Begin typing your search above and press return to search.

'బాయ్స్ హాస్టల్' మూవీ రివ్యూ

బాయ్స్ హాస్టల్. ట్రైలర్ చూస్తే ఒక క్రేజీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

By:  Tupaki Desk   |   26 Aug 2023 11:54 AM GMT
బాయ్స్ హాస్టల్ మూవీ రివ్యూ
X

'బాయ్స్ హాస్టల్' మూవీ రివ్యూ

నటీనటులు: ప్రజ్వల్ బీపీ-మంజునాథ నాయక-శ్రీవత్స శ్యామ్-తేజస్ జయన్న- భరత్ వశిష్ఠ్-శ్రేయస్ శర్మ-రిషబ్ శెట్టి-పవన్ కుమార్-నితిన్ కృష్ణమూర్తి-తరుణ్ భాస్కర్-రష్మి గౌతమ్ తదితరులు

సంగీతం: అజనీష్ లోక్ నాథ్

ఛాయాగ్రహణం: అర్వింద్ కశ్యప్

నిర్మాత: వరుణ్ గౌడ

రచన-దర్శకత్వం: నితిన్ కృష్ణమూర్తి

భాషా భేదం లేకుండా.. ఆర్టిస్టులెవరని పట్టించుకోకుండా.. కంటెంట్ ఉంటే చాలు ఎక్కడి సినిమానైనా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. గత ఏడాది కన్నడ నుంచి వచ్చిన 'కాంతార'ను ఎంత పెద్ద హిట్ చేశారో తెలిసిందే. ఇప్పుడు ఆ భాష నుంచి వచ్చిన మరో అనువాద చిత్రం.. బాయ్స్ హాస్టల్. ట్రైలర్ చూస్తే ఒక క్రేజీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

ఇదొక బాయ్స్ హాస్టల్లో కుర్రాళ్ల మధ్య నడిచే కథ. ఆరంభం నుంచి చివరి వరకు మొత్తం కథ హాస్టల్ చుట్టూనే తిరుగుతుంది. బాయ్స్ హాస్టల్లో చదువు మీద కంటే మిగతా విషయాల మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టే అల్లరి కుర్రాళ్లు.. వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ కంట్రోల్లో పెట్టే వార్డన్.. ఈ నేపథ్యంలో ఆ వార్డన్ కు కొందరు కుర్రాళ్లు బుద్ధి చెప్పే క్రమంలో పొరపాటున ఆ వార్డన్ చనిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన నేపథ్యంలో ఒక షార్ట్ ఫిలిం తీయాలని ఆ హాస్టల్లో ఒక కుర్రాడు అనుకుంటాడు. కానీ స్నేహితులకు విషయం చెబితే కొట్టిపారేస్తారు. కానీ కాసేపటికి వార్డన్ నిజంగానే చనిపోయినట్లుగా సమాచారం తెలుస్తుంది. వార్డన్ ఆత్మహత్య చేసుకుని అందుకు కారణమైన కుర్రాళ్ల పేర్లతో ఒక నోట్ కూడా రాసి పెట్టి ఉంటాడు. దీంతో లెటర్లో పేర్లున్న వాళ్లందరూ కలిసి వార్డన్ శవాన్ని హాస్టల్ నుంచి మాయం చేసి ఈ వ్యవహారం నుంచి బయటపడటానికి పడే పాట్ల నేపథ్యంలో సాగే కథ.

ఒక సీన్లో 'చదువుకోండి ఫస్టు' అంటుంది ఒక క్యారెక్టర్. ఇంకో సీన్లో ''అది చెప్పు ముందు గాడిద'' అంటుంది మరో పాత్ర.. ఇంకో క్యారెక్టర్.. ''అది నా సంస్కారం'' అంటుంది. ''తెల్లార్లూ ఇలాగే గడిపేస్తారా'' అంటూ మధ్యలో ఇంకో పాత్ర డైలాగ్ పేలుస్తుంది. సోషల్ మీడియాలో మీమ్స్.. జోక్స్ ఫాలో అయ్యే వాళ్లు ఈ డైలాగులతో ఈజీగా కనెక్ట్ అయిపోయి 'బాయ్స్ హాస్టల్'ను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ కనెక్షన్ లేని వాళ్లకు మాత్రం ఇందులో ఏం కామెడీ ఉందని నవ్వుతున్నార్రా అనిపించొచ్చు. ఈ సినిమాలో ఒక కథంటూ ఏమీ లేదు. సన్నివేశాల్లో లాజిక్ కనిపించదు. ఒక కథ.. స్క్రీన్ ప్లే.. ఒక పద్ధతి అంటూ ఏమీ లేకుండా.. సగటు సినిమా ఫార్ములాను బ్రేక్ చేస్తూ సాగే సినిమాను అందరూ ఎంజాయ్ చేయలేరు. కానీ దీనికి కనెక్ట్ అయిన వాళ్లకు మాత్రం ఇదొక హిలేరియస్ రైడ్ లాగా అనిపిస్తుంది.

బాయ్స్ హాస్టల్ ట్రైలర్ చూస్తేనే ఇది రెగ్యులర్ గా మనం చూసే సినిమాల టైపు కాదని.. యునీక్ మూవీ అనే విషయం అర్థమై ఉంటుంది. ఇది ఫలానా టైపు సినిమా అని పోల్చడానికి వీల్లేని సరికొత్త ప్రయోగంగా చెప్పొచ్చు. ఇప్పటి యువత అభిరుచులకు తగ్గట్లు.. సోషల్ మీడియా ట్రెండ్స్‌ ను అనుసరిస్తూ సాగిన యునీక్ కామెడీని ఎంజాయ్ చేయాలంటే ఒక సెపరేట్ మైండ్ సెట్ ఉండాలి. ఒక సీన్లో అమ్మాయి అబ్బాయి ఒక కార్లో ఉండగా వీడియో రికార్డ్ చేయమని ఒక వ్యక్తి అంటే.. అవతలి వ్యక్తి ''సారీ బ్రో.. నేను వేరే వాళ్ల ప్రైవేట్ వీడియోలు తీయలేను'' అంటాడు. దానికి బదులుగా.. ''వీడియో తీయమంటే ప్రైవేట్ గవర్నమెంట్ అంటాడేంటి ఈడు'' అని మొదటి వ్యక్తి. ఇలాంటి నాన్ సింక్ డైలాగులు సినిమాలో బోలెడుంటాయి. కొందరికి అవి సిల్లీగా అనిపించొచ్చు. కొందరికి క్రేజీగా అనిపించొచ్చు.

'బాయ్స్ హాస్టల్'ను ఒక మోడర్న్ పరమానందయ్య శిష్యుల కథగా చెప్పొచ్చు. ఒక హత్య కేసులో ఇరుక్కున్న తింగరోళ్లంతా కలిసి.. ఆ శవాన్ని మాయం చేయడానికి వేసే చెత్త ప్లాన్లు.. వాళ్లకు ఎదురయ్యే అడ్డంకుల నేపథ్యంలో ఒక హిలేరియస్ రైడ్ లాగా దీన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి. సింపుల్ గా ముగించాల్సిన పనిని తమ తింగరితనంతో ఎలా కాంప్లికేట్ చేస్తారు.. విషయం చిరిగి చాటంత అయి అందరూ ఎలా ఇబ్బంది పడతారనే నేపథ్యంలో కథ ముందుకు నడుస్తుంది. ఒకరిని మించిన తింగరోడు ఒకడన్నట్లుగా తెర మీద కనిపించే పాత్రలు.. కావాల్సినంత వినోదాన్ని ఇస్తాయి. కాకపోతే ఆ క్యారెక్టర్లతో కనెక్ట్ అవ్వాలి. వాటి టైమింగ్ తో సింక్ కావాలి. బాయ్స్ హాస్టల్లో జరిగే విధ్వంసాలు.. అరాచకాల మీద కొంచెం ఐడియా ఉంటే ఈ సినిమాను మరింతగా ఎంజాయ్ చేయొచ్చు.

సినిమా అంటే ఇలాగే తీయాలి అనే రూల్స్ ను బ్రేక్ చేస్తూ సాగే సినిమాలో కొన్ని సీన్లు ఎందుకు ఉన్నాయో అర్థం కాని గందరగోళం కూడా ఉంటుంది. కొన్ని సీన్లు ఇరిటేటింగ్ గా కూడా అనిపిస్తాయి. కానీ క్రేజీ క్రేజీగా సాగే చాలా సీన్లు.. డైలాగులు యువ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. కథలో వచ్చే కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధంలో గందరగోళం ఎక్కువైపోయి సినిమా కొంచెం గాడి తప్పుతున్న భావన కలుగుతుంది. కానీ పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. యూత్ తో పాటు యూత్ ఫుల్ ఆలోచనలున్న వాళ్లు.. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రెండ్స్ ను ఫాలో అయ్యే వాళ్లు 'బాయ్స్ హాస్టల్'ను బాగా ఎంజాయ్ చేయగలరు. ఇది కన్నడ సినిమా అయినప్పటికీ ఆ ఫీలింగ్ కలగని విధంగా.. డబ్బింగ్ చాలా శ్రద్ధ పెట్టి.. స్ట్రెయిట్ సినిమా అనిపించేలా చేశారు. తరుణ్ భాస్కర్-రష్మిలతో ఒక అడిషనల్ ట్రాక్ కూడా పెట్టారు. అది సినిమాకు పెద్దగా ఉపయోగపడకపోయినా.. డబ్బింగ్ ఫీల్ రాకుండా చేస్తుంది.

ఆర్టిస్టులెవ్వరూ మనకు పరిచయం లేకున్నా.. అది పెద్ద సమస్య కాదు. వాళ్లెవ్వరూ నటిస్తున్నట్లుగా అనిపించదు. రియల్ సిచువేషన్లకు తగ్గట్లుగా బిహేవ్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. బాయ్స్ హాస్టళ్లలో వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేసిన సెటప్.. ఆర్ట్ వర్క్ ప్రశంసనీయం. ఇక కెమెరా పనితనం సినిమాలో మరో మేజర్ హైలైట్. రొటీన్ సినిమాలకు పూర్తి భిన్నమైన విజువల్స్ ఇందులో కనిపిస్తాయి. మనం ఒక హాస్టల్లోకి వెళ్లి నేరుగా అక్కడ తొంగి చూస్తున్న ఫీలింగ్ కలిగేలా కెమెరా వర్క్ సాగింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం కూడా సినిమాకు పెద్ద ఎసెట్. నేపథ్య సంగీతంతో పాటు సినిమాలో ఉన్న ఒక్క పాట హుషారు పుట్టిస్తుంది. దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి రొటీన్ కు భిన్నంగా ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా తీశాడు. అతను నటుడిగా కూడా ఓ కీలక పాత్రలో రాణించాడు. ఈ నగరానికి ఏమైంది.. జాతిరత్నాలు.. లాంటి తెలుగు సినిమాలతో కొంచెం పోలికలు ఉన్నప్పటికీ వాటిని మించి క్రేజీగా.. యునీక్ గా అనిపించే సినిమా ఇది. అందరికీ నచ్చే సినిమా కాదు కానీ.. నచ్చే వాళ్లకు మాత్రం ఇది క్రేజీ ఫన్ రైడ్ లాగా అనిపిస్తుంది.

చివరగా: బాయ్స్ హాస్టల్.. ఇదో రకం కామెడీ

రేటింగ్-2.75/5