టాలీవుడ్ లో సమస్యలు.. బన్నీ వాసు కీలక సూచనలు..
ఓటీటీల వల్ల అలా జరుగుతుందని అంటున్నారు. అలా టాలీవుడ్ లో సమస్యలు ఒకటి కాదు రెండు కాదు.. చాలా ఉన్నాయి.
By: Tupaki Desk | 6 Jun 2025 11:52 AM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమస్యలు అనేకం. ఓవైపు సింగిల్ స్క్రీన్స్ మూతపడుతున్నాయి. ఎక్కువ శాతం కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. మరోవైపు ఎగ్జిబిటర్లు, నిర్మాతలు మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రావడం లేదు. పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్స్ అడుగుతుండగా, అవ్వదని నిర్మాతలు చెబుతున్నారు.
ఇంతలో థియేటర్స్ ను జూన్ 1వ తేదీ నుంచి బంద్ చేస్తామని ప్రకటన రావడం.. అప్పుడే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అవ్వడం.. ఆ తర్వాత పలువురు నిర్మాతలు స్పందించడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే. అయితే థియేటర్స్ కు ఆడియన్స్ రావడం లేదని, అందుకే సింగిల్ థియేటర్స్ ను మూసేస్తున్నామని అంటున్నారు.
ఓటీటీల వల్ల అలా జరుగుతుందని అంటున్నారు. అలా టాలీవుడ్ లో సమస్యలు ఒకటి కాదు రెండు కాదు.. చాలా ఉన్నాయి. కానీ వాటి పరిష్కరించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. వాటిపై అందరూ కూర్చుని కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమవుతుందో తెలియదు కానీ.. ఎలాంటి చర్చలు జరగలేదు.
అదే సమయంలో నిర్మాత బన్నీ వాసు ఇప్పుడు సోషల్ మీడియాలో కీలకమైన పోస్ట్ పెట్టారు. టాలీవుడ్ లోని సమస్యలపై మాట్లాడారు. స్టార్ హీరోలకు కీలక సూచనలు ఇచ్చారు. ఓటీటీల్లో సినిమాలు స్ట్రీమింగ్ చేసే విషయంపై అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి"
"ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది" అంటూ రాసుకొచ్చారు
అయితే బన్నీ వాస్ పోస్ట్ చూశాక.. ఆయన చెప్పింది నిజమని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సమస్యలకు చెక్ పెట్టడంపై సరైన విధంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. సూచనలు కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా కంటెంట్ ఇవ్వడంపై స్టార్ హీరోలు, మేకర్స్ దృష్టి పెట్టాలని చెప్పవచ్చు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
