Begin typing your search above and press return to search.

టికెట్టు భారం.. బాక్సాఫీస్ భయం

ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి రికవరీ చేసుకోవడానికి థియేటర్స్ లో టికెట్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 3:50 AM GMT
టికెట్టు భారం.. బాక్సాఫీస్ భయం
X

ఒకప్పుడు సినిమాలు నెలల తరబడి థియేటర్స్ లో ఆడుతూ ఉండేవి. ఎవరేజ్ టాక్ వచ్చిన సినిమాకి కూడా కలెక్షన్స్ లు భాగానే వచ్చి నిర్మాతలు సేఫ్ అయ్యేవారు. అలాగే సినిమా బడ్జెట్ లు కూడా పరిమితిలో ఉండేవి. అయితే మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ పెరిగింది. ఆడియన్స్ కి సరికొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సినిమాలపై బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారు.

ఇప్పుడైతే స్టార్ హీరోల సినిమాల నిర్మాణ వ్యయం వందల కోట్లలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి రికవరీ చేసుకోవడానికి థియేటర్స్ లో టికెట్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఒకప్పుడు చిన్న చిన్న పట్టణాలలో ఉండే టూరింగ్ టాకీస్ లలో 10 నుంచి 50 రూపాయిలు ఖర్చు పెడితే హ్యాపీగా కొత్త సినిమాచూసుకొని వచ్చేసేవారు. ఇప్పుడు 150రూపాయిల వరకు పెట్టాల్సి వస్తోంది.

ఇక పెద్ద పట్టణాలలో మల్టీప్లెక్స్ థియేటర్స్ లో అయితే 200 పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత మొత్తం పెట్టి సినిమా చూడాలంటే సామాన్యులకి భారమని చెప్పాలి. అందుకే ఆడియన్స్ మూవీస్ ఎంపిక క్రమంగా మారిపోతుంది. ఎంతో సూపర్ హిట్ టాక్ వస్తేనే తప్ప థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడటం లేదు. కేవలం స్టార్ హీరోల చిత్రాల వరకు మొదటి మూడు, నాలుగు రోజుల సందడి ఉంటుంది. హిట్ టాక్ వస్తే స్థిరంగా కలెక్షన్స్ వారం రోజులపాటు నడుస్తున్నాయి.

లేదంటే వీకెండ్ మూడు రోజులు అయ్యేసరికి థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. బాగుందనే టాక్ వచ్చిన కొన్ని సినిమాలకి కలెక్షన్స్ రావడం లేదు. నెల రోజులు ఆగితే ఎలాగూ ఓటీటీలోకి వస్తుంది కాబట్టి ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూసుకోవచ్చు అని లైట్ తీసుకుంటున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్స్ లో సినిమాలకి రెస్పాన్స్ దారుణంగా తగ్గిపోయింది.

దీనికి భారీ టికెట్ ధరలు కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ ధరల విషయంలో నిర్మాతలు మరోసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది. వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించే సినిమాలకి టికెట్ ధరలు ఎక్కువ ఉన్నాయంటే ఆలోచించొచ్చు. కానీ 50 కోట్ల లోపు బడ్జెట్ తో తీసే సినిమాలకి కూడా 200 రూపాయిల పైన టికెట్ ధరలు ఉంటే ఆడియన్స్ చూసేందుకు ఆసక్తి చూపించరు. ఈ ఏడాదిలో అలా బాగుందనే టాక్ వచ్చి కూడా టికెట్ ధరల కారణంగా నష్టాలు వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. తాజాగా హాయ్ నాన్న మూవీకి కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడానికి టికెట్ ధరలు కారణం అనే మాట వినిపిస్తోంది.