వేదికలపై కన్నీళ్లు: సరికొత్త ఎమోషనల్ ప్రచార మంత్రం!
సినిమా ప్రచారం అంటే ఒకప్పుడు కేవలం పోస్టర్లు, ట్రైలర్లు, ఆడియో ఫంక్షన్లు మాత్రమే. కానీ ఇప్పుడు కాలం మారింది.
By: Sivaji Kontham | 30 April 2026 9:35 AM ISTసినిమా ప్రచారం అంటే ఒకప్పుడు కేవలం పోస్టర్లు, ట్రైలర్లు, ఆడియో ఫంక్షన్లు మాత్రమే. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించడానికి చిత్ర యూనిట్ రకరకాల వ్యూహాలను అనుసరిస్తోంది. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో వేదికలపై సెలబ్రిటీలు కన్నీటి పర్యంతం అవ్వడం ఒక కొత్త ట్రెండ్‌గా కనిపిస్తోంది. ప్రముఖ కథానాయికలు జెనీలియా, పాయల్ రాజ్‌పుత్, భూమికా చావ్లా వంటి తారలు బహిరంగంగా భావోద్వేగానికి గురవ్వడం చూస్తుంటే.. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక సినిమా ప్రచారంలో ఇదో కొత్త `ఎమోషనల్ మంత్రం`లా మారిందా? అనే చర్చలు మొదలయ్యాయి. మనిషి భావోద్వేగం ఎప్పుడు ఎలా విస్ఫోటనం చెందుతుందో ఊహించడం కష్టం.. కానీ అది పబ్లిక్ వేదికపై జరిగినప్పుడు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
నిజానికి ఇలాంటి సంఘటనలను కొందరు `పబ్లిసిటీ స్టంట్` అని కొట్టిపారేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆయా వ్యక్తుల వ్యక్తిగత సంఘర్షణలను బట్టి అది సహజమని సమర్థిస్తుంటారు. ఈ విశ్లేషణలో భాగంగా మొన్నటి మొన్న `రాజా శివాజీ` వేదికపై జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ జంట కన్నీళ్లను చూస్తే అందులో ఉన్న లోతు ఎంతో అర్థమవుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి మహాయోధుడి కథను తమ డ్రీమ్ ప్రాజెక్టుగా భావించి.. అహర్నిశలు శ్రమించి నిర్మించిన ఆ సినిమా విడుదల ముంగిట ఆ జంట తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ కల నెరవేరుతున్న క్షణాన కలిగే ఆనందం.. భయం మిళితమైన భావోద్వేగం అది కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు.. సీనియర్ నటి భూమికా చావ్లా `యూఫోరియా`సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన భూమిక.. నిర్మాతగా మారి తన భర్తతో కలిసి చేసిన `తకిట తకిట` వంటి ప్రయోగాలు విఫలం కావడంతో కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మళ్ళీ తన ఉనికిని చాటుకోవాలనే తపన.. కంబ్యాక్ కోసం పడుతున్న శ్రమ వెనుక ఉన్న ఆవేదన ఆ వేదికపై కన్నీటి రూపంలో బయటపడి ఉండవచ్చు. ఒక నటిగా లేదా వ్యక్తిగత జీవిత ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలు ఇలాంటి బహిరంగ వేదికలపై అప్పుడప్పుడు తొంగిచూస్తుంటాయి.
ఇక పాయల్ రాజ్‌పుత్ విషయానికి వస్తే.. తన బాయ్ ఫ్రెండ్ సినిమా వేదికపై తన దివంగత తండ్రిని తలచుకుని కన్నీరు మున్నీరు కావడం అందరినీ కదిలించింది. `ఆర్ఎక్స్ 100` వంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చేసినప్పుడు కూడా తన తండ్రి ఏనాడూ తక్కువ చేసి చూడలేదని... నటిగా తనను ప్రోత్సహించారని ఆమె చెప్పిన మాటల్లో ఒక రకమైన నిజాయితీ కనిపించింది. తన ఎదుగుదలకు తోడ్పడిన వ్యక్తి లేని లోటును ఆ వేదికపై ఆమె వ్యక్తం చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆత్మీయులతో ఉండే బలమైన ఎమోషనల్ బాండింగ్ ఇలాంటి సందర్భాలకు కారణమవుతుంటుంది.
కారణం ఏదైనా.. వెండితెరపై నవ్వించే లేదా ఏడిపించే తారలు నిజ జీవితంలో ఇలా లైవ్ వేదికలపై కన్నీళ్లు పెట్టుకోవడం అనేది ప్రేక్షకులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అభిమానుల హృదయాలను కలచివేసే ఈ ఎమోషనల్ కనెక్ట్ అప్రమేయంగానే ఆయా సినిమాల ప్రచారానికి భారీగా కలిసి వస్తోంది. కంటెంట్ పక్కన పెడితే.. సినిమా చుట్టూ ఒక రకమైన సానుభూతిని, ఆసక్తిని పెంచడానికి ఈ `కన్నీటి మంత్రం` ప్రస్తుతం ఒక బలమైన అస్త్రంగా మారుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కొన్నిసార్లు వికటించే ప్రమాదం లేకపోలేదు:
సినిమా ప్రచారాల్లో భావోద్వేగాల ప్రదర్శన అనేది ప్రస్తుతం ఒక రెండంచుల కత్తిలా మారింది. ఒకవైపు నటీనటులు తమ కష్టార్జితమైన సినిమా విడుదలవుతున్న వేళ లేదా తమ వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను తలచుకున్నప్పుడు సహజంగానే కన్నీటి పర్యంతం అవుతుంటారు. ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛ -మానసిక స్థితికి సంబంధించిన అంశం. అయితే పబ్లిక్ వేదికలపై ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అవి వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి.. సదరు సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇది నిజమైన ఆవేదన నుండి పుట్టిందా లేక కేవలం సానుభూతిని పొందేందుకు పన్నిన ఒక వ్యూహమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఏది ఏమైనా ప్రేక్షకులు ఇప్పుడు చాలా పరిణతి చెందారు. కేవలం వేదికలపై ఏడ్చినంత మాత్రాన సినిమాను ఆదరించకుండా.. కంటెంట్ ఉంటేనే విజయాన్ని అందిస్తున్నారు. అతిగా భావోద్వేగాలను ప్రదర్శించడం వల్ల కొన్నిసార్లు ప్రచారానికి మేలు జరిగినా అది ప్రతిసారి పనిచేస్తుందని చెప్పలేము. నిజాయితీతో కూడిన భావోద్వేగం ప్రేక్షకుడిని కదిలించగలదు.. కానీ అది కేవలం సినిమాను అమ్ముకోవడానికి చేసే కృత్రిమ ప్రయత్నంలా అనిపిస్తే మాత్రం అది నటీనటుల ప్రతిష్టకే భంగం కలిగించే అవకాశం ఉంది.
