ఇలాంటి పోస్టర్ చూసి ఎన్నాళ్లయ్యిందో..
టాలీవుడ్‌లో ఒకప్పుడు సినిమా మినిమమ్ టాక్ అందుకుంటే చాలు.. థియేటర్ల దగ్గర ‘50 రోజులు’, ‘100 రోజులు’ షీల్డుల హంగామా మామూలుగా ఉండేది కాదు.
By: M Prashanth | 2 March 2026 2:08 PM ISTటాలీవుడ్‌లో ఒకప్పుడు సినిమా మినిమమ్ టాక్ అందుకుంటే చాలు.. థియేటర్ల దగ్గర ‘50 రోజులు’, ‘100 రోజులు’ షీల్డుల హంగామా మామూలుగా ఉండేది కాదు. సక్సెస్ పోస్టర్ల మీద ఆ నంబర్లు కనిపిస్తే వచ్చే కిక్కే వేరు. కానీ మారుతున్న కాలంతో పాటు ట్రెండ్ కూడా మారిపోయింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన రెండు మూడు వారాల్లోనే బాక్సాఫీస్ లెక్కలు తేలిపోతున్నాయి. ఆ తర్వాత ఫ్యాన్స్ కూడా కలెక్షన్ల పోస్టర్ల కోసమే వెయిట్ చేస్తున్నారు కానీ, ఇన్ని రోజులు ఆడింది అనే ఒకప్పటి క్లాసిక్ ఫీలింగ్‌ను మిస్ అవుతున్నారు.
ఈమధ్య కాలంలో ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న పెద్ద సినిమాలు కూడా ఏడు వారాలు ముగియకముందే ఓటీటీ బాట పడుతున్నాయి. దీంతో థియేటర్లలో సినిమా ఎక్కువ రోజులు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. అప్పట్లో ఒక మోస్తరు సినిమా కూడా తనదైన జోరుతో 75 రోజులు, 100 రోజులు పోస్టర్లను రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు మిలియన్ డాలర్ల మార్కు, వందల కోట్ల గ్రాస్ వసూళ్ల హంగామా మధ్య ఈ ‘రోజుల’ లెక్కలు కనుమరుగవుతున్నాయి. సరిగ్గా ఇక్కడే మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ సినిమాతో ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేశారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర ఓ రికార్డ్ ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఇలాంటి పోస్టర్ చూసి ఎంత కాలం అయ్యిందో కదా అని నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. నేటి ఓటీటీ కాలంలో కూడా 100కు పైగా కేంద్రాల్లో 50 రోజులు ఆడటం అంటే అది మెగాస్టార్ మాస్ పవర్‌కు నిదర్శనమనే చెప్పాలి.
ఈ రికార్డు కేవలం థియేటర్లకే పరిమితం కాలేదు. ఒకవైపు ‘ZEE5’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా నెంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. సాధారణంగా ఓటీటీలోకి వచ్చిన తర్వాత థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది, కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు. అటు బుక్ మై షోలో కూడా 3.8 మిలియన్లకు పైగా టికెట్లు సేల్ అయ్యి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో కూడా 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి గ్లోబల్ మార్కెట్‌లో తన సత్తా చాటుకుంది.
చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ సినిమాకు ప్లస్ అయింది. మాస్, కామెడీ ఫ్యామిలీ ఎమోషన్స్ పక్కాగా కుదరడంతో ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వెళ్లారు. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్, ముఖ్యంగా సాంగ్స్ అన్నీ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాయి. ఏదేమైనా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కేవలం కలెక్షన్లతోనే కాకుండా, ఎక్కువ రోజులు థియేటర్లలో నిలబడి పాత రోజులను మళ్ళీ తలపించింది.
