హీరో- దర్శకుడు కుమ్మక్కై.. నిర్మాత ఆవేదన!
చదలవాడ తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం హీరో- దర్శకుడు ఒకటై నిర్మాతకు విలువ లేకుండా చేసారు
By: Tupaki Desk | 6 March 2024 12:02 PM ISTఅక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ వంటి స్టార్లతో సినిమాలు నిర్మించారు చదలవాడ శ్రీనివాసరావు.. ప్రముఖ నిర్మాతగా తెలుగు చిత్రసీమలో మూడు దశాబ్ధాల కెరీర్ ని కొనసాగించారు. దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం సాగింది. కానీ ఇటీవలి కాలంలో పెద్ద హీరోల జోలికి వెళ్లకుండా అడపాదడపా చిన్న హీరోలతో, కొత్త వారితో సినిమాలు చేసేందుకే ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇంతకుముందు విజయ్ ఆంటోని నటించిన `బిచ్చగాడు` సినిమాని ఆయనే రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.
చదలవాడ తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం హీరో- దర్శకుడు ఒకటై నిర్మాతకు విలువ లేకుండా చేసారు. అందువల్లనే నేను పెద్ద హీరోలతో సినిమాలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు దర్శకుడు- నిర్మాత భార్యభర్తల్లా ఉండేవారని కానీ ఈ 15ఏళ్లలో పూర్తిగా సన్నివేశం మారిపోయిందని కూడా వ్యాఖ్యానించారు. నేను బతికుండగా పెద్ద హీరోలతో సినిమాలు చేయనని వ్యాఖ్యానించారు.
శోభన్ బాబు, నాగేశ్వరరావు, కృష్ణ వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసానని, తాను ఆలస్యంగా వచ్చినా వారు ఏనాడూ ఆలస్యంగా సెట్స్ కి రాలేదని కూడా చదలవాడ అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదని వ్యాఖ్యానించారు. ఎవరినీ పొగడను.. కించపరచను.. ఉన్న సన్నివేశం చెబుతున్నాను అని అన్నారు. సహజనటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ కథానాయకుడిగా చదలవాడ దర్శకత్వం వహించిన తాజా చిత్రం విడుదలకు వస్తోంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. కొత్త కుర్రాళ్లు తన సినిమాకు సరిపోయారని వ్యాఖ్యానించిన ఆయన దర్శకుడిగా ఈ సినిమా సక్సెసైతే తదుపరి వరుసగా మరిన్ని సినిమాలు తీస్తానని తెలిపారు.
