Begin typing your search above and press return to search.

చంద్రమోహన్ మరో రెండు అడుగుల పొడుగు ఉంటే....!

చంద్రమోహన్ గురించి చెప్పాలనే ఏ విశేషణం వాడాలో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన నటుడిగా అంతటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 11:40 AM GMT
చంద్రమోహన్ మరో  రెండు అడుగుల పొడుగు ఉంటే....!
X

చంద్రమోహన్ గురించి చెప్పాలనే ఏ విశేషణం వాడాలో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన నటుడిగా అంతటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. హీరో అందామా అంటే హీరో మాత్రమే కాదు, కామెడీ అంటే మంచి టైమింగ్ తో కామెడీని పండించే సత్తా ఉన్న నటుడు. తండ్రి అన్న స్నేహితుడు ఇలా క్యారక్టర్ ఆర్టిస్టుగా దున్నేశారు.

ఇక నవరసభరితం అన్నట్లుగా అన్ని రకాలైన పాత్రలలో ఇమిడిపోయారు. ఒక నటుడికి కొన్ని రసాలు అయితే పలకవు. కానీ చంద్రమోహన్ అలా కాదు, ఆయన కామెడీ ఎంత బాగా పండించగలలో విషాదం అంతేలా పలికించగలరు, కలికాలం, ఆమె సినిమాలలో ఆయన నటన దానికి మచ్చుతునక.

హీరోగా ఆయన కామెడీ రోల్స్ తో పాటు సందేశాత్మకమైన పాత్రలలో కనిపించారు. ఇక ఒక వైపు హీరోగా చేస్తూనే అగ్ర నటుల చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను వేస్తూ వచ్చారు. హీరోగా చంద్రమోహన్ 175కి పైగా చిత్రాలలో నటించారు అంటే గ్రేటెస్ట్ అని చెప్పాలి.

ఇక మిగిలినవి అన్నీ కలిపి ఏకంగా 950 చిత్రాలకు పైగా నటించారు. వేయి చిత్రాలను పూర్తి చేయాలన్నది చంద్రమోహన్ కోరిక. కానీ 2017లో వచ్చిన ఆక్సిజన్ ఆయన ఆయన చివరి సినిమా. ఆ తరువాత అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన సినీ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే చంద్రమోహన్ లక్కీ హీరో అని వేరేగా చెప్పాల్సిన పని లేదు.

ఆయనతో మొదట నటించిన వాణిశ్రీ, విజయనిర్మల, లక్ష్మి వంటి సీనియర్ నటీమణుల నుంచి జయసుధ, జయప్రద శ్రీదేవి విజయశాంతి భానుప్రియ ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్లు కళ్ళ ముందు కనిపిస్తారు. ఎంతో మంది కొత్త హీరోయిన్లు చంద్రమోహన్ తో మొదట నటించి తరువాత తారాపధంలో కి దూసుకుపోయిన వారే.

చంద్రమోహన్ నటుడు కావాలని అనుకున్నారు. కానీ ఆయన దానికంటే ముందు అగ్రికల్చర్ బీఎస్సీ చదివి కొన్నాళ్ళ పాటు డిమాన్స్ట్రేటరు గా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ప్రతిభలో ఆయన ఆ జాబ్ సంపాదించుకున్నారు. సినిమా ఫీల్డ్ లో ఎలా ఉంటుందో అని చాన్నాళ్ళ పాటు ఆయన జాబ్ కి రిజైన్ కూడా చేయలేదు.

మల్లీశ్వరి తీసిన దిగ్దర్శకుడు బీఎన్ రెడ్డి కొత్త వారితో తీసిన రంగులరాట్నం మూవీ చంద్రమోహన్ కి మొదటి చిత్రం. ఆ సినిమాలో చిన్న వేషం కోసం వెళ్ళిన చంద్రమోహన్ ని చూసి బీఎన్ రెడ్డి ఆయనకు హీరో వేషమే ఇచ్చేశారు. అలా తొలి సినిమాతోనే హీరోగా అవకాశం అందుకున్న చంద్రమోహన్ వెనుదిరిగి చూడలేదు. ఇదిలా ఉంటే ఇరవై నాలుగేళ్ళ వయసులో ఇండస్ట్రీలో ప్రవేశించిన చంద్రమోహన్ సినిమాల్లోకి రాకముందు కాలేజీలో నాటాకల్లో వేషాలు వేశారు.

వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్ తో పాటు గేంస్ లో కూడా చంద్రమోహన్ ప్రావీణ్యుడు. మల్లవరపు చంద్రశేఖరరావుకు బీఎన్ రెడ్డి పెట్టిన వెండి తెర పేరు చంద్రమోహన్. అలా ఆయన దశ తిరిగి హీరోగా అనతికాలంలో సెటిల్ అయ్యారు.

చిన్న సినిమాలకు కొంగుబంగారం చంద్రమోహన్. ఆ రోజులలో చిన్న నిర్మాత నుంచి ఏ కొత్త నిర్మాత అయినా సినిమా తీయాలంటే ఫస్ట్ చాయిస్ గా చంద్రమోహన్ ఉండేవారు. ఆయనతో సినిమా అంటే అప్పట్లో అయిదు నుంచి పది లక్షల బడ్జెట్ లో పూర్తి అయ్యేది. ఇక నిర్మాతకు కచ్చితంగా మూడు నాలుగు లక్షల దాకా లాభాలు వచ్చేవి.

ఈ రోజున స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న సి అశ్వనీదత్ తీసిన మొదటి సినిమా ఓ సీత కధలో హీరో కూడా చంద్రమోహన్ కావడం విశేషం. అలా హీరోయిన్లకే కాదు కొత్త నిర్మాతలకు కొత్త దర్శకులకు చంద్రమోహనే తొలి ఆప్షన్. అలా గేట్ వే ఆఫ్ టాలీవుడ్ గా పేరు పొందిన చంద్రమోహన్ ప్రతిభను ఎంటీయార్ తొలి రోజుల్లోనే అభినందించారు.

అక్కినేని అయితే తన సినిమాలలో వరస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు.క్రిష్ణ క్రిష్ణంరాజులతో రూం మేట్ గా ఉండేవారు చంద్రమోహన్. క్రిష్ణ సొంత సినిమాల్లో చంద్రమోహన్ కి పాత్ర లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. క్రిష్ణ ప్రతిష్టాత్మకంగా తీసిన కురుక్షేత్రం మూవీలో అభిమన్యుడిగా కీలక పాత్ర పోషించి శభాష్ అనిపించారు చంద్రమోహన్,.

అంతే కాదు బాలక్రిష్ణ రెండవ చిత్రం రాం రహీం. అందులో హరిక్రిష్ణ కూడా నటించారు. ఈ ఇద్దరు బాల నటుల సినిమాలో చంద్రమోహన్ హీరోగా నటించి వారి కెరీర్ తొలినాళ్ళలోనే అనుబంధం పెంచుకున్నారు. మరో రెండు అడుగులు పొడుగులు ఉండి ఉంటే కచ్చితంగా అగ్ర హీరోలకే సవాల్ విసిరే వారు మన చంద్రమోహన్ అని విశ్వ నటుడు ఎస్వీ రంగారావు కొనియాడారు అంటే చంద్రమోహన్ ప్రతిభను ఊహించగలమా.

పదహారేళ్ల వయసు, కలికాలం, ఓ భార్య కధ, ఆమె రాధా కళ్యాణం, సుఖ దుఖాలు వంటివి చంద్రమోహన్ నటనకు మచ్చుతునకలు. హీరో అంటే వివాదరహితుడిగా పది మంది మేలు కోరుకునేవాడే అని రియల్ లైఫ్ లో చూపించిన చంద్రమోహన్ ఈ రోజు దివికేగినా ఆయన చిత్రాలు మాత్రం అందరికీ కళ్ళ ముందు ఉంటూనే ఉంటాయి.