ఇండస్ట్రీలో రియల్ హీరో అతనే.. బీవీఎస్ రవి షాకింగ్ కామెంట్స్!
24 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇప్పటివరకు తాను పనిచేసిన నటీనటులలో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే రియల్ హీరో అంటూ వ్యాఖ్యానించారు.
By: Madhu Reddy | 27 May 2026 11:34 AM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ స్క్రీన్ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బీవీఎస్ రవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన పూర్తి పేరు బాచిమంచి వెంకట సుబ్రహ్మణ్యం రవి.. కానీ సన్నిహితులు మాత్రం మచ్చ రవి అంటూ పిలుచుకుంటూ ఉంటారు.. ముఖ్యంగా ఎన్నో సినిమాలకు రచయితగా , దర్శకుడిగా, నిర్మాతగా కూడా పనిచేసిన ఈయన.. ఎంతోమంది హీరోలతో, హీరోయిన్లతో, దర్శకులతో, కథా రచయితలతో కలిసి పని చేశారు. అలా ఆ అనుభవంతో తన స్వీయ అనుభవాలను పంచుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.
24 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇప్పటివరకు తాను పనిచేసిన నటీనటులలో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే రియల్ హీరో అంటూ వ్యాఖ్యానించారు. మరి బివిఎస్ రవి మనసు దోచుకున్న ఆ రియల్ హీరో ఎవరో ఆయన మాటల్లో ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బీవీఎస్ రవి మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో నేను ఎంతోమందిని చూశాను. ఎంతో మందితో కలిసి పని చేశాను. కానీ వారందరిలో రియల్ క్యారెక్టర్ అంటే కేవలం రవితేజది మాత్రమే. ఎవరికీ సలహాలు ఇవ్వడు. ఎవరిని సలహాలు అడగడు. ముఖ్యంగా ఎవరి దగ్గర రూపాయి అడగడు. ఎవరైనా వచ్చి అడిగితే హెల్ప్ ఖచ్చితంగా చేస్తాడు. కానీ చేసిన సహాయాన్ని ఎవరికీ చెప్పడు" అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. మొత్తానికైతే రవితేజ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి బీవీఎస్ రవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పోసాని కృష్ణమురళి దగ్గర సహాయ కథ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన ఈయన.. శివయ్య , సీతారామరాజు, ప్రేయసిరావే, అయోధ్యరామయ్య, భద్రాచలం, స్నేహితులు వంటి ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఇక 2011లో వచ్చిన వాంటెడ్ చిత్రానికి దర్శకుడిగా మారిన ఈయన.. 2012లో వివాదాస్పద హిట్ చిత్రం దేనికైనా రెడీ చిత్రానికి కథ అందించాడు. ఇక పూరీ జగన్నాథ్ తో కలిసి కెమెరామెన్ గంగతో రాంబాబు, దేవుడు చేసిన మనుషులు, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలకు సహ రచయితగా పనిచేసి.. సెకండ్ హ్యాండ్ అనే చిత్రానికి నిర్మాతగా మారాడు. తక్కువ బడ్జెట్లో చిత్రాన్ని తీసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు సినీ పరిశ్రమలో సింగిల్ షాట్ సినిమాటోగ్రఫీ అనే కాన్సెప్ట్ ను కూడా రూపొందించిన మొదటి నిర్మాతగా గుర్తింపు సంపాదించారు.
రవితేజ విషయానికి వస్తే.. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి.. తర్వాత సెకండ్ హీరోగా తన ప్రయాణాన్ని ఆరంభించి, ఇప్పుడు మాస్ మహారాజాగా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు. ఇకపోతే గత కొంత రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి అనే సినిమా చేస్తున్నారు. రవితేజ 77వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప భక్తుడిగా కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
