ఎన్నో ఏళ్లుగా దాన్ని గుండెల్లో మోస్తున్నా
ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు సాన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్నాడు.
By: Tupaki Desk | 16 May 2025 12:00 AM ISTఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు సాన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగిన బుచ్చిబాబు కేవలం ఒక్క సినిమాతో ఇంత ఘనత సాధించడం చిన్న విషయమేమీ కాదు. ఉప్పెన తర్వాత రెండో సినిమా పెద్ది కోసం ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌నే లైన్ లో పెట్టిన బుచ్చిబాబు ప్రస్తుతం ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు పెద్ది సినిమా గురించి మాట్లాడి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
పెద్ది సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి తానెంతగానో ఎదురుచూస్తున్నానని చెప్పిన బుచ్చిబాబు, ఈ సినిమా కథను తాను గత కొన్నేళ్లుగా గుండెల్లో పెట్టుకుని మోస్తున్నానని, ఈ సినిమా కథ క్రికెట్ గురించి మాత్రమే కాదని, సినిమా నేపథ్యం మాత్రేమే ఆట అని, విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఉత్తరాంధ్ర సంస్కృతి, ఆ మాండలికంలో ఎంతో లోతుగా పాతుకుపోయిన పెద్ది లాంటి కథను చేయాలని తనకెప్పట్నుంచో ఉందని బుచ్చిబాబు చెప్పాడు.
రెండేళ్ల కిందట చరణ్ తో తాను ఈ కథ చెప్పినప్పుడు ఆయన ఈ క్యారెక్టర్ చేయడానికి అసలు వెనుకాడలేదని, ఈ సినిమా కోసం ఆయనెంతో కష్టపడ్డాడని, పెద్ది కథ చెప్పినప్పటి నుంచి ప్రతీ దాంట్లో చరణ్ ఇన్వాల్వ్ అవుతూ అన్ని విషయాల్లోనూ ఎంతగానో కష్టపడ్డాడని, పెద్ది కోసం చరణ్ కు ఎన్నో లుక్ టెస్ట్‌లు చేసి ఆఖరికి ఇప్పుడు చూస్తున్న లుక్ ను ఫిక్స్ చేశామని బుచ్చిబాబు చెప్పాడు. సెట్స్ లోకి వచ్చాక రామ్ చరణ్ ఎంతో భిన్నంగా ఉంటాడని, ఇంకో టేక్ చేసి ఇంకా బెటర్ అవుట్‌పుట్ ఇవ్వాలని చూస్తుంటాడని బుచ్చిబాబు తెలిపాడు.
ఫ్యూచర్ లో తానెలాంటి జానర్ లో సినిమాలు చేసినా అవన్నీ ఎమోషన్స్ తోనే నిండి ఉంటాయని, ఎమోషన్స్ లేకుండా ఒక కథను ఎలా చెప్పాలనేది తనకు తెలియదని, ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ను ఛాలెంజ్ చేయడం తనకెంతో ఇష్టమని, అసాధ్యమైన టార్గెట్స్ ను పెట్టుకుని వాటిని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటానని, గతంలో ఎవ్వరూ ట్రై చేయని వాటిని చేయడమంటే తనకు ఆసక్తి అని బుచ్చిబాబు ఈ సందర్భంగా చెప్పాడు.
పెద్ది సినిమాతో ఏఆర్ రెహమాన్ తెలుగు సినిమాకు తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన బుచ్చిబాబు అతనితో పని చేయడం డ్రీమ్ కం ట్రూ మూమెంట్ అని అన్నాడు. పెద్ది కోసం రెహమాన్ తమకు ప్రతి పాటకు 20 నుంచి 30 ఆప్షన్స్ ఇచ్చాడని, ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి భిన్నంగా ఉంటుందని బుచ్చిబాబు వెల్లడించాడు.
