Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ పిక్స్.. పవన్ తో బాలయ్య, నాగబాబు భేటీ

ఏపీ అసెంబ్లీలో సెలబ్రెటీ నేతల కలయిక ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది.

By:  Tupaki Political Desk   |   12 Feb 2026 3:25 PM IST
అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ పిక్స్.. పవన్ తో బాలయ్య, నాగబాబు భేటీ
X

ఏపీ అసెంబ్లీలో సెలబ్రెటీ నేతల కలయిక ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎమ్మెల్సీ నాగబాబు గురువారం భేటీ అయ్యారు. వీరు కలిసిన విషయాన్ని తెలియజేస్తూ డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రత్యేకంగా ఎక్స్ లో ట్వీట్ చేసింది. బాలయ్య, నాగబాబు వేర్వేరుగా కలిసినా ఒకే రోజు ఇద్దరూ భేటీ అవ్వడం చర్చకు దారితీసింది. ముగ్గురు సినీ సెలబ్రెటీలు కావడం, కొన్ని రాజకీయ, సినీ విషయాల్లో పరస్పర భిన్నమైన వైఖరులు ఉండటంతో వీరి కలయికకు ప్రాధాన్యం ఏర్పడిందని అంటున్నారు. ప్రధానంగా పవన్, బాలయ్యకు మధ్య ఎలాంటి విభేదాలు, భేదాభిప్రాయాలు లేకపోయినా, గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల పవన్ ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ తో బాలయ్య భేటీకి ప్రాధాన్యం ఏర్పడిందని అంటున్నారు.





అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలవడం సర్వసాధారణ విషయం. కానీ, సెలబ్రెటీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయిన బాలయ్య, నాగబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ తో భేటీ కావడాన్ని విశేషంగా చూస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బాలయ్య తన నియోజకవర్గ సమస్యలు చర్చించేందుకు పవన్ తో సమావేశమయ్యారని అంటున్నారు. పవన్ ప్రస్తుతం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన చూస్తున్న శాఖల పరిధిలో సమస్యలపై చర్చించేందుకు బాలయ్య ఉప ముఖ్యమంత్రి ఫేషీకి వెళ్లారని చెబుతున్నారు. అదేవిధంగా నాగబాబు సైతం పార్టీ విషయాలను చర్చించేందుకు పవన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారని అంటున్నారు.





గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ హయాంలో సినిమా టికెట్ల పెంపు విషయమై చర్చ జరిగిన సమయంలో కల్పించుకున్న హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య.. పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవిపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయి. అప్పట్లో ఈ విషయమై ఎమ్మెల్సీ నాగబాబు సైతం ఘాటుగా స్పందించారు. ఇక ఆ ఎపిసోడ్ తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా ఇబ్బంది పడాల్సివచ్చిందని విశ్లేషణలు వినిపించాయి. అయితే ఇరు పార్టీల నేతలు ఈ వివాదం పెద్దది కాకుండా సంయమనంతో వ్యవహరించి చక్కబెట్టారని చెబుతున్నారు. దీంతో అప్పట్లో బాలయ్య వ్యాఖ్యలు టీ కప్పులో తుఫాన్ లా చల్లారిపోయాయి.

ఇక ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఇరుపార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు గత అసెంబ్లీ సెషన్స్ తర్వాత బాలయ్య, పవన్ ఎక్కడా కలుసుకోలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజునే ఆయన పవన్ కార్యాలయానికి రావడం, చాలాసేపు మాట్లాడటం ఇంట్రెస్టింగ్ గా మారింది. అసెంబ్లీ లోపల, బయట ఈ కలయికపై హాట్ డిబేట్ కొనసాగింది. అదేవిధంగా పవన్, నాగబాబు భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు. ఇటీవల పార్టీ సమావేశంలో నాగబాబు పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

పదవుల్లో ఉన్న వారు ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పకొట్టడంలో విఫలమవుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ప్రధానంగా సోదరుడు నాగబాబు వైఖరిని ఆయన తప్పుపట్టారని, తిరుమల లడ్డూ విషయంలో నాగబాబు గట్టిగా మాట్లాడాలని హితవుపలికారని చెబుతున్నారు. ఈ వార్తలు వచ్చిన తర్వాత నాగబాబు సోషల్ మీడియా వేదికగా రెండు వీడియోలు విడుదల చేసి ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో గురువారం అసెంబ్లీ ఆవరణలో నాగబాబు ఉప ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడటం జనసేన వర్గాలను ఆకర్షించిందని అంటున్నారు. మొత్తానికి ముగ్గురు సెలబ్రెటీలు అసెంబ్లీలో కలుసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.