Begin typing your search above and press return to search.

మ‌నిషిని పంపి మ‌రీ తీసుకెళ్లారు - చంద్ర‌బోస్

చంద్ర‌బోస్.. ఆయ‌న అక్ష‌రాలు తెలుగు పాట‌కు జ‌రిగే ప‌ట్టాభిషేకాలు.. కొన్ని వేల ట్యూన్ల‌కు త‌న అక్ష‌రాల‌తో ప్రాణం పోసిన ఆయ‌న మొద‌టిగా తాజ్ మ‌హ‌ల్ సినిమాతో సినీ రంగ ప్ర‌వేశం చేశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 Aug 2025 7:00 PM IST
మ‌నిషిని పంపి మ‌రీ తీసుకెళ్లారు - చంద్ర‌బోస్
X

చంద్ర‌బోస్.. ఆయ‌న అక్ష‌రాలు తెలుగు పాట‌కు జ‌రిగే ప‌ట్టాభిషేకాలు.. కొన్ని వేల ట్యూన్ల‌కు త‌న అక్ష‌రాల‌తో ప్రాణం పోసిన ఆయ‌న మొద‌టిగా తాజ్ మ‌హ‌ల్ సినిమాతో సినీ రంగ ప్ర‌వేశం చేశారు. చంద్ర‌బోస్ కెరీర్ లో డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావుది చాలా ప్ర‌త్యేక స్థానం. రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమాల్లో ప‌లు పాట‌ల‌కు చంద్ర‌బోస్ లిరిక్స్ అందించారు.

మ‌నిషిని పంపి మ‌రీ తీసుకెళ్లారు

తాజ్‌మ‌హ‌ల్ సినిమాలో పాట రాశాక తాను ఇంజ‌నీరింగ్ చేస్తూ కూక‌ట్‌ప‌ల్లిలో ఒక ఇంట్లోని నాలుగో ఫ్లోరులో ఉండేవాడిన‌ని, ఒక‌రోజు నేల మీద చాప వేసుకుని నిక్క‌రుతో ప‌డుకుని ఉన్న టైమ్ లో త‌న వ‌ద్ద‌కు ఓ మ‌నిషి వ‌చ్చి మా బాబాయి మిమ్మ‌ల్ని తీసుకుర‌మ్మంటున్నార‌ని అన్నార‌ని, ఎవ‌ర‌ని అడిగితే అప్పుడు రాఘ‌వేంద్ర రావు గారు పేరు చెప్ప‌డంతో తాను ఒక్క‌సారిగా షాక‌య్యాన‌ని చెప్పారు చంద్ర‌బోస్.

అదే ఆయ‌న‌తో మొద‌టి ప‌రిచ‌యం

రాఘ‌వేంద్ర రావు గారు లాంటి మనిషి నా కోసం మ‌నిషిని పంప‌డ‌మేంట‌ని ఆశ్చ‌ర్య‌పోయాన‌ని, ప‌దండి వెళ్దాం అంటే కింద వ‌ర‌కు వెళ్లి ఎస్టీడీ బూత్ లో ఆయ‌న‌తో ఫోన్ మాట్లాడాన‌ని, వెంట‌నే తిరుప‌తికి ర‌మ్మంటే ట్రైన్ లో తిరుప‌తికి వెళ్లి భీమాస్ హోట‌ల్ లో ఆయ‌న్ను క‌లిశాన‌ని, ఆ టైమ్ లో రాఘ‌వేంద్ర రావు గారితో పాటూ కీర‌వాణి గారు కూడా అక్క‌డే ఉన్నార‌ని, కీర‌వాణి గారు అప్పుడు మా పెర‌టి జాంచెట్టు ప‌ళ్ల‌న్నీ సాంగ్ ను కంపోజ్ చేస్తున్నార‌ని చంద్ర‌బోస్ తెలిపారు.

ఆ మాటతో షాక‌య్యా

అలా రాఘ‌వేంద్ర‌రావు గారితో మొద‌లైన త‌న జ‌ర్నీలో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో పలు పాట‌లు వ‌చ్చాక ఒకసారి ఆయ‌న ఫోన్ చేసి ర‌మ్మంటే వెళ్లాన‌ని, వెళ్ల‌గానే త‌న‌కు ఒక క్యాసెట్ ఇచ్చి వినమ‌ని చెప్పార‌ని, విని చాలా అద్భుతంగా ఉన్నాయ‌ని చెప్పాన‌ని, అప్పుడాయ‌న రామ‌దాసు సినిమా చేస్తున్నార‌ని చెప్పారు చంద్ర‌బోస్. సాంగ్స్ అన్నీ విన్నావు కదా, అందులో ప్ర‌తీ పాట‌లో రామ రామ అని ఉంటుంది, ఇప్పుడు నువ్వు కూడా అలానే ఒక పాట రాయాలి అని చెప్ప‌డంతో స‌రే అన్నాన‌ని, అయితే అస‌లైన ట్విస్టు ఇక్క‌డే ఉంద‌ని, నువ్వు రాయాల్సింది శోభ‌నం స‌మ‌యంలో వ‌చ్చే పాట అని చెప్ప‌డంతో షాక‌య్యాన‌ని ఆ త‌ర్వాత షాక్ నుంచి తేరుకుని పాట‌ను రాసిన‌ట్టు చంద్ర‌బోస్ తెలిపారు. తన‌కు చాలా స‌వాలుగా అనిపించిన పాట అదేన‌ని చంద్ర‌బోస్ చెప్పారు.