నటించకున్నా ఇంత కష్టం అవసరమా చార్మి...?
చార్మి హీరోయిన్‌గా చివరి సారి 2015లో మంత్ర 2 కనిపించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
By: Tupaki Desk | 27 May 2025 4:00 PM ISTరెండు దశాబ్దాల క్రితం చిన్న వయసులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చార్మి కౌర్ దాదాపు పుష్కర కాలం పాటు బిజీ బిజీగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఏడాదికి మూడు నాలుగు, కొన్ని సార్లు అంతకు మించి సినిమాలు చేసిన ఘనత చార్మికి దక్కింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌గా, ఐటెం సాంగ్స్‌లో అవకాశాలు వస్తున్న సమయంలోనే చార్మి నటనకు దూరం అయింది. తక్కువ సమయంలోనే చార్మి నటనకు గుడ్ బై చెప్పడం పట్ల అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. అయితే నటిగా చార్మి సినిమాలకు దూరం అయినా కూడా సహ నిర్మాతగా వరుసగా టాలీవుడ్‌లో కొనసాగుతున్న విషయం తెల్సిందే. చార్మి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలన్నింటికి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది.
చార్మి హీరోయిన్‌గా చివరి సారి 2015లో మంత్ర 2 కనిపించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. జ్యోతి లక్ష్మి సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుని చేసిన చార్మికి ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను తెచ్చి పెట్టలేదు. దాంతో చార్మి నిరాశతో ఇండస్ట్రీని వదిలిందనే వార్తలు వస్తాయి. కానీ ఆమె నటనపై ఆసక్తి లేక పోవడంతో నిర్మాతగా పూరి కాంపౌండ్‌లో చేరింది అనేది చాలా మంది మాట. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న చార్మి వెండి తెరపై కనిపించక పోవడం అనేది చాలా పెద్ద లోటు అంటూ అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల్లో నటించే హీరోయిన్స్ రెగ్యులర్‌గా గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. అయితే హీరోయిన్‌గా యాక్టివ్‌గా లేని వారు మాత్రం వర్కౌట్స్ చేయడం మనం పెద్దగా చూడం. నటనకు దూరం అయిన వారు చాలా మంది బొద్దుగా మారడం, ఫిజిక్ విషయంలో శ్రద్ద కనబరచక పోవడంతో బరువు పెరగడం మనం చూస్తూ ఉంటాం. ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్, ముఖ్యంగా నటనకు దూరం అయిన వారు బరువు పెరగడం మనం చూస్తూ ఉంటాం. కానీ చార్మి మాత్రం ఇంకా అందంగా, గతంలో హీరోయిన్‌గా నటించినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. అప్పుడప్పుడు మీడియా సమావేశాల్లో కనిపిస్తున్న చార్మిని ఇంత అందంగా ఉన్నారు నటిస్తే బాగుంటుంది కదా అంటూ చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు.
నటనకు దూరం అయినా చార్మి వర్కౌట్స్ కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె వర్కౌట్ ఫోటోలను షేర్ చేసింది. తల నుంచి పాదాల వరకు కింద అంటూ క్యాప్షన్ ఇచ్చింది. జిమ్‌లో చాలా కష్టపడుతున్న చార్మిని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. సినిమాల్లో నటించకున్నా ఇంత కష్టం అవసరమా మేడం అంటూ ఆమెను అభిమానించే వారు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చార్మి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో కష్టపడుతున్న చార్మి ముందు ముందు అయినా నటిగా మళ్లీ బిజీ కావాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో చార్మి నిర్మాతగానే సెటిల్ కానుందా.. లేదంటే తిరిగి నటిగా బిజీ అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.
