Begin typing your search above and press return to search.

ఆర్జీవీ 'వ్యూహం'కి సెన్సార్ నిరాక‌ర‌ణ‌

రామ్ గోపాల్ వర్మ చిత్రం 'వ్యూహం'కి సెన్సార్ బృందం స‌ర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. దీంతో రిలీజ్ కి బ్రేక్ ప‌డింది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 3:00 PM GMT
ఆర్జీవీ వ్యూహంకి సెన్సార్ నిరాక‌ర‌ణ‌
X

రామ్ గోపాల్ వర్మ చిత్రం 'వ్యూహం'కి సెన్సార్ బృందం స‌ర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. దీంతో రిలీజ్ కి బ్రేక్ ప‌డింది. ఇంత‌కుముందు వ్యూహం టీజర్‌- ట్రైల‌ర్ల‌ను విడుదల చేయ‌గా ఇందులో రాజ‌కీయ నాయ‌కుల పాత్ర‌లు చ‌ర్చ‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2024 సాధారణ ఎన్నికలకు ముందు థియేటర్లలో విడుదల చేయాలని ఆర్జీవీ బృందం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆర్జీవీ గ‌త చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'లోని నటీనటులు ఒరిజిన‌ల్‌ పాత్రలతో సారూప్యత కారణంగా చ‌ర్చ‌నీయాంశం కాగా అప్ప‌ట్లో టైటిల్ ని కూడా మార్చాల్సి వ‌చ్చింది. ఇప్పుడు 'వ్యూహం' కూడా రాజ‌కీయ నాయ‌కుల వాస్త‌విక‌ పాత్ర‌ల‌తో తెర‌కెక్కిందని సెన్సార్ భావించిన‌ట్టు తెలిసింది. నాయ‌కుల పేర్ల‌ను య‌థాత‌థంగా పెట్ట‌డంపైనా సెన్సార్ ప్ర‌తినిధులు అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. ఇందులో వాస్త‌విక జీవితంలోని నాయ‌కుల పాత్ర‌ల‌ను య‌థాత‌థంగా తెర‌పై చూపించ‌డంపైనా సెన్సార్ అభ్యంత‌రం చెప్పింది.

ఇంత‌కుముందు వ్యూహం టీజ‌ర్ ట్రైలర్ విడుద‌ల స‌మ‌యంలోను రాజ‌కీయ నాయ‌కుల పాత్ర‌ల్ని య‌థాత‌థంగా చూపించార‌న్న చ‌ర్చా సాగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాద ఘటనతో టీజర్ అప్పటి టెన్షన్ వాతావరణాన్ని ఆవిష్క‌రించింది. . వైఎస్ఆర్ మరణవార్త విని చంద్రబాబు ఆనందంగా ఉన్నట్లు చిత్రీకరించారు. జగన్, వైఎస్ భారతి, విజయమ్మ, రోశయ్య వంటి పాత్రలు కూడా ఉన్నాయి. సినిమాని వీక్షించిన సెన్సార్ బృందం ఇప్పుడు స‌ర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. దీంతో ఆర్జీవీ బృందం రివైజింగ్ క‌మిటీని ఆశ్ర‌యించిన‌ట్టు స‌మాచారం.

వైసీపీతో నాకు ఏ సంబంధం లేదన్న జీవిత‌

'వ్యూహం'కి సెన్సార్ నిరాక‌ర‌ణ అంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్న ఇదే స‌మ‌యంలో సెన్సార్ స‌భ్యురాలు జీవిత వ్యాఖ్య చ‌ర్చ‌గా మారింది. ''వ్యూహం అనే సినిమా ఆర్.సి వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఆ సినిమాను కూడా చూస్తాను. నాకు ఇంకా ఆఫీస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు.

నా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు'' అని జీవిత రాజశేఖర్ అన్నారు. నాకు వైఎస్ఆర్సిపి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, ఇప్పుడు భాజ‌పాలో ఉన్నాన‌ని జీవిత వ్యాఖ్యానించారు. మీడియా గ్రూప్ లో సర్కులేట్ చేస్తున్న ఫోటోలు చాలా సంవత్సరాల క్రితానివి అని కూడా తెలుస్తోంది.