Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి నందమూరి హీరో డిజాస్టర్ మూవీ!

ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం, ఆ తర్వాత మరో మూవీ చేయకపోవడంతో జనాలు చైతన్యను పూర్తిగా మర్చిపోయారు.

By:  Tupaki Desk   |   5 March 2024 11:36 AM GMT
ఓటీటీలోకి నందమూరి హీరో డిజాస్టర్ మూవీ!
X

సినిమాలతో కంటే సోషల్ మీడియా ట్రోలింగ్ తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న హీరో నందమూరి చైతన్య కృష్ణ. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి ఫ్యామిలీ మూడో తరం నట వారసుడిగా రెండు దశాబ్దాల క్రితమే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2003లో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన ‘ధమ్’ అనే చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం, ఆ తర్వాత మరో మూవీ చేయకపోవడంతో జనాలు చైతన్యను పూర్తిగా మర్చిపోయారు. అయితే 20 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి ‘బ్రీత్‌’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.

నందమూరి చైతన్యకృష్ణ కథానాయకుడిగా వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రీత్‌’. 'వైద్యో నారాయణో హరి' అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ మెడికో థ్రిల్లర్ లో వైదిక సెంజిలియా హీరోయిన్ గా నటించింది. చైతన్య కృష్ణ తండ్రి నందమూరి జయకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2023 డిసెంబర్‌ 2న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. నందమూరి బాలకృష్ణ, కల్యాణ్ రామ్ ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ యాప్ లో ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా బుక్ కాలేదంటే, ఈ చిత్రం ఎలాంటి దారుణమైన పరాజయాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

ఇటీవలి కాలంలో బ్లాక్ బస్టర్ సినిమాలే థియేటర్లలో రిలీజైన నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెడుతున్నారు. అలాంటిది బాక్సాఫీస్ వద్ద జీరో షేర్ రాబట్టిన 'బ్రీత్‌' చిత్రం, మూడు నెలలు గడిచినా ఇంతవరకూ ఓటీటీలోకి రాకపోవడంపై సోషల్ మీడియాలో అనేక ఫన్నీ మీమ్స్ వచ్చాయి. అయితే ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైన 100 రోజుల తర్వాత చైతన్య కృష్ణ సినిమా డిజిటల్ వేదిక మీదకు వస్తోంది. తెలుగు ఓటీటీలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించారు.

మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీ నుంచి 'బ్రీత్' చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా టీమ్ ట్వీట్ చేశారు. 'నందమూరి ఛాయ్ బ్రీత్ ఆన్ ఆహా' అంటూ చైతన్య కృష్ణ ఇంటెన్స్ పోస్టర్ ను పంచుకున్నారు. దీనికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. 'తెలుగు ప్రజలారా ఊపిరి పీల్చుకోండి అన్న వొస్తున్నాడు..' అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి నందమూరి హీరోకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే కారణమని ఆ కామెంట్లు చూస్తే అర్థం అవుతుంది.

'బ్రీత్' సినిమా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా.. ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో చైతన్య కృష్ణ కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఆయన పేరు మీద ఎన్నో మీమ్ పేజెస్, ఫ్యాన్ పేజెస్ పుట్టుకొచ్చాయి. ‘ధమ్’ మూవీలో చైతన్య ఎక్స్‌ప్రెషన్లు, డైలాగులు, డ్యాన్సులకు సంబంధించిన వీడియోలతో విపరీతంగా ట్రోల్ చేశారు. 'సర్ప్రైజింగ్ స్టార్ చైతూ బాబు' అంటూ కొన్ని బిరుదులు ఇచ్చి మరీ ట్రోలింగ్ చేశారు. అయితే వీటన్నిటినీ చైతన్య చాలా స్పోర్టివ్‌ గానే తీసుకున్నారు.

ఇప్పుడు 'బ్రీత్' ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రావటంతో మీమ్ రాయుళ్లంతా మళ్లీ చైతన్య కృష్ణను ట్రోల్ చేయటానికి రెడీ అయిపోతున్నారు. శివరాత్రి నుంచి ఆహాలో కావల్సినంత ట్రోలింగ్ స్టఫ్ దొరుకుతుందని కామెంట్లు చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన నందమూరి హీరో చిత్రానికి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.