Begin typing your search above and press return to search.

ఇవ‌న్నీ కాదు 'బ్రహ్మాస్త్రం' గురి త‌ప్ప‌డానికి అస‌లు కార‌ణం?

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా `అస్ట్రావర్స్` ప్రపంచాన్ని విస్తరిస్తూ.. దీపికా పదుకొణెను కీలక పాత్రలో నిలిపి `బ్రహ్మాస్త్ర 2`ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు.

By:  Sivaji Kontham   |   25 Aug 2026 11:58 AM IST
ఇవ‌న్నీ కాదు బ్రహ్మాస్త్రం గురి త‌ప్ప‌డానికి అస‌లు కార‌ణం?
X

పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో గ‌ణాంకాలు చాలా మారాయి. కేవ‌లం భారీ తారాగ‌ణం.. బిగ్ బడ్జెట్.. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మాత్రమే విజయాన్ని అందించలేవు. సాంకేతికత ఎంత ఉన్నా.. సగటు ప్రేక్షకుడికి కథలోని ఎమోషన్‌ను కనెక్ట్ చేయడంలో దర్శకుడు విఫలమైతే ఎంతటి బిగ్ ప్రాజెక్ట్ అయినా బోల్తా పడక తప్పదు. దర్శకుడు అయాన్ ముఖర్జీ విషయంలో ఇది బ‌ల‌మైన ప్ర‌భావం చూపుతోందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అతడు తెర‌కెక్కించిన ఇటీవ‌లి సినిమాల్లో ప్రధానంగా ఎమోషనల్ కనెక్టివిటీ లోపిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఈ బలహీనతే ఇప్పుడు అత‌డి కెరీర్‌ను.. త‌దుప‌రి బిగ్ ప్రాజెక్టును తీవ్ర ఇబ్బందుల్లో ప‌డేసింద‌ని చెబుతున్నారు.

నిజానికి అయాన్ ముఖర్జీ తెరకెక్కించాల్సిన భారీ ఫాంటసీ చిత్రం `బ్రహ్మాస్త్ర 2` ప్రాజెక్ట్ నుంచి ఒక దిగ్గజ నిర్మాణ సంస్థ ఉన్నపళంగా తప్పుకోవడానికి రకరకాల ఆర్థిక కారణాలు వెతుకుతున్నా.. అసలు కారణం వేరే ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి. భారీ తారాగణం, విపరీతమైన అంచనాల మధ్య వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ డ్రామా `వార్ 2` నిరాశపరచడమే ఇందుకు ప్రధాన కార‌ణ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఆ సినిమాను పేలవంగా తెరకెక్కించిన తీరు, స్క్రిప్ట్‌లోని అసంబద్ధమైన సన్నివేశాలు.. ఎమోషన్ పండకపోవడమే దానికి కారణం. వీఎఫ్ఎక్స్ పైనా విమ‌ర్శ‌లొచ్చాయి. నిజానికి బ్ర‌హ్మాస్త్ర కాన్సెప్ట్ బావున్నా కానీ ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ అనేది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉంద‌ని తెలుగు క్రిటిక్స్ విమ‌ర్శించారు. అయాన్ ప్ర‌స్తుత ప్ర‌య‌త్నాలు అంత‌కంత‌కు డిలే అవ్వ‌డానికి కార‌ణాలు స్ప‌ష్ఠంగా ఉన్నాయి. కేవలం గ్రాఫిక్స్ పై ఆధారపడి తీసే సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేవని గ్రహించిన నిర్మాతలు, ఇప్పుడు అయాన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పెట్టేందుకు తీవ్రంగా పునరాలోచిస్తున్నార‌ని కూడా విశ్లేషిస్తున్నారు.

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా `అస్ట్రావర్స్` ప్రపంచాన్ని విస్తరిస్తూ.. దీపికా పదుకొణెను కీలక పాత్రలో నిలిపి `బ్రహ్మాస్త్ర 2`ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. అయితే విజువల్స్ పక్కన పెడితే కథాగమనంలో లోతు లేకపోవడం.. ఎమోషనల్ కంటెంట్ మిస్ అవ్వడమే ఈ ప్రాజెక్ట్‌ను ప్రమాదంలో పడేసింది. ఈ పరిణామాలు అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించినా.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మాత్రం ఎలాగైనా కొత్త ప్రొడ్యూసర్లను వెతుక్కుని ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ ఎమోషన్ లేని గ్రాఫిక్స్ కేవలం కాగితాలకే పరిమితం అవుతాయన్న సత్యం ఇక్కడ స్పష్టమవుతోంది.

నేటి డిజిటల్ యుగంలో హాలీవుడ్ చిత్రాలైన అవతార్, అవెంజర్స్ వంటి మేకింగ్ ప్రమాణాలను సగటు భారతీయ ప్రేక్షకుడు కూడా మన సినిమాల నుంచి ఆశిస్తున్నాడు. అంతటి విజువల్ వండర్ క్రియేట్ చేయాలంటే సాధారణ బడ్జెట్‌లు సరిపోవు. సరైన ఎమోషనల్ కనెక్ట్ లేకుండా కేవలం బడ్జెట్ ని నమ్ముకుని సినిమాలు తీస్తే ఏం జరుగుతుందో ఇప్ప‌టికే అనుభ‌వాలు అయ్యాయి. ఇక రాకేష్ రోష‌న్- హృతిక్ రోష‌న్ బృందం నుంచి `క్రిష్ 4` ప్రాజెక్ట్ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లకపోవడానికి అసాధార‌ణ బ‌డ్జెట్ ని ఆశించ‌డం ఒక కార‌ణం. బడ్జెట్ అందించే నిర్మాతలు దొరకడం లేదు అంటే దాని వెన‌క ఇంకా ఏవైనా కార‌ణాలు ఉండొచ్చు.

ముగింపుగా చూస్తే... కథలో ఎమోషనల్ సోల్ లేకుండా కేవలం భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఆధారంగా సాగే కథలకు నిర్మాతలు కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా లేరని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. అందుకే ప్రస్తుతం `క్రిష్ 4`, `బ్రహ్మాస్త్ర 2`.. `ఇండియన్ 3` వంటి ప్రాజెక్ట్‌లు అనిశ్చితిలో పడి వెయిటింగ్ లిస్ట్‌లో మిగిలాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ వాస్తవాన్ని గ్రహించి.. కేవలం స్కేల్ అండ్ గ్రాఫిక్స్ వెనక పడకుండా.. ఆడియెన్స్ హృదయాలను హత్తుకునే ఎమోషనల్ కంటెంట్ రాసుకుంటేనే ఆయన ప్రాజెక్టులకు మళ్లీ మోక్షం లభించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.