బోయపాటి బర్తడే స్పెషల్.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి సినిమాల వైపు.. తెలియని విషయాలెన్నో!
ఒకవైపు చదువు మరొకవైపు స్టూడియో పనులు వార్తా రచనల్లో బిజీగా ఉండడంతో ఆ టైమ్ లో ఆయనకు సినిమాలపై ఆసక్తి ఉండేది కాదు.
By: Madhu Reddy | 25 April 2026 3:51 PM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత దర్శకుడిగా భద్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు బోయపాటి శ్రీను. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకొని ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత తులసి సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.ఇక తన మూడవ సినిమాగా నందమూరి బాలకృష్ణ, నయనతార , స్నేహ ఉల్లాల్ కాంబినేషన్లో వచ్చిన సింహ సినిమాతో తిరుగులేని డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ఒక సినిమా తర్వాత మరో సినిమాతో మంచి విజయాలను అందుకుంటూ బిజీగా మారిన బోయపాటి శ్రీను బర్తడే ఈరోజు.. ఆయన గురించి ఎన్నో విషయాలు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అలాంటి వాటిలో సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి సినిమా వైపు వచ్చారట.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. బోయపాటి శ్రీను 1971 ఏప్రిల్ 25న గుంటూరు జిల్లాలోని పెదకాకాని గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం కాగా.. శ్రీను మూడవ సంతానం. తండ్రి వ్యవసాయం చేస్తుంటే అన్నయ్య బ్రహ్మానందరావు మాత్రం ఫోటో స్టూడియో నిర్వహించేవాడు. ఇక బోయపాటి శ్రీను గుంటూరులో డిగ్రీ పూర్తి చేశాక అన్నయ్య ఫోటోగ్రఫీ స్టూడియో నిర్వహణలో సహాయం చేస్తూనే పత్రిక విలేకరిగా కూడా పనిచేశారు.
ఒకవైపు చదువు మరొకవైపు స్టూడియో పనులు వార్తా రచనల్లో బిజీగా ఉండడంతో ఆ టైమ్ లో ఆయనకు సినిమాలపై ఆసక్తి ఉండేది కాదు. ముఖ్యంగా చదువుతూనే పత్రికలు క్షుణ్ణంగా చదువుకోవడం , ఫోటోగ్రఫీ మీద ఆసక్తి మాత్రమే పెంచుకున్నాడు. అలా 1994లో ఎంఏ పూర్తి చేసిన తర్వాత పోలీస్ ఎస్ఐ కావడానికి పరీక్షలు, ఫిజికల్ టెస్ట్లు కూడా పూర్తి చేశాడు. ఉద్యోగానికి కూడా ఎంపిక అయ్యాడు. కానీ ఏదో కారణాల చేత ఆయన చేరలేదు. ఫోటోగ్రఫీ వ్యాపారం, పత్రిక రచన కొనసాగిస్తున్న సమయంలోనే బంధువు , సినిమా రచయిత పోసాని కృష్ణమురళి ఇంటికి వచ్చినప్పుడు.. సినిమా రంగంలో దర్శకత్వ శాఖలో సిఫార్సు చేస్తానని ..ఆసక్తి ఉంటే హైదరాబాద్ రమ్మని చెప్పారట.
1997లో కుటుంబ సభ్యుల ఆమోదం మేరకు హైదరాబాదు వెళ్లగా కృష్ణ మురళి సిఫారసు మేరకు ముత్యాల సుబ్బయ్య వద్ద దర్శకత్వ శాఖలో చేరి పెళ్లి చేసుకుందాం ,అన్నయ్య , గోకులంలో సీత వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక అప్పుడే సినిమాలపై అవగాహన పెంచుకుంటూ కొత్త కథలు రాయడం మొదలుపెట్టారు.
అలా తొలిసారి తన సినిమా కథను అల్లు అర్జున్ కి వినిపించి ఎలాగైనా ఫైనల్ చేయించాలని అనుకున్నారట. అలా తను రాసుకున్న స్క్రిప్ట్ ను అల్లు అరవింద్ కి వినిపించాడు. కథ బాగున్నా.. అది మాస్ యాక్షన్ కథ కావడంతో కొత్తగా హీరోగా ఎదుగుతున్న అల్లు అర్జున్ ఈ సినిమా చేస్తే ఆ తర్వాత లవ్ స్టోరీలు చేసేందుకు వీలుపడదని భావించిన అరవింద్.. ఈ కథను ఆమోదించలేదు. కానీ కథ బాగుంది కాబట్టి లీడ్ లో ఉన్న హీరోతో సినిమా చేస్తే సక్సెస్ అవుతుందని భావించి దిల్ రాజుకి కథ వినిపించమని చెప్పారట. ఇక కథ విన్న దిల్ రాజు రవితేజతో సినిమా తీశారు. అలా భద్ర సినిమా మంచి విజయాన్ని అందుకొని దర్శకుడిగా బోయపాటి శ్రీనుకి కెరియర్ను అందించింది.
