Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: సైలెంట్ గా హ్యాండిల్ చేయాల్సిన కేసుని వైలెంట్ గా సాల్వ్ చేసే ఏజెంట్ 'చారి 111'

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో వెన్నెల కిశోర్ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను అలరిస్తూ, సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు

By:  Tupaki Desk   |   12 Feb 2024 8:28 AM GMT
ట్రైలర్ టాక్: సైలెంట్ గా హ్యాండిల్ చేయాల్సిన కేసుని వైలెంట్ గా సాల్వ్ చేసే ఏజెంట్ చారి 111
X

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో వెన్నెల కిశోర్ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను అలరిస్తూ, సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల కాలంలో క్యారక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్న కిషోర్.. ఇప్పుడు హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. 'చారి 111' అనే సినిమాతో కథానాయకుడిగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. TG కీర్తి కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ స్పై కామెడీలో సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ ను ఆవిష్కరించారు.

'1992లో ఇండియా పాకిస్తాన్ కలిసి ఒక జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయి.. ఇకపై రెండు దేశాలు ఎలాంటి కెమికల్ వెపన్స్ కానీ, బయోలాజికల్ వెపన్స్ కానీ తయారు చెయ్యకూడదని' అంటూ మురళీ శర్మ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ మనల్ని చారి ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇందులో బ్రహ్మచారి అలియాస్ ఏజెంట్ 111 అనే గూఢచారిగా వెన్నెల కిషోర్ కనిపించారు. సైలెంట్ గా హ్యాండిల్ చేయాల్సిన కేసుని వైలెంట్ గా సాల్వ్ చేసే ఏజెంట్ గా అతన్ని పరిచయం చేసారు. అలాంటి వ్యక్తికి మన దేశాన్ని కాపాడే ఓ పెద్ద సీక్రెట్ మిషన్ ను అప్పజెప్తారు.

ఎలాంటి సీరియస్ ఆపరేషన్ అయినా తన సిల్లీ మిస్టేక్స్ తో కామెడీగా మార్చేసే అతనికి ఏజెంట్ చారి, దేశ వ్యతిరేక శక్తులను ఎదుర్కొని కెమికల్ వెపన్స్ కు సంబంధించిన కేసును ఎలా డీల్ చేసాడు? ఒక సైకో సైంటిస్ట్ నుంచి దేశాన్ని ఎలా కాపాడాడు? అనేదే 'చారి 111' సినిమా అని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఇప్పటి వరకూ తన కెరీర్ లో ఎన్నో రకాల కామెడీ పాత్రలు పోషించిన వెన్నెల కిశోర్.. ఇందులో సూటు బూటు వేసుకొని చేతిలో గన్ పట్టుకొని స్టైలిష్ గూఢచారిగా కనిపించారు. ఎప్పటిలాగే తన ట్రేడ్‌ మార్క్ కామెడీ టైమింగ్ తో అలరించారు. 'వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్..' అంటూ కేజీఎఫ్ రేంజ్ లో డైలాగ్స్ చెప్తూ నవ్వించారు.

'మళ్ళీ మొదలైంది' వంటి రొమాంటిక్‌ కామెడీ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన టీజీ కీర్తి కుమార్.. ఇప్పుడు 'చారి 111' లో ఒక సీరియస్ కాన్‌ఫ్లిక్ట్ ని హిలేరియస్ ఎంటెర్టైన్మెంట్ తో ఆసక్తికరంగా డీల్ చేసారని అర్థమవుతోంది. ఇందులో వెన్నెల కిశోర్ తో పాటుగా హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ కూడా గూఢచారిగా నటించింది. ఓవైపు గ్లామర్ గా కనిపిస్తూనే మరోవైపు యాక్షన్ సీన్స్ లో అదరగొట్టింది. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించారు. బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, తాగుబోతు రమేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సైమన్‌ కె.కింగ్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ రామజోగయ్య శాస్త్రి రాసారు. కషిష్‌ గ్రోవర్‌ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. బ‌ర్క‌త్ స్టూడియోస్ ప‌తాకంపై అదితి సోని ఈ సినిమాని నిర్మించారు.

తెలుగులో స్పై యాక్షన్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అందులోనూ క‌మెడియ‌న్ గా అంద‌రికీ సుప‌రిచిత‌మైన వెన్నెల కిశోర్ తొలిసారిగా నటిస్తున్న స్పై యాక్షన్ కామెడీ జోనర్ సినిమా కావడంతో 'చారి 111' పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఫిబ్రవరి 1వ వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమా హీరోగా వెన్నెల కిశోర్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.