వాస్తవాలను చూపిస్తే వాయిదా వేయాలా?
కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనూహ్యంగా విడుదలను నిలిపివేసింది. కారణం.. కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతింటాయనే భావన.
By: Tupaki Desk | 11 April 2025 4:09 PM ISTఏప్రిల్ 11న మహానేత జ్యోతిరావు ఫూలే జన్మదినోత్సవం. 19వ శతాబ్దంలో కులవ్యవస్థను ఎదిరించి మహిళలకు విద్యా హక్కు కల్పించిన తొలి సమాజ సేవకుడిగా గుర్తింపు పొందిన ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఫూలే అనే సినిమా అదే రోజున విడుదల కావాల్సి ఉంది. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనూహ్యంగా విడుదలను నిలిపివేసింది. కారణం.. కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతింటాయనే భావన.
ప్రముఖ నటుడు ప్రతీక్ గాంధీ, పత్రలేఖా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవితాలను చూపించారు. ఈ ట్రైలర్ విడుదలైన వెంటనే బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు ఆనంద్ దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చిత్రం కులవాదాన్ని ప్రోత్సహించేదిగా ఉందని విమర్శించారు. దీంతో CBFC ముందుగా ఇచ్చిన ‘U’ సర్టిఫికెట్‌ను తిరిగి పరిశీలించి, కొన్ని సంశోధనలు చేయాలన్న డిమాండ్ చేసింది.
ఫిల్మ్ బోర్డ్ సూచించిన మార్పుల్లో కొని పదాలను తొలగించడం, కులవ్యవస్థపై వాయిస్ ఓవర్‌ను తీయివేయడం ఉన్నాయి. అంతేకాదు, కొన్ని డైలాగ్స్‌ను కూడా మార్పు చేయాల్సిందిగా సూచించారు. 19వ శతాబ్దంలో ఓ వర్గం ఆధిపత్యం ఎంత తీవ్రంగా అమలవుతుందో చూపించే అంశాలు కావడంతో మళ్ళీ వివాదం చెలరేగుతుందనే భయం చేత కట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం కులవాదాన్ని ప్రోత్సహించడమే కాదు, దాన్ని విమర్శిస్తూ, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో తీసారు. ఫూలే దంపతులు అణగారిన వర్గాల విద్యా హక్కు కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులు. వారి జీవితంలో ఎదురైన కష్టాలను, సంఘర్షణలను చూపించడమే తప్ప ఎటువంటి ద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు. కాని ఇలాంటి సినిమా నిరాకరణకు గురవడం వివాదాస్పదమైందిగా మారింది.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇటీవలి జాట్ వంటి సినిమాల్లో సామూహిక హత్యలు, పోలీస్ కానిస్టేబుల్పై లైంగిక దాడి వంటి ఘర్షణాత్మక సన్నివేశాలు ఉన్నా కూడా CBFC U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే ఛావా సినిమాలో ముస్లిం వర్గానికి సంబంధించి సున్నిత అంశాలు ఉన్నప్పటికీ పెద్దగా మార్పులు కోరలేదు. మరి అదే సమయంలో సామాజిక సంస్కరణలపై ఆధారంగా వచ్చిన సినిమా విషయంలో మాత్రం ఈ స్థాయిలో కఠినంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అనేలా పలువురు ప్రశ్నిస్తున్నారు.
చరిత్రను మార్చలేం. కానీ ఇప్పటి తరం గతం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫూలే సినిమా మానవత్వం కోసం పోరాడిన గొప్ప నాయకుల కథ. అలాంటి కథను వ్యతిరేకించడం కరెక్ట్ కాదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు నిజాలను చూపించే సినిమాలకు ఎదురుగా అడ్డంకులు వేయడం కన్నా, వాటిపై చర్చ మొదలై సమాజ మార్పుకు దారి తీయడమే ఉత్తమ మార్గం. ఇక వాస్తవాలను చూపిస్తే వాయిదా వేయాలా అనే అభిప్రాయం ఎక్కువవుతోంది. మరి సినిమా కంటెంట్ రిలీజ్ అనంతరం ఎలాంటి చర్చకు దారితీస్తుందో చూడాలి.
