కేన్స్ 2025లో టాలీవుడ్ మెరుపులు ఏవీ?
ప్రతిష్ఠాత్మక కేన్స్ 2025 ఉత్సవాల్లో ఐశ్వర్యారాయ్, ఆలియా భట్, జాన్వీ కపూర్ లాంటి ప్రముఖుల క్యాట్ వాక్ ప్రదర్శనలు ఉంటాయన్న ప్రచారం మినహా ఇంకేదీ భారత్ తరపు నుంచి కనిపించడం లేదు.
By: Tupaki Desk | 14 May 2025 9:50 AM ISTప్రతిష్ఠాత్మక కేన్స్ 2025 ఉత్సవాల్లో ఐశ్వర్యారాయ్, ఆలియా భట్, జాన్వీ కపూర్ లాంటి ప్రముఖుల క్యాట్ వాక్ ప్రదర్శనలు ఉంటాయన్న ప్రచారం మినహా ఇంకేదీ భారత్ తరపు నుంచి కనిపించడం లేదు. కేన్స్ ఉత్సవాల్లో జాన్వీ - ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రల్లో ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన `హోమ్ బౌండ్` ప్రీమియర్ కి వెళుతోంది. అలాగే అనుపమ్ ఖేర్- తన్వి ది గ్రేట్ చిత్రం కూడా కేన్స్ లోప్రదర్శితం కానుంది. ఇతర పరిశ్రమల నుంచి కేన్స్ ఉత్సవాలకు వెళుతున్న సినిమాలేవీ కనిపించడం లేదు. ఈసారి టాలీవుడ్ నుంచి కేన్స్ లో ప్రదర్శనకు వెళుతున్న సినిమా లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
ఓవైపు టాలీవుడ్ గ్లోబల్ మార్కెట్ పై కన్నేసింది. కానీ ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్లు ఉండే, కీలక వేదికలపై సినిమాల ప్రదర్శన లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు చిత్రసీమ నుంచి పలు అవార్డ్ విన్నింగ్ సినిమాల రూపకల్పన జరుగుతోంది. కానీ వాటిని అంతర్జాతీయ వేదికలపై ప్రమోట్ చేసేందుకు ప్రయత్నించడం లేదని కూడా అర్థమవుతోంది. కన్నప్ప లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాని ఇలాంటి వేదికపై ఎందుకు ప్రచారం చేయడం లేదో అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తోందని కూడా కొందరు నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.
కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు కోలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్ నుంచి కేన్స్ 2025కి వెళుతున్న సినిమాలు ఉన్నాయా లేదా? అన్నదానిపై వెబ్ లో సరైన సమాచారం లేదు. పరిశ్రమలో అగ్ర హీరోల సినిమాలు వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకున్నంతగా ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికల గురించి మాట్లాడుకోవడం విస్తుగొలిపేదే. అనుపమ్ ఖేర్ తన్వి ది గ్రేట్, ధర్మ ప్రొడక్షన్స్ హోమ్ బౌండ్ చిత్రాలతో పాటు మరో రెండు సినిమాలు మాత్రమే భారతదేశం నుంచి కేన్స్ ప్రదర్శనకు వెళ్లడం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది.
