చెన్నై లవ్ స్టోరీ ఆడియో: ఒకే వేదికపై డజను మంది సంగీత దర్శకుల అరుదైన రికార్డు!
మాస్ మూవీ మేకర్స్ పతాకంపై టాలీవుడ్ ఫిలింమేకర్స్ సాయి రాజేష్, ఎస్.కే.ఎన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రేమ కథా చిత్రం `చెన్నై లవ్ స్టోరీ`.
By: Sivaji Kontham | 26 May 2026 9:58 AM ISTమాస్ మూవీ మేకర్స్ పతాకంపై టాలీవుడ్ ఫిలింమేకర్స్ సాయి రాజేష్, ఎస్.కే.ఎన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రేమ కథా చిత్రం `చెన్నై లవ్ స్టోరీ`. రవి నంబూరి దర్శకత్వంలో టాలెంటెడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ పరంగా సరికొత్త పంథాను అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమా నుండి `వదలనే` అనే మొదటి మెలోడీ గీతాన్ని పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యపోయేలా ఒక భారీ వేడుక ద్వారా చిత్రబృందం విడుదల చేసింది. ఈవెంట్ కేవలం పాటల విడుదలకు మాత్రమే పరిమితం కాకుండా.. టాలీవుడ్ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టానికి వేదికగా నిలిచింది.
ఈ ప్రత్యేక గీతావిష్కరణ వేడుక టాలీవుడ్ ఈవెంట్ల చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని క్రియేట్ చేసింది. సాధారణంగా ఒకే చిత్రానికి ముగ్గురు నలుగురు సంగీత దర్శకులు పనిచేయడం లేదా వేర్వేరు కార్యక్రమాల్లో ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు కలవడం చూస్తుంటాం. కానీ ఈ సినిమా ఆడియో ప్రమోషన్స్ కోసం ఏకంగా డజను మంది (12 మంది) ప్రముఖ సంగీత దర్శకులు ఒకే వేదికపైకి రావడం సరికొత్త రికార్డు. సినీపెద్దగా థియేటర్ల సమస్యపై చర్చిస్తూ పరిష్కారం వెతుకుతున్న మెగాస్టార్ చిరంజీవికి చిత్ర పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు తెలిపేందుకు... అలాగే యువ బృందాన్ని ఆశీర్వదించేందుకు లెజెండరీ స్వరకర్తలు మణిశర్మ, ఎం.ఎం. కీరవాణితో పాటు పరిశ్రమకు చెందిన పలువురు అగ్రశ్రేణి సంగీత దర్శకులు విచ్చేసి ఈ సభను ఒక మధురమైన స్వరాల పండుగగా మార్చేశారు. వేడుకలో ఎం.ఎం.కీరవాణి, మణిశర్మ, మాధవ పెద్ది సురేష్, అనూప్ రూబెన్స్, కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్, గౌరా హరి, సురేష్ బొబ్బిలి, శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆస్కార్ విన్నింగ్ కంపోజర్, మ్యాస్ట్రో ఎం.ఎం. కీరవాణి సినిమా విజయంపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఒక అందమైన ప్రేమకథా చిత్రంలో ఏకంగా ఏడు అద్భుతమైన పాటలు ఉన్నాయంటే ఆ సినిమా ఖచ్చితంగా `మ్యూజికల్ బ్లాక్ బస్టర్` సాధించినట్లేనని ఆయన తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అనంత శ్రీరామ్ అందించిన అద్భుతమైన సాహిత్యం, ప్రముఖ గాయకుడు జావేద్ అలీ ప్రాణం పోసిన ఆలాపనలో ఈ `వదలనే` పాటను ప్రతి హృదయానికి హత్తుకునేలా చేశాయని.. అన్నారు.
గతంలో `బేబి` వంటి క్లాసిక్ కల్ట్ లవ్ స్టోరీని అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ ఒక నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆడియో లాంచ్ వేడుకకు విచ్చేసిన పలువురు సినీ ప్రముఖులు ఆయన మేకింగ్ స్టైల్‌ను ప్రశంసిస్తూ, `బేబి` సినిమా చూసిన తర్వాతే తాము సాయి రాజేష్ గారికి పెద్ద అభిమానులుగా మారామని కొనియాడారు. హృదయాలను కదలించే ప్రేమకథలను ఎంచుకోవడంలో ఆయనకున్న అభిరుచి, వాటిని విజువల్ ఫీస్ట్ గా ముందుకు తీసుకురావడంలో చూపే శ్రద్ధ కారణంగానే ఈ `చెన్నై లవ్ స్టోరీ` చిత్రంపై ట్రేడ్ వర్గాలలో, ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
`చెన్నై లవ్ స్టోరీ` చిత్ర బృందం ప్రమోషన్ల విషయంలో తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలు.. మొదటి పాటకే సాధించిన భారీ రెస్పాన్స్ సినిమాపై హైప్‌ను స్కై హైకి తీసుకెళ్లాయి. కథనంలో వైవిధ్యం, సంగీతంలో ప్రాధాన్యత, .. అనుభవజ్ఞులైన ఫిలింమేకర్స్ కలయికతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోందని అంచనా వేస్తున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఈ ప్రేమకథ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని టాలీవుడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
