'8 ఏళ్ల పోరాటం.. క్షోభ అనుభవించా'.. ఏంజెలీనా జోలితో విడాకుల పై తొలిసారి స్పందించిన బ్రాడ్ పిట్!
అయితే, ఈ విడాకుల గురించి బ్రాడ్ పిట్ తొలిసారిగా ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను పంచుకున్నారు.
By: Tupaki Desk | 29 May 2025 1:06 PM ISTప్రముఖ హాలీవుడ్ తారలు, ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్న జంట ఏంజెలీనా జోలి, బ్రాడ్ పిట్. వీరిద్దరూ విడిపోవడం కేవలం హాలీవుడ్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 8 ఏళ్ల పాటు కోర్టులో సుదీర్ఘంగా కొనసాగిన వీరి విడాకుల పోరాటం, హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైనదిగా నిలిచిపోయింది. చివరకు గత ఏడాదే వీరు అధికారికంగా విడిపోయారు. అయితే, ఈ విడాకుల గురించి బ్రాడ్ పిట్ తొలిసారిగా ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను పంచుకున్నారు.
సుదీర్ఘ విడాకుల పోరాటంలో ఏంజెలీనా జోలితో ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత ఉపశమనం కలిగిందా అని అడిగిన ప్రశ్నకు బ్రాడ్ పిట్ స్పందిస్తూ. "లేదు, అది అంత పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నాను. పరిష్కారం అనేది కేవలం చట్టపరమైన లాంఛనప్రాయం మాత్రమే, ఉపశమనం కాదు" అని స్పష్టం చేశాడు. 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక ఒప్పందంతోనే తాను ఆమె నుంచి విడిపోయానని తెలిపాడు. "ఎవరినైనా అడిగి నా గురించి తెలుసుకోండి. నేను ఎంతో క్షోభ అనుభవించాను. జీవితంలో వివిధ స్థాయిలలో నా శక్తికి మించి పోరాడాను. ఇప్పుడు వాటి గురించి మాట్లాడి సమయాన్ని వేస్ట్ చేసుకోవాలని లేదు. నా వ్యక్తిగత జీవితం నిరంతరం వార్తల్లోనే ఉంటుంది. ఇది 30 ఏళ్లుగా జరుగుతూనే ఉంది" అంటూ తన ఆవేదనను వెళ్లగక్కాడు.
అదే ఇంటర్వ్యూలో ప్రస్తుతం తాను ఎలా ఉన్నాడో కూడా బ్రాడ్ పిట్ వివరించాడు. "నేను చాలా అందంగానే ఉన్నాను కదా.. జీవితం కూడా బాగానే కొనసాగుతోంది. నా స్నేహితులతో పాటు నా కుటుంబంతో గడుపుతున్నాను" అని సరదాగా అన్నాడు. "నేను ఎవరో నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పడం ద్వారా, ఈ సుదీర్ఘ పోరాటం తనను తాను మరింతగా అర్థం చేసుకోవడానికి సహాయపడిందని పరోక్షంగా సూచించాడు.
కెరీర్ పరంగా కూడా ప్రస్తుతం బ్రాడ్ పిట్ మళ్ళీ జోరు పెంచుతున్నాడు. తాను నటించిన కొత్త సినిమా 'F1 - ది మూవీ' రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జూన్ 27న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో బ్రాడ్ పిట్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
హాలీవుడ్ నటులు, ఆస్కార్ విజేతలైన ఏంజెలీనా జోలి (49) , బ్రాడ్ పిట్ (61) కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత 2014లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే, 2016లో వారు ఒక ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు బ్రాడ్ పిట్ తమ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జోలి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. 2019లో ఈ దంపతులకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. కానీ, పిల్లల కస్టడీ, ఆస్తుల విభజన విషయంలో చాలా కాలం పాటు కోర్టులో విచారణ జరిగింది. చివరకు, 2024లో వారు పూర్తిగా విడిపోయారు. దీనితో 'బ్రంజెలినా' (Brangelina) యుగానికి తెరపడింది.
