Begin typing your search above and press return to search.

యువ తేజం.. శూన్యం నుంచి సంగీత ధ్వ‌నులు వింటున్నాడా?

సంద‌ర్భానికి అనుగుణంగా సంగీతం ఇవ్వ‌డం ఒక శైలి. లేదా సంద‌ర్భాన్ని కూడా త‌న సంగీతానికి అనుకూలంగా మ‌లుచుకోవ‌డం మ‌రో ర‌కం శైలి.

By:  Sivaji Kontham   |   30 April 2026 9:34 AM IST
యువ తేజం.. శూన్యం నుంచి సంగీత ధ్వ‌నులు వింటున్నాడా?
X

సంద‌ర్భానికి అనుగుణంగా సంగీతం ఇవ్వ‌డం ఒక శైలి. లేదా సంద‌ర్భాన్ని కూడా త‌న సంగీతానికి అనుకూలంగా మ‌లుచుకోవ‌డం మ‌రో ర‌కం శైలి. ఈ రెండో శైలి కార‌ణంగానే ఏ.ఆర్ రెహ‌మాన్ నుంచి ఎవ‌రూ ఊహించ‌ని కొత్త ర‌కం బాణీలు సాధ్య‌మ‌య్యాయి. ఇళ‌య‌రాజా త‌ర్వాత ఎంద‌రో సంగీత దిగ్గ‌జాలు వ‌చ్చినా రెహ‌మాన్ వేవ్ ముందు ఎవ‌రూ నిల‌బ‌డ‌లేదు. ఈ ద‌శాబ్ధ‌ కాలంలో ఇళ‌య‌రాజా వార‌సుడు యువ‌న్ శంక‌ర్ రాజా, రెహ్మాన్ కాంపౌండ్ సంగీత ద‌ర్శ‌కుడు హ్యారిష్ జైరాజ్.. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ లాంటి యంగ్ ట్యాలెంట్ మాత్ర‌మే పోటీబ‌రిలో నిలదొక్కుకోగ‌లిగారు. శూన్యం నుంచి సంగీత ధ్వ‌నులు విన‌డం వాటిని ట్యూన్ గా మార్చ‌డం అనే రెహ‌మాన్ సృజ‌నాత్మ‌క‌త‌ను సాయి అభ్యంక‌ర్ అల‌వ‌రుచుకోవాల్సి ఉంటుందేమో!

లేదంటే అత‌డు కూడా మ‌రో అనిరుధ్ లేదా యువ‌న్ శంక‌ర్ రాజా అయితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే. ఇక‌పై కావాల్సిన‌ది న్యూ వేవ్ రాక్ సాలిడ్ మ్యూజిక్ .. బీజీఎంలు.. థీమ్ మ్యూజిక్ ఇస్తే రోమాలు నిక్క‌బొడుచుకోవాలి. ఒక క్రిస్టోఫ‌ర్ నోలాన్ డ‌న్ కిర్క్, ఇంట‌ర్ స్టెల్లార్ లాగా లేదా ఇన్ సెప్ష‌న్ లాగా అద్భుత‌మైన బీజీఎంతో వండ‌ర్స్ క్రియేట్ చేయాలి. మ్యూజిక్ క్వాలిటీ.. సినిమా రేంజ్ అన్నీ ఇటీవ‌లి కాలంలో మారిపోయాయి. ఇంకా పాత చింత‌కాయ మ్యూజిక్కులు వ‌ర్క‌వుట‌య్యే రోజులు కావు ఇవి. ఒక‌వేళ అనిరుధ్ లాగా.. యువ‌న్ లాగా సాయి అభ్యంక‌ర్ మ్యూజిక్ ఇవ్వ‌ద‌లిస్తే అది వినేందుకు ఎవ‌రూ ఉండ‌రు. మ‌ళ్లీ అవే రొటీన్ థ‌మ‌న్ బీట్ లు ఎవ‌రూ ఊహించుకోలేరు! అందుకే ఇది మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌కు సంధికాలం.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ - ఆంథ్రోపిక్ క్లాడ్ లు సినీప‌రిశ్ర‌మ‌ను భ‌య‌పెడుతున్నాయి. ఆల్రెడీ వెబ్ లో ఉన్న చాలా స్వ‌రాల‌ను ఉప‌యోగించుకుని ఆన్ లైన్ టూల్స్ స్వ‌యంగా మ‌రో కొత్త స్వ‌రాన్ని సృజించ‌గ‌ల‌వు. అలాంట‌ప్పుడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌తో ప‌నేంటి? అనే భ‌యాందోళ‌న‌లు ఉన్నాయి. మ్యూజిక్ ప్రామ్ప్ట్ ఇంజినీర్లు స‌రిపోతారు. అందుకే సాయి అభ్యంక‌ర్ లాంటి యువ‌తేజం ఇంకా చాలా పాఠాల‌ను నేర్చుకుని సాంకేతిక‌త‌కు కూడా అంద‌ని స్థాయిలో క్రియేటివిటీని త‌న బాణీల్లో చూపించాల్సి ఉంటుంది.

ఇటీవ‌లి కాలంలో సూర్య‌- క‌రుప్పు, అల్లు అర్జున్ -రాకా చిత్రాల‌కు ప‌నిచేస్తుండ‌టంతో అత‌డి పేరు నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఈ హెడ్ లైన్స్ ని మించి అత‌డు ప‌నిత‌నం చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు క్రేజీ సినిమాల‌కు అత‌డు అందించే బీజీఎం లేదా రీరికార్డింగ్ ఎంతో కీల‌కంగా మారుతుంది. క‌థ‌ను డ్రైవ్ చేసే బీజీఎం వంద‌శాతం నోలాన్ రేంజు అభిరుచితో దూసుకురావాలి. అప్పుడే పాన్ వ‌ర‌ల్డ్ సినిమాల స్థాయి ప్ర‌తిభావంతుడు అని మ్యూజిక్ ల‌వ‌ర్స్ అంగీక‌రిస్తారు.

మాస్ ఆడియన్స్‌కు చేరువైనా కానీ..క్లాస్‌ని మెప్పించాలి:

సంగీత ప్రపంచంలో యువ సంచలనం సాయి అభ్యంకర్ పెద్ద చ‌ర్చ‌గా మారారు. గతంలో డ్యూడ్ వంటి చిత్రాలతో జెన్-జీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న అత‌డు.. ఇప్పుడు `కరుప్పు` సినిమాతో మాస్ ఆడియన్స్‌ను పలకరిస్తున్నారు. సూర్య కథానాయకుడిగా- ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా..తాజాగా విడుదలైన `కరుప్పు కూడా వా`అనే మాస్ సింగిల్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఇప్పటికే సూపర్ హిట్లు అందుకున్న సాయి..ఆధునిక సంగీతాన్ని మాస్ అప్పీల్‌తో మిళితం చేస్తూ యువతలో ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారన‌డంలో సందేహం లేదు. అయితే అత‌డి నుంచి అంత‌కుమించి సంగీత ప్రియులు ఆశిస్తున్నార‌న్న‌ది మ‌రువకూడ‌దు.

ప్రస్తుతం పరిశ్రమలో అందరి దృష్టి సాయి అభ్యంకర్ అందించబోయే నేపథ్య సంగీతం (బీజీఎం)పైనే ఉంది. ఇప్పటికే `గాడ్ మోడ్` ట్రాక్ ద్వారా తన సత్తా చాటిన యువ సంగీత తేజం ఈ స్థాయి మాస్ చిత్రానికి ప్రాణం పోయడం ఒక పెద్ద పరీక్ష అని చెప్పాలి. అయితే సాయి హవా కేవలం ఈ ఒక్క సినిమాతోనే ఆగడం లేదు. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `రాకా`కు కూడా సంగీతం అందిస్తుండటం గమనార్హం. అయితే పుష్ప ఫ్రాంఛైజీతో సంచ‌ల‌నాలు సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ అయ్యారు. అందువ‌ల్ల ఈ ప్రాజెక్ట్ అత‌డికి మ‌రింత బిగ్ ఛాలెంజ్ అన‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా సాయి అభ్యంక‌ర్ సంగీతం అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను ట‌చ్ చేయాల్సి ఉంటుంది. లోకల్ థీమ్డ్ మ్యూజిక్, రొటీన్ స్వ‌రాల‌తో నిరాశ‌ప‌ర‌చ‌కూడ‌ద‌ని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆర్.ఆర్ ఎలివేష‌న్ లో అత‌డు ఆస్కార్ దిగ్గ‌జం రెహ‌మాన్ ఇచ్చినంత ఇంపాక్ట్ క‌చ్ఛితంగా ఇవ్వాల్సి ఉంటుంది.

వరుసగా పెద్ద ప్రాజెక్టులను చేజిక్కించుకుంటున్న సాయి అభ్యంకర్ అతి త్వరలోనే భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి సంగీత దర్శకుల్లో ఒకరిగా నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ అత‌డు మ‌రో రొటీన్ సంగీత ద‌ర్శ‌కుడిగా మిగ‌ల‌కుండా.. ప్ర‌తి సినిమాతో క్రియేటివిటీ ప‌రంగా పీక్ ని చూపించాల్సి ఉంటుంది. మాస్ బీట్స్ తో పాటు క్లాస్ ని మెప్పించే రెహ‌మానియాను అత‌డు క్రియేట్ చేయాల్సి ఉంటుంది.