కాంట్రవర్సీ దెబ్బ.. గుక్కపెట్టి ఏడ్చిన చంద్రహాస్!
సోషల్ మీడియాలో 'యాటిట్యూడ్ స్టార్'గా పిలవబడే చంద్రహాస్.. తన సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'ప్రీ రిలీజ్ ఈవెంట్ తో వార్తల్లో నిలిచారు.
By: Tupaki Desk | 7 Feb 2026 5:43 PM ISTసోషల్ మీడియాలో 'యాటిట్యూడ్ స్టార్'గా పిలవబడే చంద్రహాస్.. తన సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'ప్రీ రిలీజ్ ఈవెంట్ తో వార్తల్లో నిలిచారు. మొన్నటి వరకు వివాదాలతో, ట్రోలింగ్‌తో నిత్యం నెట్టింట హల్చల్ చేసిన ఈ కుర్ర హీరో, ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మూవీ నిన్న ఫిబ్రవరి 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత మీడియా ముందు ఆయన ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వివాదాల భయం నుండి థియేటర్లో వచ్చిన స్పందన వరకు చంద్రహాస్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పాట వివాదం - వెంటాడిన భయం:
చంద్రహాస్ హీరోగా పరిచయమైన 'బరాబర్ ప్రేమిస్తా' సినిమా నిన్న విడుదల అయ్యింది.మూవీ చూసి చంద్రహాస్ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన పాడిన అసభ్యకరమైన పాటలు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాయి. దీనివల్ల ఆయన ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా, సినిమాపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందేమోనని చంద్రహాస్ తీవ్ర ఆందోళన చెందారు. "ఆ వివాదం వల్ల జనం థియేటర్లకు రారేమో, నా సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందేమో అని చాలా భయపడ్డాను" అని ఆయన మీడియా ముందు తన మనసులోని భయాన్ని బయటపెట్టారు. ఒక రకంగా ఆ వివాదం ఈ యంగ్ హీరోను మానసిక ఒత్తిడికి గురి చేసినట్టు తెలిసింది.
థియేటర్లో ఎమోషనల్ సీన్ - చంద్రహాస్ కన్నీళ్లు:
ఫిబ్రవరి 6న సినిమా విడుదలైన సందర్భంగా చిత్ర యూనిట్‌తో కలిసి సినిమా చూసిన చంద్రహాస్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై ఏడ్చేశారు. "నాకు మాటలు రావడం లేదు.. చివరి 10 నిమిషాలైతే ఏడుపొచ్చేసింది. ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొడుతుంటే నా భయం పోయింది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫైనల్ కాపీని థియేటర్లో మొదటిసారి చూసినప్పుడు కలిగిన అనుభూతిని ఆయన వర్ణించలేకపోయారు. వివాదాల ఎఫెక్ట్ సినిమాపై పడలేదని, ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలియగానే ఆయనలోని ఆనందం కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది.
బరాబర్ ప్రేమిస్తా - మూవీ విశేషాలు:
సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. అర్జున్ మహి విలన్‌గా అలరించగా, కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, ఏవీఆర్, గాయత్రి చిన్ని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా ద్వారా చంద్రహాస్ తనలోని నటుడిని నిరూపించుకోవాలని గట్టిగా ప్రయత్నించారు. ట్రోల్స్ పక్కన పెడితే, నటుడిగా ఆయన చూపిన పరిణతికి థియేటర్లో మంచి స్పందన లభిస్తోంది. మరి ఈ 'బరాబర్ ప్రేమిస్తా' బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
