరగనుంది. వాతావరణం అనుకూలిస్తున్న ఈ సమయంలో అక్కడి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. మరికొన్ని రోజుల తర్వాత అక్కడి వాతావరణం ఇబ్బందికరంగా మారుతుంది అనే ఉద్దేశంతో ఈ షెడ్యూల్‌ను ముందుగానే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు నయనతార కూడా ఆ షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నారు.

అనిల్ రావిపూడి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న ప్రాంతీయ సినిమాగా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాకుండా కేవలం తెలుగులో మాత్రమే విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం సాధించిన వసూళ్లు చూస్తే పాన్ ఇండియా సినిమాలు సైతం చిన్నబోవాల్సిందే. ఆ స్థాయిలో వసూళ్లు దక్కించుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్‌ రావిపూడి నుంచి సినిమా అనగానే అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి. అందుకే చిరంజీవితో చేయబోతున్న సినిమా విషయంలో ఏమాత్రం అశ్రద్ద లేకుండా అనిల్ రావిపూడి జాగ్రత్తగా ఉన్నాడు.

మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పటికే విశ్వంభర సినిమాను ముగించాడు. ఒకటి రెండు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉందని మేకర్స్ అంటున్నారు. ఇంకా ఏమైనా మార్పులు ఉన్నా వారం రోజుల్లో విశ్వంభర సినిమా షూటింగ్‌ పూర్తి చేస్తారు. అయితే వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది చివరి వరకు అయినా సినిమా విడుదల అయ్యేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారీ సోషియో ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. మరో నలుగురు ముద్దుగుమ్మలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. విశ్వంభర సినిమా విడుదలైన వెంటనే చిరు-అనిల్‌ మూవీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.