Begin typing your search above and press return to search.

రేవంత్ వర్సెస్ కేసీఆర్ : ఇద్దరి ధీమా వెనక ?

రాజకీయ నేతలకు పార్టీలకు ఆత్మ విశ్వాసం ఉండాలి. అది అతి విశ్వాసంగా మారకూడదు.

By:  Satya P   |   22 April 2026 9:11 AM IST
రేవంత్ వర్సెస్ కేసీఆర్ : ఇద్దరి ధీమా వెనక ?
X

రాజకీయ నేతలకు పార్టీలకు ఆత్మ విశ్వాసం ఉండాలి. అది అతి విశ్వాసంగా మారకూడదు. ఒక ఎన్నికల్లో జనాలు గెలిపించేశారు అని మరో ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుందని భావించి భంగపడిన వారు దేశంలో ఎంతో మంది ఉన్నారు. అంతదాకా ఎందుకు ఏపీలో చూస్తే జగన్ 2019లో గెలిచారు. ఏకంగా 151 సీట్లు ఆయనకు దక్కాయి. దాంతో ముప్పయ్యేళ్ళు నేనే సీఎం అని ధీమా ప్రదర్శించారు. తీరా 2024 ఎన్నికల్లో చూస్తే సీన్ రివర్స్ అయింది. ఏకంగా 11 సీట్లకు ఆ పార్టీ పడిపోయింది. అందువల్ల జనాల మూడ్ ఏమిటి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏమిటి అన్నది ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఉండాల్సిందే. ఎంతటి తలపండిన నాయకుడు అయినా గెలుపు గురించి గట్టిగా చెప్పలేరు. దానికి కారణం జనాల చేతిలోనే జాతకాలు ఆధారపడి ఉండడం.

యాంటీ ఇంకెంబెన్సీతోనేనా :

రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజా వ్యతిరేకత వెల్లువగా ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. దాంతో 2028 ఎన్నికల్లో తమకు బంగారు పళ్ళెంలో అధికారాన్ని చేతిలో జనాలు పెట్టేస్తారు అని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. అంతే కాదు ఇంకేముందు ఎన్నికలు అన్నవి లాంచనం మాత్రమే అన్న నిర్ధారణకు కూడా వచ్చేస్తున్నారు. రేపటి గెలుపు మాదే ప్రభుత్వం మాదే అని కూడా నిబ్బరంగా చెబుతున్నారు. పదేళ్ల పాటు అధికారంలో బీఆర్ఎస్ ఉంది. ప్రజలకు మంచి చేసింది, అలాగే ఇబ్బంది కలిగే పనులు ఉన్నాయనే జనాలు దించేశారు

ఇంతలో పెద్ద మార్పు :

రెండేళ్ళలోనే జనాలు మారారని బీఆర్ ఎస్ ఎలా అనుకుంటోంది అన్నదే ప్రశ్న. ఓడిన దగ్గర నుంచి కేసీఆర్ ఎక్కడా జనాల్లోకి వచ్చింది లేదని గుర్తు చేస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్నపుడు కానీ విపక్షంలో ఉన్నపుడు కానీ జనాలకు దూరంగా ఫాం హౌస్ లోనే ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ చేసిన పోరాటాలు పెద్దగా లేవని చెబుతున్నారు. ఇంతలో ఇంత పెద్ద మార్పు బీఆర్ఎస్ పట్ల అనుకూలత ఎలా వచ్చిందని అనుకుంటున్నారు అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

ఆల్టర్నేషన్ లేదనా :

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాల్సి ఉంది. జనాలకు వేరే ఆల్టర్నేషన్ లేదనే బీఆర్ ఎస్ తమకే పట్టం కడతారు అని భావిస్తోందా అన్న చర్చ సాగుతోంది. కేసీఆర్ అయితే జగిత్యాల సభలో వచ్చేది మేమే అని గట్టిగానే చాటారు. తమ పార్టీలో చేరిన జీవన్ రెడ్డికి పార్టీ పదవి ఇస్తూనే ప్రభుత్వంలో కూడా కీలక స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి కాబోయే సీఎం తరహాలోనే కేసీఆర్ మాట్లాడారు. అది క్యాడర్ ని ఉత్సాహపరచేందుకు ఉపయోగపడవచ్చు కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్ లో ఆ రకమైన సీన్ ఉందా అన్నదే పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది.

పేరు మార్చుకుంటానని సవాల్ :

మరో వైపు చూస్తే కాటారంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు. పాపాల భైరవుడు అన్నారు. ఎలా అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందో చూస్తామని సవాల్ చేశారు. మళ్ళీ కాంగ్రెస్ దే రాజ్యం అని కూడా గట్టిగా చెప్పారు. ఒక వేళ కేసీఆర్ కనుక అధికారంలోకి వస్తే తన పేరు మార్చుకుంటాను అని కూడా రేవంత్ రెడ్డి శపధం చేశారు. అసలు బీఆర్ఎస్ ఎలా గెలుస్తుందో కూడా తాము చూస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం. ఈ విధంగా రేవంత్ రెడ్డి చూస్తే 2034 దాకా అధికారం తమదే అని ధీమాగా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక విషయం మరచిపోతున్నారు అని అంటున్నారు.

తక్కువ అంచనా వేయలేరు :

ఉన్న పార్టీ కాంగ్రెస్. అది జాతీయ పార్టీ. అందులో నాయకులకు కొదవ లేదు. 2023లో అయితే అంతా కలసి సర్దుకుని అధికారమే పరమావధిగా పనిచేశారు. మళ్ళీ అంతటి ఐక్యత 2028లో చూపిస్తారా అన్నది ఒక ప్రశ్న అయితే ఈసారి కాంగ్రెస్ అధినాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో అన్నది కూడా మరో చర్చ. ఇవన్నీ పక్కన పెడితే ప్రజలు కూడా కాంగ్రెస్ ని రెండోసారి ఎందుకు ఎన్నుకోవాలి అన్నది కూడా ఆలోచిస్తారు కదా అని అంటున్నారు ఇవన్నీ మరచిపోయి అధికారం తమదంటే తమది అని రేవంత్ రెడ్డి కేసీఆర్ విమర్శలు చేసుకోవడం సవాళ్ళు చేసుకోవడం తెలంగాణా రాజకీయాల్లో ఎనికలకు ముందే కొత్త హీట్ ని తెచ్చేశాయి. అయితే ప్రజలకు అన్నీ తెలుసు తెలంగాణా సమాజం రాజకీయ సామాజిక చైతన్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరని ట్రాక్ రికార్డు నిరూపిస్తోంది అని గుర్తు చేస్తున్నారు.