Begin typing your search above and press return to search.

'చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ

By:  Tupaki Desk   |   24 July 2026 7:32 AM IST
చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ
X

చెన్నై లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ

నటీనటులు: కిరణ్ అబ్బవరం- శ్రీ గౌరీప్రియ- త్రిగుణ్- సిరి హనుమంతు-మహిందర్- కరుణ్ కుమార్-దేవీప్రసాద్- ప్రమోదిని తదితరులు

సంగీతం: మణిశర్మ

ఛాయాగ్రహణం: డేనియల్ విశ్వాస్

కథ: సాయిరాజేష్

స్క్రీన్ ప్లే: సాయి రాజేష్-రవి నంబూరి

నిర్మాతలు: ఎస్కేఎన్- సాయిరాజేష్

మాటలు-దర్శకత్వం: రవి నంబూరి

‘బేబి’ చిత్రంతో సంచలనం రేపిన సాయి రాజేష్.. ఈసారి కథ-స్క్రీన్ ప్లే అందిస్తూ.. రవి నంబూరి దర్శకత్వంలో.. ఎస్కేఎన్ తో కలిసి నిర్మించిన చిత్రం.. చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం-శ్రీ గౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘బేబి’లా ఇదీ మెప్పించేలా ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ:

నివేదిత అలియాస్ నివి (శ్రీ గౌరీప్రియ).. అజయ్ (త్రిగుణ్) ప్రేమించి పెళ్లికి సిద్ధమవుతారు. కానీ వివాహానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాక అజయ్.. ఈ పెళ్లి ఇష్టం లేదని వెళ్లిపోతాడు. దీంతో నివి భగ్న ప్రేమికురాలిగా మారిపోయి చెన్నైలో నిస్సారంగా జీవితాన్ని గడుపుతుంటుంది. అప్పుడే తన జీవితంలోకి స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) వస్తాడు. తన వల్లే మళ్లీ నివిలో మార్పు వచ్చి తన జీవితం ఆశాజనకంగా మారుతుంది. స్టీవెన్ పట్ల ఆకర్షితురాలై నివి తనతో పెళ్లికి సిద్ధమవ్వగా.. అప్పుడే ఒక అనూహ్య పరిణామం జరుగుతుంది. అదేంటి.. దారి పర్యవసనాలేంటి.. చివరగా నివి-స్టీవెన్ జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘చెన్నై లవ్ స్టోరీ’లో హీరో దర్శకుడు కావాలని ఆశపడే కుర్రాడు. ఐతే అతను రాసిన కథ చదివిన కథానాయిక.. అవన్నీ అనుకరణ లాగే ఉన్నాయని చెబుతూ.. ఇన్ని లక్షల మంది మనుషులున్నారు.. వాళ్లందరికీ ఒక్కో కథ ఉంటుంది.. మరి నువ్వు ఏ కథ చెప్పాలనుకుంటున్నావన్నదే నీ ప్రత్యేకతను చాటుతుందని అంటుంది. ‘చెన్నై లవ్ స్టోరీ’ కథ కూడా మనం ఎప్పుడూ చూసే ఒక సగటు ప్రేమకథ కాదు. ‘బేబి’లో ఈ తరం యువత ఆలోచనలకు అద్దం పట్టేలా.. ఇప్పటి ప్రేమ వ్యవహారాలను కళ్లకు కట్టేలా.. బాగా సేలబిలిటీ ఉన్న కథను చెప్పి బాక్సాఫీస్ పంట పండించుకున్న సాయిరాజేష్.. ‘చెన్నై లవ్ స్టోరీ’లో అందుకు పూర్తి భిన్నమైన దారిలో ప్రయాణం చేశాడు. ఒక స్వచ్ఛమైన ప్రేమకథను నిజాయితీగా తెరపై ప్రెజెంట్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. పైన చెప్పినట్లు ‘బేబి’లా ఇది సేలబిలిటీ ఉన్న.. పెద్ద చర్చకు దారి తీసే సినిమా కాదు. కానీ ఈ రోజుల్లో ఇలాంటి ప్యూర్ లవ్ స్టోరీ మాత్రం అరుదే. ఇలాంటి కథతో మూడు గంటల పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టగలగడం విశేషమే.

ప్రేమకథలు ఎప్పుడైనా సమాజంలోని పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటేనే ప్రేక్షకులకు కనెక్ట్ ఎక్కువ అవుతాయి. ఘాటు ముద్దులు.. ఇంటిమేట్ సీన్లతో ప్రేమకథలు నిండిపోతున్న ప్రస్తుత స్పీడ్ యుగంలో హీరోయిన్ని ఏమండీ అని సంబోధించే హీరో.. కొన్ని నెలల ప్రయాణంలో హీరోను సరిగా ముట్టుకోకుండానే ప్రేమలో పడి తనను పెళ్లి చేసుకుందామా అని అడిగే హీరోయిన్.. ఇలాంటి ఒక జంట మధ్య ప్రేమకథతో సినిమాను నడిపించాలంటే అది పెద్ద సాహసమే. కానీ చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉంటే.. ప్రేక్షకులకు కొంచెం భిన్నమైన అనుభూతిని అందించాలనే తపన ఉంటే.. పాత్రల్లో జీవం ఉంటే.. వాటిని పోషించిన వాళ్లు మనసు పెట్టి నటిస్తే.. ఇలాంటి కథతోనూ ప్రేక్షకులను మెప్పించవచ్చని ‘చెన్నై లవ్ స్టోరీ’ రుజువు చేస్తుంది. ఇది కొత్త కథ అని.. ఇలాంటి పాత్రలు.. సిచువేషన్లు ఇంతకుముందు చూడలేదు అని చెప్పలేం. నిజానికి ఇది ఓల్డ్ స్కూల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల పాత్రలు కూడా పాత రోజులను గుర్తుకు తెస్తాయి. ఈ రోజుల్లో ఇలా ఎవరుంటారు అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఔట్ డేట్ అనే ఫీల్ రాకుండా.. ట్రెండీ ట్రీట్మెంట్ తో ఈ కథను నడిపించారు సాయిరాజేష్-రవి నంబూరి.

ఏ ప్రేమకథలో అయినా.. హీరో హీరోయిన్లు అనుకోకుండా కలవడం.. పరిచయం కాస్తా ప్రేమగా మారడం.. ఇద్దరూ పెళ్లికి రెడీ అవడం.. అంతలో ఒక మలుపు చోటు చేసుకోవడం.. ఇవన్నీ మామూలే. ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా ఇలాగే నడుస్తుంది. కానీ హీరో హీరోయిన్ల నేపథ్యం.. పాత్రల చిత్రణ.. వారికి ఎదురయ్యే సిచువేషన్లు.. వారి మధ్య కాన్వర్జేషన్లు.. ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. పెద్దగా నాటకీయత లేకుండా సహజంగా.. ఆహ్లాదకరంగా సాగిపోయే సన్నివేశాలు-సంభాషణలు సినిమాకు ఆకర్షణ. ఈ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి.. వీళ్లేం మాట్లాడకుంటారు.. దీని తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కలిగేలా కథనాన్ని నడిపించారు. ఏ హడావుడి లేకుండా సింపుల్ హీరోయిన్-హీరోలను పరిచయం చేశాక.. వారి మధ్య ప్రేమ బిల్డ్ అయ్యే సీన్లను కన్విన్సింగ్ గా తీర్చిదిద్దారు. తొలి గంటలో సరదాగా.. ఆహ్లాదకరంగా సాగిపోయే ‘చెన్నై లవ్ స్టోరీ’ మధ్యలో ఊహించని మలుపుతో ప్రేక్షకులను నివ్వెర పోయేలా చేస్తుంది.

ఆ తర్వాత ఈ కథను ఎలా ముందుకు తీసుకెళ్తారో అనే అయోమయం నెలకొంటుంది. ఐతే తర్వాత వచ్చే ఇంకో మలుపును చూశాక ముగింపును ఊహించడం కష్టమేమీ కాదు. ఈ దశలో ‘చెన్నై లవ్ స్టోరీ’ కొంచెం నెమ్మదిస్తుంది. కథ పెద్దగా ముందుకు కదలక కొంత అసహనం కూడా కలుగుతుంది. ఇక్కడ సిల్లీగా అనిపించే కొన్ని సీన్లతో ‘చెన్నై లవ్ స్టోరీ’ కొద్దిగా ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. కానీ మళ్లీ హార్ట్ టచింగ్ ఎమోషన్లతో.. ఇంటెన్స్ సీన్లతో ‘చెన్నై లవ్ స్టోరీ’ గాడిన పడుతుంది. ఇలాంటి క్లాస్ లవ్ స్టోరీలోనూ ఒక మాస్ సీన్ తో ప్రేక్షకుల్లో ఉద్రేకం తీసుకురాగలగడం విశేషం. చివరి 20 నిమిషాల్లో భావోద్వేగాలను పీక్స్ కు తీసుకెళ్లారు. క్లైమాక్స్ బలమైన ముద్ర వేస్తుంది. హీరో పాత్ర ప్రవర్తనలో.. తన పాత్ర చిత్రణలో కొన్ని చోట్ల లాజిక్ మిస్సయినట్లు అనిపించినా.. అక్కడక్కడా ఆ పాత్ర అసహనం కలిగించినా.. మధ్యలో కొన్ని సన్నివేశాలు సహనాన్ని పరీక్షించినా.. ఈ లోపాలను మన్నించగల మంచి విషయాలు సినిమాలో ఉన్నాయి. ఓల్డ్ స్కూల్ సినిమాలా అనిపిస్తూనే.. ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని కలిగించడంలో ‘చెన్నై లవ్ స్టోరీ’ విజయవంతమైంది.

నటీనటులు:

‘చెన్నై లవ్ స్టోరీ’కి లీడ్ పెయిర్ అతి పెద్ద ఆకర్షణ. కిరణ్ అబ్బవరం నిస్సందేహంగా కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు ‘చెన్నై లవ్ స్టోరీ’లో. కొంచెం యాటిట్యూడ్ ఉన్న పాత్రలకు పేరుపడ్డ అతను.. ఇందులో అమాయకుడైన కుర్రాడిగా భలేగా ఒదిగిపోయాడు. స్టీవెన్ శంకర్ పాత్రను చూస్తున్న కొద్దీ ఇతను చాల ా మంచోడు.. అమాయకుడు.. తనదొక చిన్న ప్రపంచం అనే ఫీలింగ్ ప్రేక్షకుల మనసుల్లో బలంగా ముద్ర పడిపోయేలా చేయగలిగాడు. ఎమోషనల్ సీన్లలో కూడా మునుపటి కంటే చాలా బాగా చేశాడు. ఐతే పెర్ఫామెన్సులో కిరణ్ కంటే కూడా ఎక్కువ మార్కులు పడేది మాత్రం శ్రీ గౌరీప్రియకే. నివి పాత్రలో మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో అనుభవమున్న నటిలా ఆ పాత్రను పండించింది శ్రీ గౌరీప్రియ. ఆర్టిస్టులు ఏడ్చినంత మాత్రాన ఎమోషనల్ సీన్లలో బాగా నటించినట్లు కాదు. ఆ బాధను ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయగలగాలి. గౌరీప్రియ అదే చేసింది. ఇంటర్వెల్‌ కు ముందు-తర్వాతి సన్నివేశాల్లో.. చివరి 20 నిమిషాల్లో తన పెర్ఫామెన్స్ గుండెల్ని మెలిపెడుతుంది. గొప్ప అందగత్తెలా కాకుండా పాత్రకు తగ్గ సహజమైన అందం.. అప్పీయరెన్స్ తో ఆమె ఆకట్టుకుంది. అజయ్ పాత్రలో త్రిగుణ్ సటిల్ గా.. కొలిచినట్లు నటించాడు. హీరోయిన్ తల్లిదండ్రుల పాత్రల్లో ప్రమోదిని-దేవి ప్రసాద్.. మిగతా సహాయ పాత్రల్లో కరుణ్ కుమార్.. సిరి హనుమంతు.. మహిందర్.. ఇతర ఆర్టిస్టులు కూడా బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

‘చెన్నై లవ్ స్టోరీ’కి సాంకేతిక హంగులు బాగా కుదిరాయి. ఒక ప్రేమకథకు సంగీత పరంగా అవసరమైన బలాన్ని మణిశర్మ అందించాడు. చాలా ఏళ్ల తర్వాత తన ముద్రను చాటుతూ మంచి పాటలతో మెప్పించాడు. తొలి ప్రేమేం.. జిగితార.. కొయిల కొయిల.. ఈ మూడు పాటలూ వినసొంపుగా ఉన్నాయి. మిగతా పాటలూ ఓకే. మణిశర్మ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. డేనియల్ విశ్వాస్ విజువల్స్ సినిమాకు మరో ఆకర్షణ. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన మేర బాగా కుదిరాయి. ఇక కథా రచయిత సాయి రాజేష్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. రవి నంబూరితో కలిసి ఆయన అందించిన కథనం కొంచెం అటు ఇటుగా అనిపించినా.. మూడు గంటల నిడివిలో చాలా వరకు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెడుతుంది. రవి నంబూరి మాటలు బాగున్నాయి. డైలాగులు మరీ లోతుగా ఉండాలి.. పంచ్ ఉండాలి అని చూడకుండా.. సింపుల్ కాన్వర్జేషన్లతో సన్నివేశాలను నడిపించాడు. అతడి టేకింగ్ కూడా బాగుంది.

చివరగా: చెన్నై లవ్ స్టోరీ.. ‘సోల్’ఫుల్ లవ్ స్టోరీ

రేటింగ్ - 3/5