Begin typing your search above and press return to search.

ఆ హీరో వివాదాస్పద వ్యాఖ్యలు.. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడి ఆగ్రహం!

సనాతన ధర్మాన్ని పాటించే వారిపై అనేక రకాల దౌర్జన్యాలు జరుగుతున్నాయని రంగరాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు

By:  Tupaki Desk   |   4 Sept 2023 11:11 AM IST
ఆ హీరో వివాదాస్పద వ్యాఖ్యలు.. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడి ఆగ్రహం!
X

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, మంత్రి, ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్‌.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సహా పలువురు నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ జాతీయ అంశంగా మలుచుకుంటోంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ ఆయన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఏ సంబంధం లేదని తేల్చిచెప్పింది.

కాగా సనాతన ధర్మం కూడా డెంగ్యూ, మలేరియా, కోవిడ్‌ లాంటిదని.. దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని తెలిపారు.

ఉదయనిధి వంటి వారిని దేశం చాలామందిని చూసిందని ఆయన గుర్తు చేశారు. దేశంపైకి అనేక దండయాత్రలు చేశారని వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారన్నారు. హిందూ ఆలయాలపై దాడులు చేశారని.. ధర్మం విధ్వంసాన్ని చూసిందన్నారు. అయినప్పటికీ కాలపరీక్షలో హిందూ ధర్మం నిలిచే ఉందని తెలిపారు.

సనాతన ధర్మాన్ని పాటించే వారిపై అనేక రకాల దౌర్జన్యాలు జరుగుతున్నాయని రంగరాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికీ అది మనుగడ సాగిస్తూనే ఉందన్నారు. ద్రవిడ భావజాలం అంటే ఏమిటో ముందు ఉదయనిధి స్టాలిన్‌ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రంగరాజన్‌ అన్నారు. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఉదయనిధి తమిళ సంస్కృతి, అభివృద్ధి, దాన్ని పరిరక్షించడానికి ఏం చేశారని నిలదీశారు. సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తులనే ప్రజలు ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్త దుమారం రేగుతున్నా ఉదయనిధి స్టాలిన్‌ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారు. తనపై కేసులు పెట్టినా, మరేదైనా చేసినా అందుకు తాను సిద్ధమేనన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని తేల్చిచెప్పారు.