Begin typing your search above and press return to search.

ఆ పాప ఏం డ్రెస్ వేసుకుందని?.. విరాట్ కోహ్లీ కూతురిని ప్రస్తావిస్తూ చిన్మయి ఆవేదన!

శివాజీ వ్యాఖ్యల వివాదంపై సింగర్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో మరోసారి స్పందించారు.

By:  Tupaki Desk   |   25 Dec 2025 10:00 AM IST
ఆ పాప ఏం డ్రెస్ వేసుకుందని?.. విరాట్ కోహ్లీ కూతురిని ప్రస్తావిస్తూ చిన్మయి ఆవేదన!
X

శివాజీ వ్యాఖ్యల వివాదంపై సింగర్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో మరోసారి స్పందించారు. వస్త్రధారణే ఆకృత్యాలకు కారణం అనే వారికి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల 8 నెలల పాపకు ఒక ఐఐటి చదివిన కుర్రాడు రే**ప్ త్రెట్ ఇచ్చాడని, మరి ఆ చంటి బిడ్డ ఏం డ్రెస్ వేసుకుందని ఆ మాట అన్నాడని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఆ కేసును ఆ కుర్రాడి భవిష్యత్తు కోసం ఆ దంపతులు వదిలేశారని గుర్తుచేశారు.

పితృస్వామ్య సమాజంలో కొంతమంది మగవాళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడ్డారని, స్త్రీలు చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా బలపడుతుంటే వారు తట్టుకోలేకపోతున్నారని చిన్మయి వివరణ ఇచ్చారు. సమాజంలో తమ ప్రాముఖ్యత తగ్గిపోతుందేమో అనే భయంతోనే ఇలాంటి ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని, ఇలాంటి వారిని 'ఇన్సెల్స్' అని అంటారని ఆమె వివరించారు.

ఇదే సమయంలో అమ్మాయిలకు ఆమె కొన్ని విలువైన సూచనలు చేశారు. ఎవరి నుంచీ ఏమీ ఆశించవద్దని, బాగా చదువుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. త్వరగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని, బయోలాజికల్ క్లాక్ గురించి భయపడొద్దని ధైర్యం చెప్పారు. వీలైతే విదేశాలకు వెళ్లి ప్రపంచాన్ని చూడాలని, మన కోసం మనం బతకాలని, సేవ్ చేసుకోవాలని హితవు పలికారు.

పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి ఆస్తిపాస్తులు, చదువు కంటే.. అతను సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేస్తున్నాడో గమనించాలని చిన్మయి సూచించారు. హీరోయిన్లను బూతులు తిట్టేవాడా, డ్రైవర్లను, వాచ్ మెన్ లను కించపరిచేవాడా అనేది చూడాలని అన్నారు. "ల**" వంటి పదాలు వాడేవాళ్లను, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి క్లాసులు పీకే మగవాళ్ళు ఉన్న కుటుంబాల్లో అస్సలు పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించారు.

గత రెండు రోజులుగా ఆడవాళ్లు ఎలా ఉండాలో క్లాసులు పీకుతున్నారని, బట్టలు విప్పుకొని తిరగండి అంటూ బుల్ షిట్ కామెంట్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనతో చాలామంది మగవాళ్ళు కూడా తాము లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయని, ఇక్కడ సమస్య జండర్ కాదని, మైండ్ సెట్ అని ఆమె స్పష్టం చేశారు.

చివరగా, హింసాత్మక రిలేషన్ షిప్స్ లో ఉండాల్సిన అవసరం లేదని, "గొంతులో కాలు పెట్టి తొక్కాలి" అనే టైపు మనుషలకు దూరంగా ఉండటమే మంచిదని తేల్చి చెప్పారు. మొత్తానికి శివాజీ ఎపిసోడ్ తర్వాత చిన్మయి అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఫ్రీడం, సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమని ఈ పోస్టుల ద్వారా గట్టి సందేశం ఇచ్చారు.