Begin typing your search above and press return to search.

కొత్త కేట‌గిరి.. కాస్టింగ్ డైరెక్ట‌ర్ల‌కు ఆస్కార్?

కానీ ఇప్పుడు ఆస్కార్ క‌మిటీ పాత రూల్ ని బ్రేక్ చేసింది. ఒక కొత్త పుర‌స్కారాన్ని ప్ర‌వేశ పెట్టింది

By:  Tupaki Desk   |   9 Feb 2024 1:35 PM GMT
కొత్త కేట‌గిరి.. కాస్టింగ్ డైరెక్ట‌ర్ల‌కు ఆస్కార్?
X

ఆస్కార్ అవార్డ్ అందుకోవ‌డం అన్న‌ది ఒక క‌ల‌లాంటిది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిత్రప‌రిశ్ర‌మ‌ల్లో ఎంద‌రో గొప్ప ప్ర‌తిభావంతులు ఉన్నా దీనిని అందుకునేంత దూరం ప్ర‌యాణించ‌డం అంత సులువు కాద‌న్న‌ది తెలిసిన వాస్త‌వం. న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు స‌హా చాలా విభాగాల‌కు ఆస్కార్ పుర‌స్కారాల‌ను ఇస్తున్నా కానీ, ఇన్నాళ్లు కాస్టింగ్ డైరెక్ట‌ర్ల‌కు గుర్తింపు లేదు. వారి కోసం ఒక ప్ర‌త్యేక‌ కేట‌గిరీని కేటాయించ‌లేదు.

కానీ ఇప్పుడు ఆస్కార్ క‌మిటీ పాత రూల్ ని బ్రేక్ చేసింది. ఒక కొత్త పుర‌స్కారాన్ని ప్ర‌వేశ పెట్టింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ .. కాస్టింగ్‌లో అత్యుత్తమ ప్ర‌తిభావంతుల‌కు పుర‌స్కారంలో ఒక కేటగిరీని పరిచయం చేయడం ఆశ్చర్యపరిచింది. ఈ కేట‌గిరీ 2025లో విడుదలైన చిత్రాలకు 98వ వార్షిక వేడుకలో పుర‌స్కారం అందిస్తారు. నిజానికి 2001లో ఉత్తమ యానిమేషన్ చలనచిత్రం విభాగంలో అవార్డును ప్రవేశపెట్టిన తర్వాత అకాడమీ కొత్త కేటగిరీని సృష్టించ‌డం ఇదే. జూలై 2013లో కాస్టింగ్ డైరెక్టర్స్ బ్రాంచ్ ఏర్పడి దాదాపు 160 మంది సభ్యులను కలిగి ఉంది. ఆస్కార్స్ లో చొర‌వ‌తో కాస్టింగ్ లో ప్ర‌తిభావంతుల‌కు గుర్తింపు ద‌క్కేలా మార్గం సుగమం చేసింది.

నిజానికి ఫిలింమేకింగ్ లో కాస్టింగ్ డైరెక్టర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అకాడమీ అభివృద్ధి చెందుతున్నందున్న ఈ కొత్త విభాగాన్ని జోడించాల‌ని నిర్ణ‌యించామ‌ని అకాడమీ CEO బిల్ క్రామెర్.. అకాడమీ ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ అన్నారు. ఇది మ‌రో మైలురాయి.. ఈ ప్రక్రియలో వారి నిబద్ధతకు ధ‌న్య‌వాదాలు. మా కాస్టింగ్ డైరెక్టర్స్ బ్రాంచ్ సభ్యులను అభినందిస్తున్నాము..అని అన్నారు. ఒక ప్రకటనలో రిచర్డ్ హిక్స్, కిమ్ టేలర్-కాల్మన్, డెబ్రా జేన్, అకాడమీ కాస్టింగ్ డైరెక్టర్ బ్రాంచ్ గవర్నర్‌లు తమ కృతజ్ఞతలు తెలియజేసారు. కాస్టింగ్ డైరెక్టర్స్ బ్రాంచ్ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. .. అని అన్నారు.

98వ అకాడమీ అవార్డ్‌ల నియమావ‌ళి సమగ్ర వివ‌రాలతో పాటుగా, ప్రారంభ అవార్డు కోసం అర్హత ప్రమాణాలు, ఓటింగ్ విధానాలను వివరించే మార్గదర్శకాలు ఏప్రిల్ 2025లో బహిర్గతమ‌వుతాయి. అవార్డును అందించడానికి సంబంధించిన క్లిష్టమైన వివరాలను అకాడమీ గవర్నర్ల బోర్డు దాని పరిపాలనా నాయకత్వం తర్వాత తేదీలో నిర్ణయిస్తాయి.