Begin typing your search above and press return to search.

బన్నీ మాస్టర్ ప్లాన్.. ఈసారి బాలీవుడ్ లో..

భారీ ప్రాజెక్ట్ కు ప్లాన్ చేస్తున్నారట. ప్రొడక్షన్ హౌస్ గురించి వివరాలు బయటకు రాకపోయినా.. చర్చలు జరపడం మాత్రం నిజమేనని నెటిజన్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 6:33 AM GMT
బన్నీ మాస్టర్ ప్లాన్.. ఈసారి బాలీవుడ్ లో..
X

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. కంటిన్యూలో షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇప్పటికే తెగ ఆకట్టుకుంది. పుష్ప మూవీ హిట్‌తో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకే నటీనటుల నుంచి సన్నివేశాలు, ఐటమ్ సాంగ్ వరకు చాలా పక్కాగా తెరకెక్కిస్తున్నారు లెక్కల మాస్టర్ సుకుమార్.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 మూవీ షూటింగ్ శరవగేంగా జరుగుతోంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను అనేక రోజులు నుంచి చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే గంగమ్మ జాతర నేపథ్యంలో సాగే ఓ పాటను సుమారు వెయ్యి మంది డ్యాన్సర్లతో మేకర్స్ చిత్రీకరించినట్లు సమాచారం. ఈ పాటతో పాటు అక్కడ భారీ యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించినట్లు సినీ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ సినిమా తర్వాత మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు బన్నీ. ఆ తర్వాత యానిమల్ లో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కూడా మూవీ తీయనున్నారు. ఈ సినిమాను బీటౌన్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ- సిరీస్ తెరకెక్కించనుంది. ఇప్పుడు నెట్టింట మరో వార్త చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ కు చెందిన మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో అల్లు అర్జున్ చర్చలు జరుపుతున్నారట. భారీ ప్రాజెక్ట్ కు ప్లాన్ చేస్తున్నారట. ప్రొడక్షన్ హౌస్ గురించి వివరాలు బయటకు రాకపోయినా.. చర్చలు జరపడం మాత్రం నిజమేనని నెటిజన్లు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తుంటే బన్నీ పెద్ద ప్లానే వేశారన్నమాట.

కొన్ని నెలల క్రితం సంజయ్ లీలా బన్సాలీ కార్యాలయం నుండి అల్లు అర్జున్ బయటకు రావడం అప్పట్లో తెగ వైరలైంది. ఇప్పుడు దానికి దీనికి కనెక్ట్ చేస్తున్నారు నెటిజన్లు. పుష్ఫ తర్వాత పెద్ద ప్రాజెక్ట్ కు బన్నీ ఓకే చేశారంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.