Begin typing your search above and press return to search.

అంద‌రి మేలు కోసం CBFC ఛీఫ్‌ త‌ప్పుకోవాలి

మాజీ సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ ప్రస్తుత చీఫ్ ప్రసూన్ జోషిని రాజీనామా చేయాలని ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేసారు.

By:  Tupaki Desk   |   30 Sep 2023 12:48 PM GMT
అంద‌రి మేలు కోసం CBFC ఛీఫ్‌ త‌ప్పుకోవాలి
X

ద‌క్షిణాది హీరో కం నిర్మాత విశాల్ ముంబై సీబీఎఫ్‌సి అవినీతి భోగోతంపై పోరాటం ప్రారంభించిన‌ సంగ‌తి తెలిసిందే. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేసిన విశాల్ 'మార్క్ ఆంటోని' హిందీ వెర్ష‌న్ సెన్సార్ క్లియ‌రెన్స్ రావ‌డానికి 6.5 ల‌క్ష‌లు ముంబై సీబీఎఫ్‌సి కి చెల్లించాల్సి వ‌చ్చింద‌ని ఆరోపించాడు. ఈ వార్త ప్ర‌ముఖంగా హెడ్ లైన్స్ లో నిలిచింది. త‌న సినిమా విడుదలకు ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) గురించి విశాల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే చాలా మంది నుంచి విశాల్ కి మ‌ద్ధ‌తు ల‌భించింది. అనుకూలంగా ప‌లువురు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను మొర‌పెట్టుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది.

విశాల్ ని స‌మ‌ర్థిస్తూ ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు సీబీఎఫ్‌సి అవినీతి వ్య‌వ‌హారంపై త‌మ‌ అనుభ‌వాల‌ను బ‌య‌ట‌పెట్టారు. మాజీ సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ ప్రస్తుత చీఫ్ ప్రసూన్ జోషిని రాజీనామా చేయాలని ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేసారు. ఆయ‌న ఆజ్ తక్‌తో మాట్లాడుతూ.. ''పరిశ్రమ సంక్షేమం కోసం ప్రసూన్ జోషి రాజీనామా చేయాలని నేను అభిప్రాయపడ్డాను. అతడు ఇంత జ‌రిగాక అధ్య‌క్ష ప‌ద‌విలో ఉండ‌కూడ‌ద‌ని, కుర్చీని విడిచిపెట్టాల‌ని వ్యాఖ్యానించారు. బాధ్య‌త‌ల్లో భాగంగా సినిమాలు చూడ‌టానికి సమయం ఇవ్వలేకపోతే, ఆ కుర్చీలో కూర్చునే హక్కు అతనికి లేదు. జోషి చైర్మన్ కార్యాలయంలో కూడా కూర్చోకూడ‌దు. సీవోకి అన్ని అధికారాలను ఇవ్వ‌డం స‌రికాదు అని ఆరోపించారు.

సెన్సార్ క్లియరెన్స్ పనిని ఛైర్మన్ చేస్తారు.. కానీ అక్కడ CO చేస్తున్నారు. CO పని కేవలం పరిపాలనను చూసుకోవడం. సెన్సార్ బోర్డ్ ఆఫీసులో జరుగుతున్న‌ది చాలా సిగ్గుచేటు.. అని తీవ్రంగా దుయ్యబ‌ట్టారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) తాజా ప‌రిణామాల‌పై స్పందిస్తూ ఒక‌ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. లంచంలో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని నోట్‌లో పేర్కొంది. ఈరోజు (30సెప్టెంబ‌ర్) దీనిపై విచారణ జరుగుతోంది. నటుడు, నిర్మాత విశాల్ CBFCలో అవినీతిపై ప్ర‌స్థావించ‌డం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదు. ఎవరి ప్రమేయం అయినా ఉన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఆ వెంట‌నే సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ నుండి ఒక సీనియర్ అధికారి ముంబైకి ఈరోజే విచారణ కోసం పంపామ‌ని తెలిపారు. దీనితో పాటు Jsfilms.inb@nic.in @producers_guild @motionpictures (sic)లో CBFC ద్వారా వేధింపులకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని అందించడం ద్వారా మంత్రిత్వ శాఖకు సహకరించాలని అభ్యర్థిస్తున్నాము అని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన‌డం విశేషం.

మార్క్ ఆంటోని ఒరిజినల్ తమిళ వెర్షన్ సెప్టెంబర్ 15న విడుదల కాగా, హిందీ వెర్షన్ సెప్టెంబర్ 28న విడుద‌లైంది. రిలీజ్ త‌ర్వాత విశాల్ త‌న ప‌నిని మొద‌లు పెట్టాడు. సీబీఎఫ్‌సి అవినీతి భోగోతంపై యుద్ధం మొద‌లు పెట్టాడు. ఇంత‌లోనే సీబీఎఫ్‌సి మాజీ ఛీఫ్ నుంచి, అలాగే న‌టుడు నిర్మాత కేకే మీన‌న్ నుంచి విశాల్ కి మ‌ద్ధ‌తు ల‌భించింది. వారంతా ప్ర‌స్తుత సీబీఎఫ్‌సి అవినీతి గురించి పోరు మొద‌లుపెట్టారు.