Begin typing your search above and press return to search.

ఛార్మి షేర్ చేసిన పూరి లేటెస్ట్ ఫోటో

పుట్టినరోజు శుభాకాంక్షలు సార్!! మీకు మంచి రోజు.. మంచి సంవత్సరం ముందుందని ఆశిస్తున్నాము! అంటూ ఒక అభిమాని పూరీకి విషెస్ తెలిపారు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 5:48 AM GMT
ఛార్మి షేర్ చేసిన పూరి లేటెస్ట్ ఫోటో
X

పుట్టినరోజు శుభాకాంక్షలు జగ్గు..! ఈరోజు స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా నెటిజ‌నుల్లో ఉత్సాహం నెల‌కొంది. ఆల్ టైమ్ టాలీవుడ్ బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ పూరీకి విషెస్ హోరెత్తుతున్నాయి. సినీప్ర‌ముఖులు కొలీగ్స్ నుంచి పూరీకి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎంత అద్భుతమైన వ్య‌క్తి మీరు..! పుట్టినరోజు శుభాకాంక్షలు సార్!! మీకు మంచి రోజు.. మంచి సంవత్సరం ముందుందని ఆశిస్తున్నాము! అంటూ ఒక అభిమాని పూరీకి విషెస్ తెలిపారు.


విజ‌యం తాలూకా ఆనందాన్ని అనుభవించడానికి చాలా పోరాటాలు వైఫల్యాలు బాధలు కష్టాలు కావాలి. ఈ మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అందించడానికి ప్రేమ దయ కరుణ క‌లిగి ఉండాలి. మీరు నాపై చూపించిన ప్రేమ‌కు అందించిన శ‌క్తికి నేను అదృష్టవంతుడిని.. మిస్ యూ సార్! అంటూ ఒక అభిమాని పూరీపై ప్రేమ‌ను కురిపించాడు. సోష‌ల్ మీడియాల్లో పూరీకి ఉన్న అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ నుంచి ర‌క‌ర‌కాలుగా విషెస్ కురుస్తున్నాయి.


అయితే వీట‌న్నిటి కంటే భిన్న‌మైన ప్రేమ ఛార్మీది. పూరి క‌నెక్ట్స్ అధినేత్రిగా నేడు త‌న బాస్ పూరి జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజును ఛార్మి ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ఇన్ స్టాలో పూరీ కొత్త లుక్ ఒక‌టి షేర్ చేసింది ఛార్మి. ఈ ఫోటోగ్రాఫ్ లో పూరి ఎంతో నిర్మ‌లంగా, ప్ర‌శాంతంగా క‌నిపిస్తున్నాడు. సింపుల్ గా నెక్ బ‌నియ‌న్ ధ‌రించి, త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన ప‌ప్పీని చేతిలోకి ఎత్తుకుని ఇదిగో ఇలా స్మైలిస్తూ పూరి కెమెరాకు ఫోజిచ్చాడు. పూరి త‌న డెన్ - కేవ్ లో దిగిన ఫోటో ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. స‌రిగ్గా రెండు రోజుల క్రితం ఛార్మి త‌న ఫోటోను కూడా షేర్ చేసింది. ఇందులో ఈ పంజాబి బ్యూటీ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.

స్వ‌గ‌తం: పూరి జగన్నాధ్ 28 సెప్టెంబర్ 1966 లో జ‌న్మించారు. వయస్సు 57 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో జన్మించారు. ఏపీలో న‌ర్సీప‌ట్నం స‌మీపంలోని (అనకాపల్లి జిల్లా) బాపిరాజు కొత్తపల్లి గ్రామానికి చెందినవాడు. పెద్ద బొడ్డపల్లిలోని సెయింట్ థెరిస్సా ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. 1986లో ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలోని A. M. A.L. కాలేజీ నుండి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు. పూరి తండ్రి పేరు శ్రీ సింహాచలం. ఆయ‌న‌ 2010లో మరణించాడు. పూరీకి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. YSR కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అయిన పెట్ల ఉమా శంకర గణేష్ ..నటుడు సాయిరాం శంకర్ ఇప్ప‌టికే పాపుల‌ర్. 6 సెప్టెంబర్ 1996న లావణ్యను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆకాష్ అనే కుమారుడు, పవిత్ర అనే కుమార్తె ఉన్నారు. అతని కుమారుడు ఆకాష్ హీరోగా న‌టిస్తున్నాడు. 2018లో తెలుగు చిత్రం ‘మెహబూబా’తో ఆకాష్ హీరోగా రంగ ప్ర‌వేశం చేసాడు.

ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాధ్ తన ప్రేమ కథ గురించి మాట్లాడుతూ.. లావణ్యకు పెళ్లికి ఎలా ప్రపోజ్ చేసాడో వెల్లడించాడు. తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి లావణ్యకు ప్రపోజ్ చేశానని చెప్పాడు. వారి సంబంధం ప్రారంభంలో తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో ఆమెను కలవడానికి కూడా వెనుకాడినట్లు పూరి వెల్లడించాడు. ఒక సంఘటనను ఆయ‌న గుర్తు చేసుకున్నారు. పూరీ ఒకసారి లావణ్యను రెస్టారెంట్‌కు తీసుకెళ్లగా అక్కడ ఆమె చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే తన వద్ద డబ్బు లేకపోవడంతో బిల్లు గురించి ఆందోళన చెందానని వెల్లడించాడు. విలాసవంతమైన వివాహం కోసం తల్లిదండ్రుల డబ్బును వృధా చేయడం ఇష్టం లేకనే ఆలయంలో సాదాసీదాగా పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించాడు.

పూరి జగన్నాధ్ 2000లో తెలుగు సినిమా 'బద్రి'తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు కూడా పూరీనే రాశారు. 2001లో తెలుగు సినిమా 'తమ్ముడు'కి రీమేక్‌గా వచ్చిన 'యువరాజా' సినిమాతో దర్శకుడిగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. 2002లో కన్నడ చిత్రం 'అప్పు'కి దర్శకుడిగా, కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా పనిచేశాడు. అదే సంవత్సరంలో ఈ చిత్రాన్ని ఇడియట్ పేరుతో తెలుగు రీమేక్ చేసాడు. 2004లో పూరి దర్శకుడిగా, కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా పనిచేసిన 'షార్ట్: ది ఛాలెంజ్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. . ఈ చిత్రం అతని దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'బద్రి'కి అధికారిక‌ రీమేక్. 2011లో అమితాబ్ బచ్చన్ నటించిన బాలీవుడ్ చిత్రం 'బుద్దా... హోగా తేరా బాప్‌'కి దర్శకత్వం వహించాడు. పూరీనే ర‌చ‌యిత‌. ఆ చిత్రం తరువాత ఆస్కార్ లైబ్రరీలో ఆర్కైవ్ చేయడం ఒక చ‌రిత్ర‌.

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003), 143 (2004), పోకిరి (2006) చిత్రాల ద‌ర్శ‌కుడిగా పూరీ పేరు మార్మోగింది. దర్శకుడిగా, కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా, డైలాగ్ రైటర్‌గా, నిర్మాతగా ఆయన ప‌నిత‌నం అన్నివేళ‌లా హాట్ టాపిక్. ముఖ్యంగా పంచ్ డైలాగుల రాయ‌డంలో పూరీని కొట్టే వాళ్లే లేర‌న‌డంలో సందేహం లేదు. హార్ట్ ఎటాక్ (2014), మెహబూబా (2018), ఇస్మార్ట్ శంకర్ (2019), లైగర్ (2022) సినిమాల్ని పూరి తెర‌కెక్కించారు. ఇష్క్ (2016), ఇస్మార్ట్ శంకర్ (2019) చిత్రాలు అత‌డికి పేరును తెచ్చాయి. లైగ‌ర్ హిందీలోను విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

న‌టుడిగాను.. పూరి కొన్ని తెలుగు చిత్రాలలో నటుడిగా కూడా కనిపించాడు. అతడు 'బిజినెస్‌మేన్' (2012) చిత్రంలో టాక్సీ డ్రైవర్‌గా నటించాడు. 2015లో 'టెంపర్' చిత్రంలో బైకర్‌గా కనిపించాడు. అతను 2022లో బ్లాక్‌బస్టర్ చిత్రం 'గాడ్‌ఫాదర్'లో గోవర్ధన్ పాత్రను పోషించాడు. ఏ మాయ చేసావే (2010) సహా కొన్ని చిత్రాలలో అతిధి పాత్రలో కూడా కనిపించాడు.

పెళ్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు సెప్టెంబర్ 2020లో పూరి జగన్నాధ్ పెళ్లి ఆలోచనపై వివాదాస్పద వ్యాఖ్య చేసాడు. పూరి మ్యూజింగ్స్ అనే తన పోడ్‌కాస్ట్ షోలో పెళ్లిని ఔట్ డేటెడ్ అని కామెంట్ చేసాడు. తన పోడ్‌కాస్ట్ షోలో వివాహం గురించి మాట్లాడుతూ.. ఎవరైనా పెద్దగా ఏదైనా సాధించాలనుకుంటే పెళ్లి చేసుకోకూడదు అని పూరీ అన్నాడు. బుద్ధ భగవానుడు సహా వివిధ ఉదాహరణలను ఉదహరిస్తూ .. బుద్ధుడు తన భార్యను విడిచిపెట్టిన తర్వాతే ప్రిన్స్ సిద్ధార్థ బుద్ధుడు అయ్యాడ‌ని తెలిపాడు. మీరు చేయాల‌నుకున్న‌ పని ల‌క్ష్యం విష‌యంలో దూకుడుగా ఉంటే పెళ్లి చేసుకోకండి... అని కూడా పూరీ అన్నాడు. నేడు పూరీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు.