Begin typing your search above and press return to search.

ఇంతకీ 'చారి 111' పరిస్థితేంటి?

ఇప్పుడు ''చారి 111'' చిత్రంతో హీరో అవతారమెత్తారు. 'మళ్ళీ మొదలైంది' ఫేమ్ టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ స్పై కామెడీలో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటించింది.

By:  Tupaki Desk   |   2 March 2024 11:12 AM GMT
ఇంతకీ చారి 111 పరిస్థితేంటి?
X

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ఒకరిగా రాణిస్తున్న వెన్నెల కిషోర్.. అప్పట్లో మెగా ఫోన్ చేతబట్టి 'వెన్నెల 1/2 స్క్వేర్', 'జఫ్ఫా' లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ''చారి 111'' చిత్రంతో హీరో అవతారమెత్తారు. 'మళ్ళీ మొదలైంది' ఫేమ్ టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ స్పై కామెడీలో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటించింది. ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న ఈ మూవీ, శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. 'ఆపరేషన్ వాలెంటైన్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' లాంటి చిత్రాలకు పోటీగా రిలీజైన వెన్నెల కిషోర్ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథేంటంటే.. దేశ సంరక్షణ కోసం, సంఘ విద్రోహులు తీవ్రవాదుల ఆట కట్టించడానికి ఎటువంటి రూల్స్ లేకుండా పని చేసేలా రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనికి మాజీ ఆర్మీ ఆఫీసర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) హెడ్ గా ఉంటాడు. హైదరాబాద్ లో జరిగిన ఒక హ్యుమన్ బాంబ్ బ్లాస్ట్ కేసుని ఛేదించే బాధ్యత ఈ ఏజెన్సీ మీద పడుతుంది. దీన్ని బ్రహ్మచారి అలియాస్ ఏజెంట్ చారి 111(వెన్నెల కిషోర్)కు అప్పగిస్తారు. తన చేష్టలతో సీరియస్ కేసును కామెడీ చేసేసే చారి.. మానవ బాంబు దాడి వెనకున్న వారిని పట్టుకున్నాడా లేదా? ఈ మిషన్ లో ఏజెంట్ ఇషా (సంయుక్తా విశ్వనాథన్) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే 'చారి 111' సినిమా చూడాల్సిందే.

'పింక్ పాంథర్', 'జానీ ఇంగ్లీష్' లాంటి హలీవుడ్ స్పై కామెడీల స్ఫూర్తితో 'చారి 111' తెరకెక్కించానని దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ చెప్పడం.. ఎన్నో చిత్రాల్లో తన కామెడీ టైమింగ్ తో ఆడియెన్స్ అలరించిన వెన్నెల కిషోర్ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో.. ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. అయితే సీరియస్ పాయింట్ తీసుకొని, అర్థం పర్థం లేని కామెడీతో విసిగించారని ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నారు. వెన్నెల కిశోర్ నుంచి ఆశించే హాస్యం లేకపోవడం.. ఎంచుకున్న పాయింట్ ను లాజిక్ లేకుండా ప్రెజెంట్ చేయడంపై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.

కమెడియన్ నటించిన స్పై కామెడీ కాబట్టి ఎంత లాజిక్స్ వెతకకూడదని అనుకున్నా.. మెయిన్ పాయింట్ హ్యుమన్ బ్లాస్ట్స్, టెర్రరినానికి సంబంధించినది కావడంతో ఏజెంట్ చారి చేసే విన్యాసాలు ఒకానొక దశలో విసుగు తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు. సెకండాఫ్ లో సీరియస్ సీన్లు ఎక్కువ అయ్యాయని, కొన్ని సన్నివేశాలు మరీ బోరింగ్ గా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఫ్లాప్ సినిమాని కూడా తన కామెడీతో లాక్కొచ్చే వెన్నెల కిశోర్.. ఇందులో కొంత మేరకు మాత్రమే ఆకట్టుకున్నారని సమీక్షలు చెబుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ చాలా డల్ గా వున్నాయి. మరి మన 'చారి 111' ఈ వీకెండ్ ను క్యాష్ చేసుకొని బాక్సాఫీసు వద్ద నిలబడతాడేమో చూడాలి.